Friday, April 19, 2024

తప్పిన పెను ప్రమాదం.. హిందూ మహాసముద్రంలో పడ్డ చైనా రాకెట్

- Advertisement -
- Advertisement -

భూమికి తప్పిన ముప్పు….మాల్దీవులకు దగ్గర పతనం
భయపెట్టి ముప్పుతిప్పలు పెట్టిన లాంగ్‌మార్చ్
డ్రాగన్ వ్యవహారంపై ప్రపంచవ్యాప్త నిరసనలు

China Rocket falls into Hindu Mahasamudram Sea

బీజింగ్: ఎక్కడ భూమిపై పడుతుందోననే ప్రపంచవ్యాప్త భయాందోళనలు రేకెత్తించిన చైనా లాంగ్‌మార్చ్ రాకెట్ ఎట్టకేలకు హిందూమహాసముద్రంలో పతనం అయింది. దీని శకలాలు శూన్యస్థితిలోనే మండిపోతూ చివరికి భూ వాతావరణంలోకి ప్రవేశించాయి. తరువాత రాకెట్ మిగిలిన శకలాలు మాల్ధీవులకు పశ్చిమాన హిందూ సముద్రంలో ఆదివారం కుప్పకూలాయని చైనా అంతరిక్ష సంస్థ తెలిపింది. నిర్ధేశిత కక్షలో నుంచి పట్టుజారి ఈ రాకెట్ ఎక్కడైనా భూమిని అతి వేగంగా తాకవచ్చునని, దీనితో అపార ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లనుందని అమెరికాతో పాటు పలుదేశాల రాకెట్, అంతరిక్ష పరిశోధనల నిపుణులు విశ్లేషించారు. ఇది ఢిల్లీకి సమీపంలో నేలకు తాకుతుందని కూడా అంచనాలు వెలువడ్డాయి. అయితే అటువంటిదేమీ లేదని, ఇది అంతరిక్షంలోనే మండిపోతుందని, పెద్దగా ప్రమాదం ఏదీ ఉండదని చైనా సైంటిస్టులు చెపుతూ వచ్చారు. ఆదివారం ఇది సముద్రంలో కుప్పకూలిన విషయాన్ని నిర్థారించారు. లాంగ్‌మార్క్ 5 బి రాకెట్ బీజింగ్ కాలమానం ప్రకారం ఉదయం 10ః24 ప్రాంతంలో భూ వాతావరణంలోకి వచ్చింది.తరువాత సముద్రం వైపు దూసుకువెళ్లి కూలిందని ఎటువంటి ముప్పు లేదని, ఎవరికి గాయాలు లేదా నష్టం వాటిల్లలేదని చైనా అధికారిక స్పేస్ ఇంజనీరింగ్ కార్యాలయాన్ని ఉటంకిస్తూ చైనా వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఈ 22 టన్నుల బరువు ఉండే రాకెట్ శకలాలు అత్యంత భారీ స్థాయివి. దశాబ్దాల కాలంలో ఇంతటి పరిమాణపు శకలాలు భూమివైపు దూసుకురావడం ఇదే తొలిసారి.

ప్రపంచవ్యాప్తంగా ఓ వైపు చైనా మూలకారక కరోనా వైరస్ భయాలు పట్టిపీడిస్తున్న దశలోనే నింగిలో ఈ రాకెట్ విశృంఖల పయనం, ఎటు నుంచి ఎటు దూసుకువస్తుందో, ఏ దేశం నెత్తిన పడి ఏ విధ్వంసం సృష్టిస్తుందో తెలియక ఇన్ని నాళ్లు అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. ఇది హిందూ మహాసముద్రంలో నౌకాయాన సూచీకల మేరకు చూస్తే 72.47 తూర్పు రేఖాంశం 2.65 ఉత్తర దిశ రేఖాంశం పాయింట్లలో పడ్డాయి. అయితే అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ రాకెట్ తిరిగి అరేబియా ద్వీపకల్పం ప్రాంతంలోకి చేరుకుందని తెలిపింది. అయితే చైనా మీడియా సంస్థ తెలిపినట్లుగా హిందూ మహాసముద్రంలో శకలాలు పడ్డ వార్తను ఏ విధంగా కూడా ధృవీకరించలేదు. నిజానికి ఈ శకలాలు భూమిపై కానీ సముద్ర ఉపరితలంపై కానీ ఏమైనా విధ్వంసం సృష్టించిందీ లేనిదీ తెలియదని తెలిపింది. అమెరికా సైనిక సమాచారాన్ని క్రోడీకరించుకుని సమాచారం తెలిపే మానిటరింగ్ సర్వీసు స్పేస్ ట్రాక్ తెలిపిన వివరాల ప్రకారం రాకెట్ సౌదీ అరేబియాపై ఉందని, తరువాతి దశలో క్రమేపీ మాల్దీవుల వద్ద హిందూ మహాసముద్రంలో పడిందనే విషయాన్ని తెలిపాయి. రాకెట్ అదుపు తప్పడం, ఇది పతనం చెందుతూ భూమివైపు దూసుకురావడం వంటి పరిణామాలపై అమెరికా ఇతర దేశాలు చైనాపై విరుచుకుపడ్డాయి. జనసమ్మర్థపు ప్రాంతాలపై రాకెట్ పడితే వచ్చే నష్టానికి చైనా బాధ్యత వహించాల్సిందే అని తెలిపాయి.

అమెరికా, యూరప్ వెబ్‌సైట్లు ఈ రాకెట్ పతన ప్రయాణాన్ని కనుగొని ఎప్పటికప్పుడు వార్తలు వెలువరించాయి. ఈ క్రమంలో ఇది ఎక్కడైనా ఎప్పుడైనా పడవచ్చునని వెలువడ్డ వార్తలు ప్రపంచవ్యాప్తంగా కంగారు పుట్టించాయి. సోషల్ మీడియాలో లెక్కలేనని వార్తలు పుట్టుకొచ్చాయి. అంతరిక్ష ప్రయాణాలకు రాకెట్లు పంపే దేశాలు అత్యవసరంగా పలు జాగ్రత్తలు తీసుకుని తీరాలి. ప్రత్యేకించి భూమిపై ప్రజల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణ దిశలో ఎటువంటి ముప్పు వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత ప్రయోగాలకు దిగిన దేశాలపై ఉందని అమెరికా రక్షణ మంత్రి లాయడ్ ఆస్టిన్ తెలిపారు. అంతరిక్ష శకలాలు వాతావరణంలో పేరుకుపోవడం, ఇతరత్రా ప్రమాదాలకు దారితీసే పరిస్థితి కల్పించడం వంటి వాటి విషయంలో చైనా బాధ్యతారాహిత్యం ఇప్పుడు తెలిసిందని అమెరికా ఆక్షేపించింది. ఎప్రిల్ 29వ తేదీననే భూ ఉపరితలం నుంచి ఈ రాకెట్‌ను నిర్ధేశిత కక్షలోకి తీసుకువెళ్లారు. అయితే తరువాత కొద్ది రోజులకే ఇది ఎత్తు స్థాయి తగ్గడంతో పతనావస్థకు దారితీసింది. అంతరిక్ష కేంద్రంనిర్మాణ పనుల్లో భాగంగానే చైనా గతవారం ఈ రాకెట్‌ను ప్రయోగించింది. అంతరిక్ష కేంద్ర కోర్ మాడ్యూల్‌ను ఇది విజయవంతంగా మోసుకువెళ్లింది. అయితే నియంత్రణ కోల్పోవడంతో పతనానికి దారితీసింది. గత ఏడాది చైనా తొలిసారి లాంగ్‌మార్చ్ బిని ప్రయోగించినప్పుడు దీని శకలాలు ఐవరీ కోస్ట్‌పై పడి పలు గ్రామాలు దెబ్బతిన్నాయి.

China Rocket falls into Hindu Mahasamudram Sea

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News