Friday, March 29, 2024

కొవిడ్ వ్యాక్సిన్‌ను తొలిసారి ప్రదర్శించిన చైనా

- Advertisement -
- Advertisement -

కొవిడ్ వ్యాక్సిన్‌ను తొలిసారి ప్రదర్శించిన చైనా
తన ఉద్యోగుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్‌ను ఇచ్చిన సినోవాక్

China Firms on display covid vaccine for first time

బీజింగ్: దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ను చైనా తొలిసారిగా బహిరంగంగా ప్రదర్శించింది. సినోవాక్ బయోటెక్, సినోఫామ్‌లు తయారు చేసిన ఆ వ్యాక్సిన్లను బీజింగ్ ట్రేడ్‌ఫెయిర్‌లో ఈ వారంలో ప్రదర్శనకు ఉంచారు. ఈ వాక్సిన్లపట్ల చాలామంది ఉత్సుకత కనబరిచారు. ఈ రెండు వాక్సిన్లలో ఏది కూడా ఆమోదం పొందలేదు. అత్యంత కీలకమైన మూడో దశ ప్రయోగాలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేసుకున్న తర్వాత ఆమోదం లభించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, సినోవాక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను ఆ సంస్థకు చెందిన 90 శాతం మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులమీద ప్రయోగించారు. అత్యవసర వినియోగ కార్యక్రమం కింద ఈ వ్యాక్సిన్‌ను ఇచ్చినట్లు ఆ ఫార్మా సంస్థ సిఇఓ వీడాంగ్ మీడియాకు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగం కింద కొన్ని వర్గాల ప్రజలకు ఇవ్వాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. వారిలో వైద్య సిబ్బంది, ఆహార మార్కెట్లలో పని చేసే వారు, రవాణా, సేవల విభాగాల్లో విధులు నిర్వహించే వారున్నారు. కాగా ఈ వ్యాక్సిన్‌ను సినోవాక్‌కు చెందిన సుమారు 2,500నుంచి 3000 మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు స్వచ్ఛందంగా అందజేసినట్లు వీడాంగ్ వెల్లడించారు.

ఈ కార్యక్రమం కింద వినియోగించిన వ్యాక్సిన్ సురక్షితమైనదేనన్న ఆధారాలు వెలువడ్డాయి కానీ, అది రిజిస్టర్డ్ క్లినికల్ ట్రయల్‌లో భాగం కాదని ఆయన తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను వాణిజ్యపరంగా వాడాలా వద్దా అనే విషయాన్ని రెగ్యులేటరీ సంస్థలు నిర్ణయిస్తాయన్నారు. కాగా ఈ వ్యాక్సిన్ డోస్‌ను తీసుకున్న వారిలో వీడాంగ్, ఆయన భార్య, తల్లిదండ్రులు కూడా ఉన్నారు. ఇంకా తుది దశకు చేరుకోని ఈ వ్యాక్సిన్‌ను వేసేందుకు ఎంచుకున్న వారికి దీనివల్ల కలగనున్న దుష్ప్రభావాల గురించి ముందే వివరించినట్లు ఆయన చెప్పారు. అలాగే వ్యాక్సిన్‌ను తీసుకున్న వారిలో ప్రతికూల ప్రభావాలు కనిపించే రేటు చాలా తక్కువగా ఉంటుందని చెప్పారు. జ్వరం, నొప్పి, కొన్ని స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయని గతంలో నిర్వహించిన ట్రయల్స్ ఫలితాలలో సంస్థ వెల్లడించింది. కాగా తుది ఆమోదం లభించిన తర్వాత ఏడాదికి 30 కోట్ల డోస్‌లను ఉత్పత్తి చేయగల వ్యాక్సిన్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేసినట్లు సినోవాక్ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. కాగా తమ వ్యాక్సిన్ ద్వారా ఉత్పత్తయ్యే యాంటీ బాడీస్ ఒకటినుంచి మూడేళ్ల దాకా ఉండవచ్చని తాము భావిస్తున్నట్లు సైనోఫామ్‌సంస్థ చెప్తోంది. కాగా ఈ వ్యాక్సిన్ల ఖరీదు పెద్దగా ఉండదని ప్రతి రెండు డోసుల ధర వెయ్యి యువాన్‌లు(146 డాలర్ల) లోపే ఉండవచ్చని చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఇదివరకే వెల్లడించిన విషయం తెలిసిందే.

China Firms on display covid vaccine for first time

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News