Wednesday, April 24, 2024

సంపాదకీయం: చైనా సేనల ఉపసంహరణ ఘట్టం!

- Advertisement -
- Advertisement -

Chinese Troops pull back from Galwan Valley

భారత, చైనా సైనిక అధికారుల మధ్య సాగుతున్న చర్చలు ఫలవంతమవుతున్న జాడలు చూచాయగా కనిపించడం ప్రారంభించాయి. లడఖ్‌లోని గాల్వాన్ నది లోయలో గత నెల 15న ఉభయ దేశాల సైన్యాల మధ్య తీవ్ర ఘర్షణలు చోటు చేసుకొని 20 మంది భారత యోధులు, అటు చైనా సైనికులు కూడా మరణించిన చోటు నుంచి బీజింగ్ సేనలు వెనక్కు మళ్లడం ప్రారంభమైందని వచ్చిన సమాచారం హర్షించదగినది. రెండు దేశాల సైనిక కమాండర్ల మధ్య కుదిరిన ఒప్పందం మేరకు సోమవారం నాడు గాల్వాన్ లోయలోని కొన్ని ప్రదేశాల నుంచి ఉపసంహరించుకోడం చైనా సైన్యం ప్రారంభించిందని ఉభయ దళాలు వాస్తవాధీన రేఖకు అటు ఇటు కొంత దూరం వెనక్కు తటస్థ ప్రాంతాలకు మళ్లిపోతున్నాయని ఆ వార్తలు తెలియజేశాయి. అయితే గాల్వాన్ నది పొడుగునా మరి కొన్ని చోట్ల చైనా భారీ సైనిక శకటాల ఉనికి కొనసాగుతున్నదని కూడా సమాచారం. అందుచేత చైనా సేనల సంపూర్ణ ఉపసంహరణ జరిగేంతవరకు ఈ వెనక్కు మళ్లడంలోని ఖచ్చితత్వాన్ని, నిర్దంద్వతను ఖరారు చేసుకోలేము. మళ్లుతూ మళ్లుతూ దొంగ దెబ్బ తీయడం చైనా సైన్యానికి అలవాటే. సైనిక చర్చల మధ్యలోనే జూన్ 15 నాటి దురాక్రమణకు అది ఒడిగట్టిందన్న వాస్తవాన్ని మరచిపోలేము. ఆ భూభాగాల నుంచి పూర్తిగా, నిశ్శేషంగా వైదొలగేవరకూ దానిపై ఒత్తిడి పెంచాల్సిందే. రెండు దేశాల సేనలు ముష్టి యుద్ధాలకు దిగేటంత ఎదురెదురు సామీప్యతలో ఉండడమనే పరిస్థితి తిరిగి తలెత్తకుండా చూసుకోవాలి.

ఇప్పటికి 7 వారాలుగా దౌత్య,సైనిక స్థాయి సంప్రదింపులు జరుగుతున్నా లడఖ్ తూర్పు ప్రాంతంలో రగిలిన ఉద్రిక్తతలు చల్లారలేదు. ఇప్పుడిప్పుడే స్థిమిత మార్గంలో అడుగులు పడుతున్నాయి. వాస్తవాధీన రేఖ వద్ద మోహరించిన ఉభయ సేనలను వీలైనంత త్వరగా ఉపసంహరించుకోవాలని ఇక ముందు రెండు దేశాల మధ్య గల విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవాలని దౌత్య స్థాయి ఫోన్ సంభాషణల్లో కూడా అంగీకారం కుదిరినట్టు తెలుస్తున్నది. 1962 యుద్ధం తర్వాత ఇంత వరకూ మళ్లీ అటువంటి పరిస్థితి తలెత్తకపోడం, ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ మధ్య తరచూ కీలక భేటీలు జరుగుతుండడం ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించాయి. ఉన్నట్టుండి గత నెలలో గాల్వాన్ లోయలో సంభవించిన రక్తసిక్త ఘట్టం బీజింగ్ పట్ల భారత్‌లో అనుమానం, తీవ్ర వ్యతిరేకత చోటు చేసుకోడానికి దారి తీసింది. భారత ప్రజల మనోభావాలు గాయపడ్డాయి. చైనాకు భారత్ తడాఖా చూపించాలనే భావన గట్టి పడింది. మన భూభాగంలో అంగుళమైనా దురాక్రమణకు గురి కాలేదని తొలుత ప్రకటించిన ప్రధాని మోడీ ఆ తర్వాత చైనా పట్ల స్పష్టమైన దృఢ వైఖరిని తీసుకున్నారు. టిక్‌టాక్ తదితర 59 చైనా యాప్స్‌పై నిషేధం విధింపు, సరిహద్దులలోని భారత సేనల వద్దకు వెళ్లి వారి భుజం తట్టి, విస్తరణవాదుల ఆటలు సాగనీయబోమని గట్టిగా హెచ్చరించడం వంటి చర్యలతో పొరుగు దేశానికి తగిన సంకేతాలు పంపించారు. ఇది కూడా చర్చల సరళిపై సానుకూల ప్రభావం చూపి ఉండాలి. చైనా అసలు ఏమి చేరుకుంటోంది, ఎందుకిలా దొంగ దెబ్బలకు తెగిస్తున్నది? మన భూభాగంలో ఉన్న గాల్వాన్ నదీ లోయ మొత్తం తమదేనని చైనా అంటున్నది. పురాతన రాజుల కాలం నాటి భౌగోళిక హద్దుల ప్రకారం ఆ భూభాగం తమకే సొంతమంటున్నది.

అలాగే 20 ఏళ్ల పాటు శ్రమించి వాస్తవాధీన రేఖకు సమాంతరంగా, చేరువగా మన భూభాగంలో మనం నిర్మించిన అన్ని కాలాలకు అనువైన 255 కి.మీల దర్బక్ షీయోక్ దౌలత్‌భేగ్ ఓల్డీ రోడ్డు చైనాకు కన్నెర్రయింది. 13,000 నుంచి 16,000 అడుగుల ఎత్తున మన సరిహద్దు రోడ్ల నిర్మాణ సంస్థ దీనిని పూర్తి చేసింది. ఈ రోడ్డు లేహ్‌ను, ఆ ప్రాంతంలో చిట్టచివరి స్థావరమైన దౌలత్ భేగ్ ఓల్డీ (డిబిఒ) కి కలుపుతుంది. ఇది ఆక్సాయ్ చిన్ గుండా వెళ్లే టిబెట్ జిన్ జియాంగ్ హైవే సెక్షన్‌కు దారి తీస్తుంది. లడఖ్‌ను, చైనాకు చెందిన జిన్ జియాంగ్‌ను విడదీస్తున్న పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగంలోని కారకోరమ్ కనుమల అడుగు వరకు వెళుతుంది. ఇన్ని విధాలుగా తన భూభాగానికి అతి చేరువలో నిర్మాణమైన డిబిఒ రోడ్డు చైనాకు గుండె మంట అయింది. అలాగే మొత్తం మన అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తనదే అంటున్నది. ఈ అన్ని కారణాల రీత్యా చైనా మన భూభాగంలోకి చొచ్చుకు వచ్చి స్థిరపడాలనే దుష్ట కాంక్షతో దహించుకుపోతున్నది. ఈ సారి వాస్తవాధీన రేఖ పొడుగునా చైనా సేనలు భారీగా మోహరించాయని మన భూభాగంలోకి కూడా చొచ్చుకొచ్చాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ ఇటీవల ప్రకటించినట్టు వార్తలు వచ్చాయి. అందుచేత తాత్కాలికమైన సర్దుబాట్లతో విషయాన్ని విస్మరించడం వల్ల ప్రయోజనం పరిమితమే. భవిష్యత్తులో కూడా చైనా ఇదే దుష్ప్రవర్తనకు ఒడిగట్టకుండా ఉండాలంటే సరిహద్దు రేఖ విషయంలో దానితో శాశ్వత ఒడంబడికకు ప్రయత్నించాలి. ప్రపంచం ఎదుట చైనా అన్ని విధాలా పలచనైపోయి ఉన్న ప్రస్తుత తరుణమే అందుకు అనువైనది. కణకణ మండుతున్న ఇనుప కడ్డీపైనే సమ్మెట దెబ్బ పడాలి.

Chinese Troops pull back from Galwan Valley

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News