Wednesday, April 24, 2024

చైనా గూఢచారి అరెస్ట్

- Advertisement -
- Advertisement -

చైనా గూఢచారి అరెస్ట్
బంగ్లాదేశ్ నుంచి బెంగాల్‌లోకి ప్రవేశిస్తుండగా..
బంగ్లాదేశ్ వీసా, పలు ఎలక్ట్రానిక్ పరికరాల జప్తు
గురుగ్రాంలో హోటల్ నడుపుతున్నానన్న నిందితుడు
కోల్‌కతా: బంగ్లాదేశ్‌తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు నుంచి భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించిన చైనా గూఢాచారిని సరిహద్దు భద్రతా దళాలు(బిఎస్‌ఎఫ్) అరెస్ట్ చేశాయి. బెంగాల్‌లోని మాల్దా జిల్లా వద్ద చైనా జాతీయుడు హాన్‌జున్వే(36)ను అరెస్ట్ చేసినట్టు బిఎస్‌ఎఫ్ తెలిపింది. హాన్ వద్ద చైనా పాస్‌పోర్టు, బంగ్లాదేశ్ వీసా, ఆపిల్ ల్యాప్‌టాప్, రెండు ఫోన్లు,రెండు పెన్ డ్రైవ్‌లు, బంగ్లాదేశ్,చైనా, భారత్ సిమ్ కార్డులు, రెండు ఎటిఎం కార్డులు, అమెరికా, బంగ్లాదేశ్, భారత్ కరెన్సీని స్వాధీనం చేసుకున్నామని బిఎస్‌ఎఫ్ పేర్కొన్నది. తాను గతంలోనూ పలుమార్లు భారత్‌కు వచ్చానని, గురుగ్రాంలో హోటల్ నడుపుతున్నానని బిఎస్‌ఎఫ్ అధికారుల దర్యాప్తులో హాన్ వెల్లడించారు. హాన్ అరెస్ట్‌కు ముందు ఆయన వ్యాపార భాగస్వామి సన్ జియాంగ్‌ను ఉత్తర్‌ప్రదేశ్ ఎటిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. హాన్‌కు 15 భారత సిమ్ కార్డులిచ్చినట్టు జియాంగ్ తెలిపారు. దాంతో, అక్రమంగా సిమ్ కార్డులు తరలించినట్టు లఖ్నోలో ఎటిఎస్ పోలీసులు హాన్‌పైనా కేసు నమోదు చేయడంతో ఆయనకు భారత్ వీసా లభించలేదు. దాంతో, బంగ్లాదేశ్‌లో తీసుకున్న బిజినెస్ వీసాతో భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించి పట్టుబడ్డారు. ఆయనకు నేపాల్ వీసా కూడా ఉన్నట్టు గుర్తించారు.

హాన్ జూన్ 2న ఢాకా చేరుకున్నారని, ఆ తర్వాత బంగ్లాదేశ్‌లోని సోనా మసీదుకు జూన్ 8న చేరుకొని 10 వరకు అక్కడ ఉన్నారని బిఎస్‌ఎఫ్ తెలిపింది. అదేరోజు భారత్‌లోకి ప్రవేశిస్తుండగా పట్టుకున్నామని వివరించారు. హాన్ వద్ద లభించిన ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలించగా ఆయన చైనా నిఘా సంస్థల కోసం పని చేస్తున్నట్టు తేలింది. నిందితుడు గురుగ్రాంలో స్టార్ స్ప్రింగ్ పేరిట ఓ హోటల్‌ను నడుపుతున్నట్టు విచారణలో వెల్లడించారు. ఆ హోటల్‌లో మరికొందరు చైనీయులు కూడా పని చేస్తున్నారని తెలిపారు. 2010లో హైదరాబాద్ వచ్చిన హాన్, 2019 తర్వాత ఢిల్లీ, గురుగ్రాం ప్రాంతాలకు మూడుసార్లు వెళ్లినట్టు తెలిపారు. నిందితుడిపై ప్రాథమిక విచారణ పూర్తి చేసిన బిఎస్‌ఎఫ్ అధికారులు, ఆ తర్వాత స్థానిక పోలీసులకు అప్పగించారు. హాన్ ల్యాప్‌టాప్‌ను స్కాన్ చేశామని, ఇతర ఏజెన్సీలు కూడా దర్యాప్తు చేస్తాయని బిఎస్‌ఎఫ్ డిఐజి ఎస్‌ఎస్ గులేరియా తెలిపారు.

China spy arrested in Gurugram

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News