Home సినిమా నాగశౌర్యలో నన్ను నేను చూసుకున్నా

నాగశౌర్యలో నన్ను నేను చూసుకున్నా

Chaloనాగశౌర్య హీరోగా రష్మిక మండన్నా హీరోయిన్‌గా ఐరా క్రియేషన్స్ పతాకంపై శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో వెంకీ కుడుముల దర్శకత్వంలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న చిత్రం ‘ఛలో’. ఈ చిత్రం టీజర్, ట్రైలర్‌కు సోషల్ మీడియాలో అత్యధికంగా వ్యూస్ వచ్చాయి. మహతి స్వర సాగర్ సంగీతమందించిన ఈ చిత్రంలోని ‘చూసి చూడంగానే…’ పాట సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్ని పాటలు కూడా మ్యూజికల్ హిట్‌గా నిలిచాయి. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవ్వగా… దర్శకులు వంశీ పైడిపల్లి, నందినిరెడ్డి, నిర్మాత సి.కళ్యాణ్, సంగీత దర్శకులు మహతి స్వర సాగర్, కళ్యాణి మాలిక్, నటి ప్రగతితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ “నాగశౌర్య వారి అమ్మగారితో కలిసి ఓ రోజు మా ఇంటికి వచ్చాడు. ‘ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నాం. మీ సమక్షంలో జరగాలి. తప్పకుండా రావాలి’అని అడిగాడు. ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా నాగశౌర్యకు వస్తానని చెప్పాను. నా కెరీర్ ప్రారంభంలో నా సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్‌కు నేను అభిమానించే ఓ పెద్ద స్టార్ వస్తే బాగుంటుందని అనుకున్నాను. కానీ ఆ స్టార్ రాలేకపోయాడు. దీంతో నేను ఎంతో నిరుత్సాహపడ్డాను. ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడు నాగశౌర్యలో నన్ను నేను చూసుకున్నాను. నన్ను రమ్మని కోరుతున్నాడు అంటే ఆ ఉత్సాహం, ఆ ప్రోత్సాహం వేరు కాబట్టి నాగశౌర్యను ప్రోత్సాహించాలని అనుకున్నాను. మా నిహారికతో నాగశౌర్య చేసిన సినిమాను టీవీలో చూశాను. అతను చాలా హ్యాండ్‌సమ్‌గా ఉన్నాడు. స్పార్క్‌గా ఉన్నాడు. ఇలాంటి హీరోలు ఖచ్చితంగా ఇండస్ట్రీకి రావాలి, కావాలి. అప్పుడే ఇండస్ట్రీకి ఒక ఫ్రెష్‌నెస్, కొత్త ఉత్సాహం వస్తుంది. రెండు, మూడు సంవత్సరాలుగా పెద్ద హీరోల సినిమాలు ఎంత హిట్ అయ్యాయో యంగ్ హీరోల చిత్రాలు కూడా అంతకంటే హిట్ అయ్యాయి. ఉయ్యాల జంపాల, పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, ఊహలు గుసగుసలాడే, శతమానం భవతి, ఫిదా… అలాగే ఈమధ్య వచ్చిన ‘హలో’ ఇవన్నీ ప్రేక్షకుల ఆదరణ పొందాయి. ‘ఛలో’ కూడా పెద్ద స్థాయిలో విజయం సాధించాలని నాగశౌర్య కెరీర్‌లో ఇది బెస్ట్ సినిమాగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ‘ఛలో’ ట్రైలర్ చూశాక ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లో జరిగే మంచి ప్రేమ కథా చిత్రంలా అనిపించింది. ట్రైలర్ చూడగానే ఈ సినిమాను త్వరగా చూడాలని అనిపించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని శంకర్ ప్రసాద్, గౌతం, ఉషలకు వారి బ్యానర్‌లో మంచి సినిమాగా నిలవాలని ఆశిస్తున్నాను. వెంకీ కుడుముల ఒక డైరెక్టర్‌లా కనిపించలేదు. నా అభిమానుల్లో ఒకడిగా అనిపించాడు. ఈ సినిమా అందరినీ అలరించి సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. వంశీ పైడిపల్లి మాట్లాడుతూ “దర్శకుడు వెంకీ ఫస్ట్ సినిమా ఇది. ట్రైలర్ చూశాక ఎంత ఆత్మవిశ్వాసంతో ఈ సినిమా తీశాడో అర్థమవుతోంది. నాగశౌర్య సినిమాలు చూశాను. అతను చాలా బాగా నటించాడు. ఈ సినిమా అతనికి మంచి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను”అని తెలిపారు. చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ “చిరంజీవికి ఉన్న అభిమానులు, భక్తుల్లో నేను ఒకడిని. మా సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ఆయన రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌ని అయిన నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన ఐరా క్రియేషన్స్‌కు, నాగశౌర్యకు థాంక్స్‌”అని చెప్పారు. హీరో నాగశౌర్య మాట్లాడుతూ “నేను చాలా చిన్నవాడిని. చిరంజీవి చెయ్యి నా మీద పడింది. ఇది చాలు నాకు. మళ్లీ జన్మంటూ ఉండే మా అమ్మా, నాన్నలకే పుడతాను. మెగాస్టార్ అభిమానిగానే పుడతాను. వెంకీ చాలా అద్భుతమైన డైరెక్టర్. రెండు సంవత్సరాల్లో వెంకీ పెద్ద డైరెక్టర్ అయి చిరంజీవితో సినిమా చేయాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. హీరోయిన్ రష్మిక మండన్నా మాట్లాడుతూ “సినిమా టీమ్ అంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా ఉష నాకు తెలుగు నేర్పించారు. సాగర్ మంచి ట్యూన్స్ అందించారు. వెంకీ బ్యూటిఫుల్‌గా సినిమాను డైరెక్ట్ చేశాడు”అని పేర్కొన్నారు.