Friday, April 26, 2024

కరోనాకు ప్లాస్మా సంజీవని

- Advertisement -
- Advertisement -

కోలుకున్న వారు ముందుకొచ్చి ప్లాస్మా దానం చేయాలి
ఒకరి ధాతృత్వంతో ముగ్గురిని కాపాడుకోవచ్చు: సినీ హీరో చిరంజీవి
ప్లాస్మా దానం చేసిన వారికి సన్మానం

మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా నుంచి కోలుకోవడానికి ప్లాస్మా సంజీవని వలె పనిచేస్తోందని అన్నారు. కరోనా నుంచి కోలుకుని ప్లాస్మా దానం చేసిన వారిని గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో సన్మానించారు. ఈ సందర్భంగా సినీహీరో చిరంజీవి మాట్లాడుతూ కరోనాకు వ్యాక్సిన్ వచ్చే వరకు ప్లాస్మా ఒక్కటే పరిష్కారమని అన్నారు. ప్రతి ఒక్కరూ ప్లాస్మా యొక్క ప్రాధాన్యతను గుర్తించాలని కోరారు. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. దాదాపు రోజుకు 1,200 మంది ప్లాస్మా కోసం సైబరాబాద్ పోలీసులను సంప్రదిస్తున్నారని తెలిపారు. ప్లాస్మాపై చాలామందికి అపోహ ఉందని అది తప్పు అని అన్నారు.

ఒకరు ఇచ్చే ప్లాస్మా ముగ్గురిని కాపాడుతుందని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎన్నిసార్లయినా ప్లాస్మాను దానం చేయవచ్చని అన్నారు. ప్లాస్మా దానం చేసిన వారు సమాజానికి రోల్ మోడల్స్ అని అన్నారు. ప్లాస్మా దానం చేసిన వారిని సన్మానించే అవకాశం కల్పించిన సైబరాబాద్ సిపి విసి సజ్జనార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కరోనా సమయంలో ముందుండి పోరాడుతున్న పోలీసులు నిజమైన హీరోలని అన్నారు. ప్లాస్మా అవగాహనపై రూపొందించిన బ్యానర్‌ను చిరంజీవి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఘనంగా సన్మానించారు.

ప్లాస్మా దానం… సామాజిక బాధ్యతః విసి సజ్జనార్
ప్లాస్మా దానం చేయడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ అన్నారు. ప్లాస్మాదానం చేసిన వారు, వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు 252మంది ప్లాస్మా దానం చేసి 400మందిని ఆదుకున్నారని అన్నారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం మన సంస్కృతిలో ఉందని అన్నారు. ప్లాస్మా దానం చేసిన వారు దేవుడితో సమానమని అన్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాలని కోరారు. ప్లాస్మా దానం చేసిన వారికి సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. ప్లాస్మా దానం చేసేందుకు ఎస్‌సిఎస్‌సి వలంటీర్లు, రేయిన్‌బో ఆర్మీ, యంగిస్థాన్ సహకరిస్తున్నారని తెలిపారు. ఎస్‌సిఎస్‌సి వారి సహకారంతో లాక్‌డౌన్ సమయంలో పది లక్షల ఫుడ్‌ప్యాకెట్లు, 1.35లక్షల నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామని తెలిపారు.

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోనే కాకుండా అచ్చంపేట, నాగర్‌కర్నూలు, ఏటూరునాగారం తదితర ప్రాంతాలకు పంపించామని తెలిపారు. రక్తం అవసరం ఉన్న వారి కోసం రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి 5,322 యూనిట్ల రక్తం సేకరించామని తెలిపారు. ప్లాస్మా దానం చేస్తామని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేస్తున్న వారిపట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. అలాంటి వారి గురించి 9490617444కు ఫోన్ చేసి చెప్పాలని అన్నారు. ప్లాస్మా దానం చేసి కరోనా రోగులను ఆదుకోవాలని ఎస్‌సిఎస్‌సి జనరల్ సెక్రటరి కృష్ణ ఏదుల అన్నారు. ప్లాస్మా దానం చేసిన వారిని సినీహీరో చిరంజీవి సన్మానించి, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డిసిపిలు ఎస్‌ఎం విజయ్‌కుమార్, పద్మజా, ప్రకాష్ రెడ్డి, ఎడిసిపిలు మాణిక్‌రాజ్, వెంకట్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్, గౌస్‌మొయినుద్దిన్, డాక్టర్ సుకుమార్ పాల్గొన్నారు.

Chiranjeevi Speech on Plasma donation

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News