Home ఎడిటోరియల్ ఏడు పదుల జనచైనా

ఏడు పదుల జనచైనా

చైనాలో కూరగాయలమ్మేవారి బుట్టలో చిన్న సైజు మావో సే టుంగ్ ఫోటో కనిపిస్తుంది అని భారత చైనా మిత్రమండలి తరపున చైనా సందర్శించిన వారు చాలా ఏళ్ల క్రితం చెప్పినట్టు గుర్తు. మిత్రమండలి పరిస్థితి ఎలా ఉన్నా జనచైనా నిర్మాతగా మావో చైనీయుల మనసులో పదిలంగా ఉన్నట్లు ఈ అక్టోబర్ మొదటి వారంలో జరిగిన 70వ చైనా జాతీయ దినోత్సవం రుజువు చేస్తోంది. దేశ ఆవిర్భావ దినోత్సవ సంబరాలు జరుపుకొన్న బీజింగ్‌లోని తియానన్మెన్ స్కేర్‌లో మావో భారీ చిత్ర పటానికి నివాళులర్పించారు. మావో ఇష్టంతో ధరించే ముదురు పోకరంగు సూటులో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ఈ ఉత్సవానికి హాజరయ్యారు. అంతేకాకుండా అక్టోబర్ 1, 1949లో ఏ చోట నిలబడి మావో సైనిక వందనాన్ని స్వీకరించారో అదే చోట నిలబడి జిన్‌సింగ్ దేశాధ్యక్షుడుగా ప్రసంగించారు.

ఈ అక్టోబర్ ఒకటకి పీపుల్స్ రిపబ్లిక్ చైనా 70 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఎప్పటి మాదిరే చైనా రాజధాని బీజింగ్‌లో ప్రసిద్ధమైన తియానన్మెన్ కూడలి వద్ద పెద్ద ఎత్తున సంబరాలు జరిగాయి. చైనా కమ్యూనిస్టు పార్టీ పాలక మండలికి చెందిన పాత, కొత్త నాయకులు పాల్గొన్నారు. 70 ఏళ్ల క్రితం దేశం చేతిలో ఉన్న 17 యుద్ధ విమానాలను తిప్పి తిప్పి ప్రదర్శించి ఎక్కువ సేపు విన్యాసాలు జరిపినట్లు తృప్తిపడ్డారు. ఇప్పుడు 15000 ట్రూపులతో అధునాతన ఆయుధ సామాగ్రి ప్రదర్శిన జరిగింది. అందులో హైపర్ సోనిక్ డ్రోన్లు, ఇంటర్‌కాంటినెంటల్ బలాస్టిక్ మిసైళ్లు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనమున్న స్థానం నుండి కదిలించే శక్తి ప్రపంచంలో ఏదీ లేదు అని అధ్యక్షుడు జిన్‌పింగ్ దేశ ప్రజలకు ఇచ్చిన సందేశానికి ఆయుధ పాటవశక్తి ప్రదర్శన నిదర్శనంగా నిలుస్తుంది. ఆయన ప్రసంగంలో ప్రధానంగా దేశ ఆర్థిక అభివృద్ధిని అందులో పార్టీ నిర్వహించిన అమోఘమైన పాత్రను ప్రస్తావించారు.

గతంలో చైనా 5, 10, 35, 50, 60 సంవత్సరాలు పూర్తి చేసుకొన్న సందర్భంగా ఇదే విధంగా భారీ ఎత్తున ఆవిర్భావ వేడుకలు జరుపుకొంది. జాతీయ దినోత్సవాన్ని నిర్వహించుకొనేందుకు దేశం యావత్తు 7 రోజులు సెలవులు ప్రకటిస్తుంటారు. వాస్తవానికి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించేది 3 రోజులే అయినా సెలవు తీసుకునేందుకు ముందే రెండు పని దినాలు సెలవుల్లో పనులు చేస్తారు. వారాంతంగా శని, ఆది వారాలు కలువడంతో 7 రోజులు వరుసగా సంబరాలకు అవకాశం ఉంటుంది. పర్యాటకం కోసం చైనీయులు ఈ సమయాన్ని వినియోగించుకుంటారు. దేశంలోని అన్ని దర్శనీయ స్థలాలు సందర్శకుల తాకిడితో సందడిగా మారుతాయి. వ్యాపార కేంద్రాలైన మాల్స్ భారీ డిస్కౌంట్లు ప్రకటిస్తాయి.

అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, జర్మనీ దేశాల్లో ప్రవాసులుగా ఉన్న చైనా దేశీయులు తమ జాతీయ దినాన్ని జరుపుకుంటూ ఉంటారు. అమెరికాలోని చైనీయులు ఈ అక్టోబర్ ఒకటిన తమ జాతీయ జెండా చేబూని భారీ ప్రదర్శనను నిర్వహించి జాతీయ గీతాన్ని ఆలపించి తమ దేశం పట్ల ఉన్న ప్రేమాభిమానాన్ని ప్రదర్శించారు. వ్యవసాయిక దేశమైన చైనా సాంకేతిక విద్య, ఉత్పత్తులను ఆధారంగా చేసుకొని 50 ఏళ్ల కాలంలోనే ప్రపంచంలో రెండో శక్తివంతమైన దేశంగా ఎదిగింది. 2014 నుండి ఆర్థికాభివృద్ధిలో మొదటి స్థానంలో నిలుస్తోంది. స్థూల జాతీయ ఉత్పత్తి (జిడిపి)లో అమెరికా 2019లో 21.4తో తొలి స్థానంలో ఉండగా చైనా 15.54 శాతంతో రెండో స్థానంలో ఉంది.

ప్రస్తుతం దేశ ఆర్థికాభివృద్ధిలో వ్యవసాయ రంగం 8 శాతం పడిపోగా పరిశ్రమల రంగంలో 40.5 శాతం ఎగబాకింది. సేవా రంగం మిగతా 51.5 శాతం ఆక్రమించుకుంది. 2017 లెక్కల ప్రకారం 140 కోట్ల జనాభాలో 68 శాతం మందికి పని దొరుకుతోంది. 27 శాతం జనాభా ఇప్పటికీ వ్యవసాయమే వృత్తిగా బతుకుతుండగా 29 శాతం పరిశ్రమల్లో, 44 శాతం సేవా రంగంలో ఉపాధి పొందుతున్నారు. 2018 నాటికి జనాభాలో 4 శాతం మాత్రమే నిరుద్యోగులున్నారు.

సిమెంటు, రసాయనాలు, ఎరువులు, రవాణా సామాగ్రి,ఆటో మొబైల్స్, టెలికాం ఉత్పత్తులు, రైలు ఇంజన్లు, విమానాలు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ చైనాలోని ప్రధాన పరిశ్రమలు. వీటి ఎగుమతుల ద్వారా చైనాకు భారీ ఆదాయం ఉంది. దేశీయ ఉత్పత్తి ఎగుమతుల్లో 64 శాతం ఎలక్ట్రానిక్ రంగానికే చెందుతుంది. వీటిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో అమెరికా (19.25%), యూరోపియన్ యూనియన్ (16.43%) తో తొలి స్థానాల్లో ఉన్నాయి.

1990 దాకా చైనాలో విదేశీ పెట్టుబడులపై నిషేధం ఉండేది. ఆ తర్వాత కేవలం పెట్టుబడులకు తెర లేచింది. విదేశీ పెట్టుబడుదారులకు కంపెనీ బోర్డులో స్థానముండదు. భాగస్వామిగా కాకుండా లాభాల్లో వాటాదారుగా కొనసాగవచ్చు. 1997 నాటికి మరింత మార్పు వచ్చింది. షాంఘైలో విదేశీ బ్యాంకుల శాఖలు తెరవబడ్డాయి. 2000 నాటికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మరింత మార్గం సుగమమైంది. విదేశీ పెట్టుబడుల సహాయంతోనే దేశంలో ప్రస్తుత ఆర్థికాభివృద్ధి సాధ్యమైందని దేశ నాయకుల అభిప్రాయం. విదేశీ మారక ద్రవ్యం అధికంగా కలిగిన ఉన్న దేశాల్లో చైనాది ప్రథమ స్థానం. 2008లో జపాన్‌ను వెనక్కితోసి చైనా తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2013లో ఆరంభించిన ‘షాంఘై ఫ్రీ ట్రేడ్ జోన్’ చైనాలో విదేశీ పెట్టుబడులకు సింహ ద్వారంగా భావించాలి. అమెరికాకు అప్పు ఇచ్చిన దేశాల్లో చైనా ప్రథమ స్థానంలో ఉంటుంది. ఇప్పటికిప్పుడు చైనా అప్పు తీర్చమంటే అమెరికా ఆర్థికంగా కుప్పకూలుతుందని ఆర్థిక వేత్తలు అంటారు. చైనా కరెన్సీ అయిన 7 యెన్‌లు ఒక అమెరికా డాలర్‌తో సమానం.

ఇదంతా ఒక పార్శమైతే మరో వైపుగా చైనా పత్రికా స్వేచ్ఛపై , ప్రజాస్వామ్య వాదులపై ఉక్కు పాదం మోపుతోందని విదేశీ పత్రికలు రాస్తుంటాయి. 1989లో తియానన్మెన్ మారణకాండలో ఎందరో యువకులు ప్రభుత్వ విధానాల్ని వ్యతిరేకించి మిలటరీ కాల్పుల్లో మరణించారు. ఈ మారణ కాండ తర్వాత జాతీయవాద విద్యా విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ప్రపంచీకరణ, ఆర్థికాభివృద్ధి, అసమానతల నివారణ, పర్యావరణ రక్షణ తదితర అంశాలు పాఠ్య భాగాల్లో చేరాయి. జాతీయ, మతవాదులను రాజకీయ శిక్షణా క్యాంపులకు పంపిస్తున్నారు. అక్కడ కమ్యూనిస్టు సూత్రాలను బోధించి మతవాద భావనలను తొలగిస్తుంటారని విదేశీ పత్రికా విలేకరులు రాస్తుంటారు. ప్రజలే స్వయంగా ఈ క్యాంపులకు వస్తుంటారని చైనా అంటోంది.

ఆ తర్వాత పౌరులపై నిఘా కూడా పెరిగింది. బెర్లిన్‌కు చెందిన క్యూర్ 53 అనే సెక్యూరిటీ కంపెనీ చైనాలో పని చేస్తోంది. విదేశాలకు వెళ్లిన పౌరులు వెంటనే తిరిగి రావడంపై, మత సంస్థలకు విరాశాలు సేకరించే వారిపై, అనుకోకుండా విద్యుచ్ఛక్తి వాడకం పెరిగిన చోటుపై నిఘా ఉంటుంది. వారి వాహనాల రంగు, నెంబర్లు ఆధారంగా ఆ యాప్ కన్ను వెంటాడుతుంది. ఎర్రజెండా పట్టుకొని ప్రజల జీవన విధానాన్ని మార్చివేసిన చైనా ప్రపంచంలో మరే ఇతర ఎర్ర జెండాధారులతో సంబంధాలు ఏర్పరచుకోవడం లేదు. మావో సమయంలో మన దేశంలోని నక్సల్బరీ నాయకులు ఆయనను కలిసినట్లు భారత దేశంలో అరుణ తార పొడిచిందని ఆయన రేడియో పీకింగ్‌లో మాట్లాడినట్లు రుజువులున్నాయి.ప్రస్తుత చైనా నాయకులకు కమ్యూనిజం విస్తరణ కన్నా దేశ ఆర్థిక అభివృద్ధి ముఖ్యంగా ఉందనవచ్చు. అక్టోబర్ రెండో వారంలో ప్రధాని మోడీతో మహాబలిపురంలో విహార యాత్ర, ద్వైపాక్షిక మంతనాలు జరిపిన చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భారత్‌లో ఉన్న కమ్యూనిస్టు పార్టీల ఊసైనా ఎత్తకపోలేదు.

China History in Telugu

బి.నర్సన్
9440128169