
బీజింగ్: డోక్లాం ఎప్పటికీ తమదేననీ.. ఈ విషయంలో భారత్ జోక్యం చేసుకోవాలని చూస్తే తగిన శాస్తి చేస్తామని చైనా గట్టిగా హెచ్చరిక జారీచేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునియింగ్ సరిహద్దు వ్యవహారాలపై సోమవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డోక్లాం తమదేనని, అందుకు సంబంధించిన చారిత్రక ఒప్పందాలే ఆధారాలు అని అన్నారు. గతేడాది ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు తమ చాకచక్యం కారణంగానే వివాదం సర్ధుమణిగిందని ఆమె పేర్కొన్నారు. గతానుభవాల దృష్ట్యా భారత్ గుణపాఠాలు నేర్చుకుందనే భావిస్తున్నామని ఆమె తెలిపారు. తప్పులు సరిదిద్దుకుని, ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయటం మానుకుని దౌత్య సంబంధాలకు సహకరించాలని కోరుకుంటున్నామని, లేని పక్షంలో తీవ్ర పరిస్థితులను భారత్ ఎదుర్కోవాల్సివుంటుందని హువా చునియింగ్ హెచ్చరించారు.
ఇదిలా ఉండగా, మరోవైపు సిపిఇసి సమావేశంలో భారత రాయబారి గౌతమ్ బంబావాలే మాట్లాడుతూ.. భారత సరిహద్దుల్లో యథాతథ స్థితి (స్టేటస్ కో)ని చైనా ఉల్లంఘిస్తే మళ్లీ డోక్లాం తరహా పరిస్థితుల్లో పునరావృతమవుతాయని తీవ్రంగా హెచ్చరించారు. గతంలో ఎన్నడూ చూడని ఘటనలను సైతం చైనా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని గౌతం బంబాలే అన్నారు. ఈయన హెచ్చరికల నేపథ్యంలోనే చైనా గట్టిగా బదులిచ్చింది.