Home బిజినెస్ అలీబాబాకు జాక్ బై..బై..

అలీబాబాకు జాక్ బై..బై..

China richest man Jack Ma announces retirement

బీజింగ్: చైనా ఇకామర్స్ దిగ్గజ సంస్థ ‘అలీబాబా’ సహవ్యవస్థాపకుడు జాక్ మా(54) రిటైర్ కాబోతున్నట్లు ప్రకటించారు. ఆయన ‘న్యూయార్క్ టైమ్స్’కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించారు. సోమవారం నుంచి పూర్తి కాలాన్ని విద్యా దాతృత్వంపై కేంద్రీకరించనున్నట్లు తెలిపారు. 1999లో అలీబాబాలో చేరకముందు జాక్ మా ఇంగ్లీష్ టీచర్‌గా పనిచేస్తుండేవారు. మల్టీబిలియన్–డాలర్ ఇంటర్నెట్ దిగ్గజ సంస్థను నిర్మించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు. తన స్వదేశంలో ఆయన ఎంతో గౌరవనీయ స్థాయికి ఎదిగారు. అలీబాబా కంపెనీ ఎదుగుదలతోపాటు ఆయన స్వంత ఆస్తి కూడా చాలా పెరిగింది. ప్రస్తుతం ఆయన ఆస్తి శుక్రవారం ముగిసిన స్టాక్ మార్కెట్ రేటు ప్రకారం 420.8 బిలియన్ డాలర్లు.
అసాధారణరీతిలో రిటైర్మెంట్ ప్రకటన
తన 54వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం తాను కంపెనీ నుంచి రిటైర్ కాబోతున్నట్లు జాక్ మా ‘న్యూయార్క్ టైమ్స్’కు తెలిపాడు. దీంతో తాను జీవితంలో మరో కొత్త కాలాన్ని(ఎరా) ఆరంభిస్తానన్నారు. 2013లోనే సిఇఒ పదవి నుంచి తప్పుకున్న జాక్ ఇప్పుడు తన సమయాన్ని, సంపదను విద్యకు అంకితం చేస్తానంటున్నారు. ఆయన అనూహ్యరీతిలో తన రిటైర్మెంట్‌ను ప్రకటించారు. చైనాలో ‘న్యూయార్క్ టైమ్స్’పై నిషేధం ఉంది. అక్కడి కమ్యూనిస్టు పార్టీ సెన్సార్ ఆ పత్రికపై సెనార్ విధించింది. అలాంటి పత్రికకు జాక్ మా ఇంటర్వూ ఇవ్వడం వింతేనని భావించాలి. అయితే ఈ అంశంపై శనివారం అలీబాబా సంస్థ నుంచి ఎటువంటి ప్రకటన వెలువడలేదు. కానీ బ్లూమ్‌బర్గ్ టివిలో శుక్రవారం ప్రసారమైన ఇంటర్వూలో ఆయన తన రిటైర్మెంట్ యోచనను వెలిబుచ్చారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ అడుగుజాడల్లో నడుస్తానన్నారు. బిల్‌గేట్స్ నుంచి తాను నేర్చుకోవలసింది చాలా ఉందన్నారు. ఆయనంత సంపన్నుణి కాలేను అని, కాకపోతే వీలయినంత పిన్న వయసులోనే రిటైర్ అవుతానని జాక్ చెప్పారు. ‘ఏదో ఒక రోజున నేను మళ్లీ బోధన రంగానికి వెళతాను’అన్నారు. అమెరికాకు గూగుల్, ఫేస్‌బుక్ ఎంతటి శక్తు సమ్మేళనమో చైనాకు అలీబాబా, టెన్సెంట్, బైదు, జెడి డాట్ కామ్ అంతటి సమ్మేళనం(కాంగ్లోమెరేట్స్) అని చెప్పాలి. చైనాలో పారిశ్రామికవేత్తలు తమ 80 దశకం వయస్సు వరకు వ్యాపారం నిర్వహిస్తుంటారు. హాంకాంగ్‌కు చెందిన దిగ్గజం లీ కషింగ్ తన 89వ ఏట మే నెలలో రిటైర్ అయ్యారు.
పేదరికం నుంచి ప్రస్థానం
పేదరికం నుంచి సంపన్నుడి స్థాయికి ఎదిగిన జాక్ మా ప్రస్థానం ఎంతో అసాధారణమైనది. జేజియాంగ్ తూర్పు ప్రాంతంలోని హ్యాంగ్జూలో ఓ పేద కుటుంబంలో ఆయన జన్మించాడు. ఆయన తర్వాత యూనివర్సిటీ టీచర్ అయ్యారు. కానీ ఇంటెర్నెట్ ఆవిష్కరణ తర్వాత ఆయన తన ఉద్యోగాన్ని వదిలేశారు. 1999లో అమెరికా వెంచర్ క్యాపిటలిస్టులు ఆయనను దెబ్బతీస్తే డబ్బుకు కటకటపడ్డాడు. అలాంటి స్థితిలో ఆయన ‘అలీబాబా’ సంస్థను మొదలెట్టడానికి 60వేల డాలర్లను ఇవ్వమని తన మిత్రులను ఒప్పించాడు. ఆ సంస్థ ఆరంభంలో హ్యాంగ్జూలో ఓ చిన్న అపార్ట్‌మెంట్ నుంచి మొదలైంది.
మారిన పరిస్థితుల నేపథ్యం
తన టెక్ ప్రత్యర్థి చైనాలోకి అడుగుపెట్టిన కొన్ని వారాలకే జాక్ మా రిటైర్మెంట్‌ను ప్రకటించారు. అలీబాబా సంస్థకు ప్రధాన పోటీ సంస్థ అయిన జెడి డాట్ కామ్ వ్యవస్థాపకుడు రిచర్డ్ లియు గత వారం ఓ అత్యాచారం ఆరోపణ కింద అమెరికాలో అరెస్టయ్యాడు. విడుదలయ్యాక అతడు చైనాకు తిరొగొచ్చాడు. అయితే అతడిపై దర్యాప్తు ఇంకా ఉంది. ఇదిలా ఉండగా ఇంటర్నెట్ గేమింగ్ దిగ్గజం టెన్సెంట్, ప్రత్యర్థి ఇపేమెంట్ సంస్థ నియంత్రణల ఒత్తిళ్ల కారణంగా చాలా నష్టపోయింది. దాని షేరు ధరలు, లాభాలు కుంచించుకుపోయాయి.

ఎంతో ఎత్తుకు ఎదిగిన సంస్థ
‘నేను తొలిసారి ఇంటర్నెట్ ఉపయోగించినప్పుడు, కీబోర్డును ముట్టుకున్నాను. అప్పుడు నాకనిపించింది ఇదే నాగమ్యం అని. ఆ నా ప్రస్థానం చైనాలోనూ, ప్రపంచంలోనూ మార్పు తేగలదని అనిపించింది’ అని ఆయన ఒకానొకప్పుడు సిఎన్‌ఎన్‌తో అన్నారు. ఇప్పటికీ కంపెనీ ప్రధాన కేంద్రం ఆయన హోంటౌన్‌లోనే ఉంది. తొలుత వస్తువులను ఆన్‌లైన్‌లో పరస్పరం అమ్ముకునే సంస్థగా ఆరంభమైన ఆ కంపెనీ తర్వాత చైనాలో అతి పెద్ద రిటైల్ మార్కెట్‌గా ఎదిగింది. అది చైనా ప్రజల షాపింగ్ విధానాన్నే మార్చేసింది. ఇప్పుడైతే ఆ కంపెనీ అలీపే డిజిటల్ పేమమెంట్ సర్వీస్ కూడా వచ్చేసింది. ప్రస్తుతం అలీబాబా ఆన్‌లైన్ రిటైల్ , పేమెంట్స్ స్థాయిలను అధిగమించి క్లౌడ్ కంప్యూటింగ్, డిజిటల్ మీడియా, ఎంటర్‌టైన్మెంట్ వంటి అన్ని రంగాల్లోకి ప్రవేశించింది. దాంతో ఆ కంపెనీ ఆదాయం జూన్ 30కల్లా ముగిసిన త్రైమాసికంలో మరో 61 శాతం పెరుగుదలను చూసింది. జాక్ మా సంపద 38.6 బిలియన్ డాలర్లుం ఉంటుందని ఫోర్బ్ అంచనా వేసింది. తాయ్ చీ ఉపాసకుడైనా ఆయన వ్యాపార వ్యూహాల్లో, కార్పొరేట్ కల్చర్‌లో కూడా చైనా యుద్ధకళలను ప్రయోగించారు. అలీబాబా సంస్థపై ఆ కంపెనీ మాజీ ఉద్యోగి పోర్టర్ ఎరిస్మాన్ ‘క్రొకోడైల్ ఇన్ ద యాంగ్జీ’ అనే డాక్యుమెంటరీ నిర్మించారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఎంత ప్రసిద్ధమో చైనాలో యాంగ్జీ కూడా అంత ప్రసిద్ధమైనది.