Home ఎడిటోరియల్ చిందు రామన్న

చిందు రామన్న

మాదిగ గూడాన్నంత
బావాబావా అని అప్యాయంగా పలకరిస్తూ
అమ్మలక్కల దగ్గర పాత చీరలను స్వీకరించి
పొద్దున్నే మూడు బజార్ల దగ్గర చింత కింద
మహారాజై చిందులేస్తాడు చిందు రామన్న
మూడూళ్ళ జనాన్ని బ్రహ్మానందంలో వుంచుతాడు
పొద్దునేసిన వేషం పొద్దుపోయేదాక వెలవక
గొంతువిప్పి గానం చేస్తుంటే
ఆకాశంలోని గంధర్వులు సైతం నేలకు దిగిరావల్సిందే
నృత్యరత్నావళిని రాగతాళ చింతామణిని
ఆపోశన పట్టినట్టు
నటరాజ రామకృష్ణ, భీమ్‌సేన్ జోషిలవద్ద శిక్షణ
పొందినట్టు
ఊరు ఊరునంతా ఉర్రూతలూగించే చిందురామన్న
తరతరాల కుల వృత్తిని నమ్ముకున్న సంప్రదాయకుడు
పాత్రను పండించే అభినయం రామన్నకు
జన్మతోవచ్చింది
రంజింపజేసే రాగం రామన్నకు అతని అయ్యతో
వచ్చింది
రంగస్థలమే గురువైంది జీవితమే నాటకమైంది
మాయల ఫక్కీరును సైతం పరవశింపజేసి
బాలనాగమ్మై
దేవాది దేవతలచేత ఊడ్పించి చల్లించి వంటావార్పులు
చేయించే దశకంఠుడౌతాడు
స్త్రీ పాత్రలో ఉన్నప్పుడు యువకులు పది రూపాయిల
నోటు నోట్లో పెడితే
రంభా, ఊర్వశిలను నాట్యంలో తలపింపజేస్తాడు
పాత కొట్టంలో పెద్దమాదిగలిచ్చే గింజలు తప్పా
పండితులకిచ్చే వెండిపళ్లాలు, బంగారు నందులు
పద్మపురస్కారాలకు పనికి రాడు
హంస బహుమతులకు అర్హుడు కాడు
మద్దెల, హార్మోనియం, తాళాలు కావడి ఉట్టికి కట్టుకొని
పౌరాణిక యక్షగానాలను ఊరూర మోసుకపోయి
కళామతల్లిని తరతరాలుగా కాపాడుకున్న
చిందురామన్న
ఈ దేశ వారసత్వ సాంస్కృతిక సారథి.