Home ఎడిటోరియల్ భారత్‌-ఆసియన్ మమేకత

భారత్‌-ఆసియన్ మమేకత

sampadakeyam

పది ఆగ్నేయాసియా దేశాలతో కూడిన ఆసియన్‌తో భారత్ సంబంధాల అభివృద్ధి ఆకాంక్ష కొత్త మొగ్గతొడిగింది. ఆసియన్ దేశాల(ఇండోనేషియా, సింగపూర్, ఫిలిప్పీన్స్, మలేసియా, బ్రూని, థాయిలాండ్, కంబోడియా, వియత్నాం, లావోస్, మయన్మార్) రాజ్య/ప్రభుత్వ అధినేతలతో ఢిల్లీలో భారత ప్రభుత్వం నిర్వహించిన శిఖరాగ్రసభ బహుళపక్ష, ద్వైపాక్షిక సంబంధాల్లో మందకొడితనాన్ని తొలగించే అవకాశం కల్పించింది. భద్రత, వాణిజ్యం, ఆర్థిక సహకారం, ప్రాంతీయ సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఆర్‌సిఇపి), హిందూ మహా, దక్షిణ చైనా సముద్రాల్లో నౌకాయాన స్వేచ్ఛ ప్రధానంగా చర్చకు వచ్చాయి. ఢిల్లీ డిక్లరేషన్ ఈ అంశాలను వక్కాణించింది. ఆసియన్ దేశాలతో రవాణా సంబంధాలను వేగవంతం చేయటం మన ఈశాన్య భారత్ లో మౌలిక వసతుల అభివృద్ధికి దోహదం చేస్తుంది. వాణిజ్యం రీత్యానేగాక వ్యూహాత్మకంగా కూడా ఆ ప్రాంతం భారత్‌కు ముఖ్యమైంది. అయితే కారణాలేమైతేనేం, భౌగోళిత సామీప్యతగల ఆ ప్రాంతంతో భారత్ సంబంధాల వృద్ధి హంసపాదులతో సాగుతుండగా, చైనా సంబంధాలు వేగం పుంజుకున్నాయి. ఉదాహరణకు, 201415లో భారత్‌ఆసియన్ వాణిజ్య విలువ 76.53 బిలియన్ డాలర్లు కాగా చైనాఆసియన్ వాణిజ్య విలువ 452.2 బిలియన్ డాలర్లు. దక్షిణ కొరియా, జపాన్, ఆస్ట్రేలియా వాణిజ్య విలువ కూడా మనదేశం కన్నా హెచ్చుగా ఉంది. అలాగే ఆసియన్ దేశాల్లో భారత్ పెట్టుబడులు 201516లో 22.4కోట్ల డాలర్లు కాగా, అదే కాలంలో చైనా పెట్టుబడులు 300కోట్ల డాలర్లకు పైమాటే. చైనాభారత్ వాణిజ్యంలో కూడా చైనా ఎంతో మిగులుతో ఉంది.
ఆసియన్‌తో వాణిజ్య అభివృద్ధికి భారత్‌ మయన్మార్‌ థాయిలాండ్ జాతీయ రహదారి, మయన్మార్‌తో కలడన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్టు, బంగ్లాదేశ్ గుండా బ్యాంకాక్‌యాంగూన్‌ఢిల్లీ రైలు లేక రహదారి నిర్మాణం వంటి మౌలికవసతుల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయటానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. దక్షిణ చైనా సముద్రంపై చైనా క్లెయిం, దాని ఒక బెల్ట్ ఒక రోడ్ చొరవ, ఈ ప్రాంతంనుండి అమెరికా తప్పుకోవటం వంటి పరిణామాల్లో భారత్ ఎంతో చాకచక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. హిందూ మహాసముద్రంపై ఆధిపత్యం విషయంలో చైనాభారత్ మధ్య నౌకాయాన వైరం ఉంది. దక్షిణ చైనా సముద్రం విషయంలో నౌకాయాన స్వేచ్ఛలో భారత్‌కు ప్రయోజనం ఉంది.
చైనాను కలుపుకుని మొత్తంగా దక్షిణాసియా అభివృద్ధికి దోహదం చేయటమా లేక చైనాను మినహాయించటమా అన్న డోలాయమానం భారత ప్రభుత్వంలో ఉంది. ఈ సందర్భంగా భారత్‌ఆసియన్ అధినేతల ఢిల్లీ డిక్లరేషన్ ప్రస్తావనార్హం. సమగ్రమైన, పరస్పర లాభదాయకమైన ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం’ (ఆర్‌సిఇపి) ఒప్పందాన్ని 2018లో కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆ డిక్లరేషన్ కోరింది. ఇది ఒక రకం గా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం. ఆసియన్, భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణ కొరియా, చైనా, జపాన్ ఇందులో భాగస్వాములు. దీనిపై 2012లో ప్రారంభమైన చర్చలు నిలిచి పోయాయి. చైనా వస్తువులకు మనదేశంలో నిర్నిబంధ మార్కెట్ లభిస్తుందన్న భారత్ ఆందోళన, భారత్ నుంచి ఐటి వగైరా సర్వీసులు, శ్రామికులను అనుమతించటానికి ఆసియన్ వ్యతిరేకత ఇందుకు ప్రధాన కారణాలు. మౌలిక వసతుల అభివృద్ధి, మెరుగైన భద్ర తా సంబంధాలు, ఆర్థిక, సామాజికసాంస్కృతిక సంబంధాలు, రవాణా సంబంధాల మెరుగుదలను ఆ డిక్లరేషన్ వక్కాణించింది. రిసెప్‌కు ఆసియన్ పట్టుబట్టటం భారత అధికారులకు ఇబ్బందికరమైనా సూత్ర ప్రాయంగా అంగీకరించక తప్పలేదు. ఈ ఒప్పందం వల్ల ప్రపంచ జనాభాలో సగం, జిడిపిలో మూడవవంతుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంతో సమన్వయీకృత ఆసియా మార్కెట్ ఏర్పడుతుందని సింగపూర్ పట్టుబట్టింది. దక్షిణాసియాలో భారత్ కీలక పాత్ర పోషించా లంటే చైనాతో వైరం, పోటీ కాకుండా స్నేహ, సహకార పంథా అనుసరణీయం. అయితే అది బిజెపికి రాజకీయంగా ఇచ్చగించక పోవచ్చు. ఏది ఏమైనా, ఏదో పశ్చిమరాజ్యం అభీష్టం ప్రకారం భారత్ తనకు తానుగా వ్యవహరిస్తోందన్న విశ్వాసం కల్పించటం భారత్‌ఆసియన్ సంబంధాల్లో కీలకం కానుంది. తన ‘యాక్ట్ ఈస్ట్’ విధానానికి ఆసియన్‌ను మూలస్తంభంగా భారత్ చూస్తున్నది. వ్యూహాలు అందుకు దోహదకారిగా ఉండాలి.