Wednesday, April 24, 2024

ప్రారంభమైన చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకులు

- Advertisement -
- Advertisement -

Chiranjeevi Oxygen Banks started

కరోనా క్రైసిస్ ఛారిటీ సేవల అనంతరం మెగాస్టార్ చిరంజీవి మరో మెగా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంకుల ఏర్పాటు ప్రక్రియ పూర్తయింది. ఆయా జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈ ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటయ్యాయి. ఇక మంగళవారం నాడు కొన్ని జిల్లాలకు ఆక్సిజన్ పంపిణీ కార్యక్రమాన్ని మెగాస్టార్ స్వయంగా ప్రారంభించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆక్సిజన్ సిలిండర్లు, కాన్‌సన్‌ట్రేటర్లు యుద్దప్రాతిపదికన అన్ని జిల్లాలకు అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ఇటీవల కరోనా మరణాలు మెగాస్టార్‌ను కదిలించాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమయానికి ఆక్సిజన్ అందక ఎవరూ మరణించకూడదని మెగాస్టార్ చిరంజీవి నిర్ణయించుకొని తన ఆలోచనను కుమారుడు రామ్‌చరణ్‌తో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్,- తెలంగాణ రాష్ట్రాల్లో ఆక్సిజన్ కొరత వల్ల ఏ ఒక్కరూ మరణించకూడదన్న ఉద్దేశంతో ఓ బృహత్తర ప్రణాళికను రూపొందించారు. మెగా అభిమానులను కూడా ఇందులో భాగస్వాముల్ని చేస్తున్నారు.

ఆయా జిల్లాల అభిమాన సంఘాల అధ్యక్షులు అక్కడ వీటి నిర్వహణ బాధ్యత చూస్తారు. తెలుగువారందరికీ ఈ ఆక్సిజన్ బ్యాంక్ అందుబాటులో ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగా ట్విట్టర్ అకౌంటును కూడా ప్రారంభించారు. ఇప్పుడున్న ఆక్సిజన్ సంక్షోభాన్ని అరికట్టే ఉద్దేశంతోనే దీన్ని ప్రారంభించినట్లు వివరించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ “చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో నిరంతరాయంగా ఆక్సిజన్ పంపిణీ కొనసాగుతుంది. ఇక్కడ ఉన్న కొరత వల్ల చైనా నుంచి ఆక్సిజన్ కాన్‌సన్‌ట్రేటర్లు ఆర్డర్ చేశాం. ఇక అత్యవసరంగా ఎక్కడ అవసరం ఉందనేది తెలుసుకొని ఆక్సిజన్ సిలిండర్లు అందిస్తున్నాం. అవసరం ఉన్న అన్ని చోట్లకు పంపిణీ చేస్తున్నాం. అలాగే ప్రతిచోటా ఆక్సిజన్ సిలిండర్లు ఎక్కడెక్కడ ఏ సమయంలో చేరుకుంటున్నాయి? అనేది తెలుసుకోవడానికి ట్రాకింగ్ పరికరాన్ని కూడా టెక్నీషియన్లు ఏర్పాటు చేస్తున్నారు. దీన్ని చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ఆఫీస్ నుంచి పర్యవేక్షిస్తారు. అన్ని చోట్లా ఆక్సిజన్ సిలిండర్లు సద్వినియోగం కావాలనేదే మా ప్రయత్నం. రామ్‌చరణ్ ఈ ఏర్పాట్లన్నీ చూస్తున్నారు”అని అన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News