Home అంతర్జాతీయ వార్తలు చైనా దురాక్రమణకు పాల్పడలేదు

చైనా దురాక్రమణకు పాల్పడలేదు

China Sets Up Village Within Bhutan
కొత్త గ్రామం నిర్మాణంపై భూటాన్ స్పష్టీకరణ

న్యూఢిల్లీ: వివాదాస్పద డోక్లామ్‌కు సమీపంలో తమ దేశ భూభాగంలో 2 కిలోమీటర్లు చొచ్చుకువచ్చి చైనా ఒక గ్రామాన్ని నిర్మించిందన్న వార్తలను భూటాన్ శుక్రవారం ఖండించింది. అయితే ఉపగ్రహ చిత్రాలు, భూటాన్ చిత్రపటం భూటాన్ ప్రకటనకు పూర్తి భిన్నంగా ఉండడం గమనార్హం. భూటాన్ భూభాగంలోనే చైనా ఏర్పాటు చేసుకున్న కొత్త గ్రామం ఉన్నట్లు భూటాన్ ప్రభుత్వం రాజముద్ర వేసిన ఆ దేశ చిత్రపటం ఎన్‌డిటివికి లభించింది. భూటాన్ సరిహద్దుల్లోకి 2 కిలోమీటర్లు చొచ్చుకువెళ్లిన చైనా అక్కడే ఒక గ్రామాన్ని సైతం నిర్మించిందని ఎన్‌డిటివి ప్రసారం చేసిన వార్తాకథనాన్ని భూటాన్ ప్రభుత్వం ఖండించింది. ఈ వార్తలపై భారత్‌లోని భూటాన్ రాయబారి మేజర్ జనరల్ వెట్సాప్ నాంగీ శుక్రవారం స్పందిస్తూ భూటాన్‌లోపల చైనా గ్రామమేదీ లేదని స్పష్టం చేశారు. వివాదాస్పద డోక్లామ్ సమీపంలోని సరిహద్దులపై భూటాన్, చైనా ఏదైనా అవగాహనకు వచ్చాయా అన్న విలేకరుల ప్రశ్నకు సరిహద్దు వ్యవహారాలపై తాను మాట్లాడబోనని భూటాన్ రాయబారి అన్నారు.

అయితే..సరిహద్దులపై భూటాన్, చైనా చర్చలు జరుపుతున్నాయని, కరోనా వైరస్ కారణంగా ఇవి కొంత కుంటుపడ్డాయని మాత్రం ఆయన అంగీకరించారు. ఇదిలా ఉండగా..చైనా అధికార మీడియా సిజిటిఎన్‌కు చెందిన సీనియర్ ప్రొడ్యూసర్ షెన్ షివీ గురువారం భూటాన్‌లో కొత్తగా ఏర్పడిన గ్రామానికి సంబంధించిన పలు చిత్రాలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. యాడోంగ్‌కు దక్షిణాన 35 కిలోమీటర్ల దూరంలో లోయను ఆనుకుని కొత్తగా నిర్మించిన పంగ్డా గ్రామంలో మనకు కొందరు శాశ్వత నివాసులు జీవిస్తున్నారంటూ ఆయన ట్వీట్ చేశారు. దీనిపై ఆస్ట్రేలియా స్ట్రేటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ఉపగ్రహ చిత్రాల విశ్లేషకుడు నాతన్ రూసర్‌తోసహా పలువురు అంతర్జాతీయ పరిశీలకులు స్పందించారు. చైనా కొత్తగా నిర్మించిన గ్రామానికి చిత్రాలను బట్టి చూస్తే ఇది భూటాన్ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించడమేనని వారు అభిప్రాయపడ్డారు.