Home తాజా వార్తలు చంద్రుడిలోగుట్టు మట్టి పట్టి తెస్తోంది

చంద్రుడిలోగుట్టు మట్టి పట్టి తెస్తోంది

China Chang'e-5 Moon mission probe touches down

బీజింగ్ : చందమామ వెనుకవైపు చేరుకోవడమే కాదు చంద్రుడి మట్టిని సేకరించుకుని చైనా వ్యోమనౌక చాంగే 5 తిరుగుముఖం పట్టింది. చైనా అంతరిక్ష అధికారిక సంస్థ శుక్రవారం ఈ విషయం తెలిపింది. చంద్రుడి ఉపరితలంపై ఉండే రాళ్లు రప్పలు, మట్టినమూనాలను రెండు మీటర్ల లోతు వరకూ సేకరించి, రెండు కిలోల మేరకు మట్టిని తీసుకుని చాంగే 5 ఇప్పుడు తిరిగివస్తోందని వెల్లడించారు. ఈ అంతరిక్ష నౌకలో ఆర్బిటార్, ల్యాండర్ , అస్సెండర్ వంటి విడిభాగాలు ఉన్నాయి. ఇందులోని లూనార్ రోబో సాయంతో మట్టిని సేకరణ జరిగింది. గత నెల 24వ తేదీననే దీనిని అంతరిక్షంలోకి పంపించారు. చంద్రుడి ఉత్తర ప్రాంతంలోని మాన్స్ రూంకెర్ ప్రాంతంలో ఈ చాంగే దిగింది. ఎప్పుడూ కల్లోలభరితంగా ఉండే తుపాన్‌ల భరిత సముద్ర ప్రాంతంగా పేర్కొనే చోటనే చైనా నౌక దిగడం, అక్కడిని మట్టిని సేకరించుకుని తిరిగి వెనకకు మళ్లడం జరిగింది.

చంద్రుడిపై ఉన్న శాంపుల్స్‌ను తీసుకున్న తరువాత వాటిని భద్రపర్చుకుని నౌక సాంకేతికంగా ఎటువంటి లొసుగులు లేకుండా సాగుతోందని తెలిపారు. చైనా వ్యోమనౌకలో చంద్రుడిపై నుంచి శాంపుల్స్ సేకరణలో రెండు పద్ధతులు పాటించారు. డ్రిల్లింగ్ పద్థతిలో మట్టిని ఇతరత్రా శాంపుల్స్‌ను తవ్వడం , తరువాత వాటిని చేయి వంటి రోబో పరికరం సాయంతో భద్రపర్చడం జరిగింది. వివిధ ప్రాంతాలలో శాంపుల్స్‌ను సేకరించారని స్పేస్ ఏజెన్సీ తెలిపింది. 40 ఏళ్లలో చంద్రుడిపై మట్టిని భూమిపైకి తీసుకురావడం ఇదే తొలిసారి అవుతుంది. మానవరహితంగా వ్యోమనౌకను చంద్రుడిపైకి పంపించి నమూనాలను తీసుకురావడం ఇదే మొదటి సారి అయింది. ఇంతకు ముందు అమెరికా చంద్రుడి వద్దకు వ్యోమగాములను పంపించింది. వారి ద్వారా శాంపుల్స్ సేకరించి తీసుకువచ్చారు. ఇక సోవియట్ యూనియన్‌కు చెందిన మానవ రహిత లూనార్ యాత్ర సందర్భంగా కూడా శాంపుల్స్‌ను తీసుకువచ్చారు.

ఇప్పుడు చంద్రుడి వద్ద నుంచి చైనా నౌక ద్వారా వచ్చే శాంపుల్స్ శాస్త్రీయపరంగా అత్యంత కీలకమైనవి. విశ్వపు ఆవిర్భావం, భూమి చంద్రుడి పరిణామ క్రమం, సౌర వలయంలో ప్రభావాలు వంటి పలు అంశాలను విశిష్ట రీతిలో శాస్త్రీయంగా విశ్లేషించేందుకు ఈ నమూనాలు ప్రత్యేకించి, చంద్రుడి అత్యంత రహస్యాల నిక్షిప్తపు తుపాన్ కేంద్రీకృత సముద్ర ప్రాంతం నుంచి తెచ్చిన మట్టి ఎంతగానో ఉపకరిస్తుందని చాంగే 5 యాత్రా బృందం తెలిపింది. విశ్వ ఆవిర్భావం మధ్యలో తలెత్తిన విస్ఫోటనాల దశల్లో వేలకోట్ల ఏళ్ల క్రితం చంద్రుడి అనావిష్కృత ప్రాంతంలో సృష్టి రహస్యాలను విడమర్చే అత్యంత విలువైన మట్టి ఇతరత్రా నమూనాలు నిక్షిప్తం అయి ఉన్నాయని , వీటిని పట్టి తేవడం ద్వారా చైనా ఎటువంటి శాస్త్రీయ లోగుట్టు పసికడుతుందనేది ఇప్పుడు పరిశోధక చర్చగా మారింది.

China Chang’e-5 Moon mission probe touches down