Home తాజా వార్తలు హ్యాపీ క్రిస్మస్..

హ్యాపీ క్రిస్మస్..

Happy Christmas Day 2018క్రిస్మస్ వెలుగులు…

క్రిస్మస్ వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా పండగ వాతా వరణం నెలకొంటుంది. క్రైస్తవుల లోగిళ్లలో, చర్చిలలో ఆనందాల వెల్లువ మొదలౌతుంది. విద్యుత్ దీపాలతో, క్రిస్మస్ ట్రీలతో ఇళ్లు ,ప్రార్థనా మందిరాలు వెలుగు జిలుగులతో కళకళ లాడతాయి. క్రైస్తవుల పర్వదినానికి ముందు నుంచే మొదలయ్యే ఈ వేడుకల లో చిన్నా ,పెద్దా అందరూ ప్రేమమూర్తిని ఆరాధిస్తూ ఆయన త్యాగాలను గుర్తుచేసుకుంటారు. క్రిస్మస్ రోజున క్రైస్తవులు శాంతి స్వరూపుడైన యేసయ్యని స్మరించుకుంటూ రాత్రి, పగలు ప్రార్థనలతో మందిరాలను హోరెత్తిస్తారు. కరుణామయుడి కృపను పొందడానికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఆనందోత్సవాలలో తేలియాడతారు. ఇక చిన్నపిల్లలైతే పండుగకు ముందునుంచే శాంతా క్లాజ్ తెచ్చే బహుమతుల గురించి ఆలోచిస్తూ ఇంట్లో హడావుడి చేస్తుంటారు. యువతులు, గృహిణులు క్రిస్మస్ ట్రీ తయారీలో లీనమైపోతారు.

చర్చిలో కొవ్వొత్తులు ఎందుకు వెలిగిస్తారు!

“నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను” అని క్రీస్తు పదే పదే తన ప్రసంగాలలో చెప్పియున్నారు. అందుకే క్రిస్మస్ రోజున అర్థరాత్రి క్రైస్తవులందరూ తప్పనిసరిగా చర్చిల్లో కొవ్వొత్తులు వెలిగిస్తారు. పాపమనే అంధకారం నుండి వెలుగువైపు నడిపించే దివ్యజ్యోతి క్రీస్తు అని భక్తుల విశ్వాసం. వెలుగునకు ప్రతీకలుగా కొవ్వొత్తులను మలచుకుని వెలిగిస్తారు. పేదలకు కూడా అందుబాటురేటులో ఉండే ఈ కొవ్వొత్తులను తమ తాహతుకు తగ్గట్టు మొక్కుబడిగా వెలిగిస్తుంటారు.

వెలుగు చుక్క (క్రిస్మస్ స్టార్)
క్రీస్తు పుట్టినపుడు ఆకాశంలో వింత నక్షత్రం కనిపించింది. దీనిని అనుసరించి తూర్పుదిక్కు నుండి జ్ఞానులు రావటం క్రిస్మస్ గాథలో విశిష్టమైన అంశాలు. వింత నక్షత్రానికి గుర్తుగా ఇప్పుడు రంగురంగుల కాగితాలతో చేసిన బొమ్మల నక్షత్రాల్ని క్రిస్మస్ పండుగ సందర్భంగా చర్చిల మీద, ఇళ్ళ కప్పుల మీద తగిలించి వాటిలోపల రంగురంగుల విద్యుద్దీపాలు వెలిగిస్తున్నారు. ఇదే క్రిస్మస్ స్టార్. ఇళ్ళల్లో ఏ ఇతర అలంకరణలు లేకపోయినా, కనీసం ఒక్క క్రిస్మస్ స్టారయినా
తగిలించి పెట్టడం క్రెసతె్తైవులకు అలవాటు.

క్రిస్మస్ చెట్టుకీ కథ ఉంది..!
క్రిస్మస్ చెట్టును అలంకరించడమనే సంప్రదాయం 15వ శతాబ్ధంలో లివోనియానూ, 16వ శతాబ్ధంలో జర్మనీలోనూ మొదలైంది.కానీ ఈ సంప్రదాయం 19వ శతాబ్ద ప్రారంభంలో ప్రాచుర్యం పొందింది. చారిత్రకంగా క్రిస్మస్ చెట్టుని పరిశీలిస్తే ఈ సంప్రదాయం 1781లో బెన్షివిక్ సైనికుల ద్వారా కెనడాలోకి ప్రవేశించిందని కొందరి వాదన. ’జనరల్ ఫెడరిక్ అడాల్ఫ్ రెడిజిల్’ అనే సైనికాధికారి ఇచ్చిన క్రిస్మస్ విందులో అతిథులను అబ్బురపరచటం కోసం ’ఫర్’ చెట్టుని కొవ్వొత్తులతో, పండ్లతో అలంకరించారు. ఆ తర్వాత రష్యాలాంటి దేశాల్లోనూ సంపన్న కుటుంబాలవారు క్రిస్మస్ చెట్టుని ఉపయోగించటం మొదలుపెట్టారు. 1816లో ’నస్సావో-విల్‌బర్గ్’ యువరాణి ’హెన్‌రేటా’ క్రిస్మస్ చెట్టుని వియన్నా దేశానికి పరిచయం చేసింది. ఆతర్వాత కాలంలో ఈ సంప్రదాయం ఆస్ట్రియాకి విస్తరించింది. ఫ్రాన్స్ దేశంలోకి 1840లో డచ్ వారి ద్వారా ఈ చెట్టు వచ్చింది. బ్రిటన్ దేశంలోకి 19వ శతాబ్ద ప్రారంభంలో క్రిస్మస్ సంప్రదాయంలో భాగమైంది.
రాణి విక్టోరియా.. తనకు చిన్నప్పటి నుంచి ఈ చెట్టుతో అనుబంధం ఉన్నట్లు ఒక పత్రికలో పేర్కొన్నారు. ఆ తర్వాత కాలంలో ప్రపంచవ్యాప్తంగా కిస్మస్‌చెట్టు ప్రసిద్ధిచెందింది.

ఈ క్రిస్మస్ చెట్టు చరిత్ర ఇలా వుంటే కొందరు మాత్రం మరొక కథ చెప్తారు.. ఆ కథేంటంటే..
”చాలా ఏళ్ళ క్రితం క్రీస్తు పుట్టినరోజున చర్చికి వెళ్లి, రకరకాల బహుమతులు ఇచ్చే సంప్రదాయం ఉండేది. అలా ఒక ఊరిలో ఉండే ప్లాబో అనే పేద పిల్లవాడి దగ్గర డబ్బు లేకపోవడంతో ఓ అందమైన మొక్క ఓ చిన్న కుండీలో పెట్టుకుని చర్చికి తీసికెళ్లాడు. అక్కడ ఎన్నో విలువైన కానుకలతో వచ్చిన వారంతా ప్లాబో చేతిలోని కుండీని చూసి ఎగతాళి చేశారు. ప్లాబో సిగ్గుపడుతూనే దానిని క్రీస్తు ప్రతిమ దగ్గర పెట్టాడు. ఆశ్చర్యంగా.. ఆ చిన్న మొక్క అప్పటికప్పుడు పెద్ద మొక్కగా ఎదిగి, బంగారు వృక్షంగా మారిపోయిందట! ప్రేమతో ఆ పేద బాలుడు తెచ్చిన కానుకే విశిష్టమైనది అయ్యింది. అందరూ ఆ బాలుడిని ఎగతాళి చేసినందుకు సిగ్గుపడ్డారు. మంచి మనస్సుతో ఇవ్వడం ముఖ్యమని అందరూ తెలుసుకున్నారు. ఇక అప్పటి నుంచి ప్రతిఏటా అందరూ క్రిస్మస్ చెట్టుని అలకరించడం మొదలుపెట్టారంట!”

తాతయ్యను పలకరిద్దాం..!
డిసెంబర్ నెల వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంబరాన్నంటుతాయి. క్రిస్మస్ అనగానే పిల్లలకు, పెద్దలకు వెంటనే గుర్తొచ్చేది శాంతా క్లాజ్. క్రిస్మస్ వేడుకలలో అన్నింటికన్నా ప్రత్యేకం ఈ క్రిస్మస్ తాతయ్య. తెల్లటి జుట్టు, తెల్లటి గడ్డం, ఎర్రటి ప్యాంట్ వేసుకొని పిల్లలను ఆడిస్తూ,పాడిస్తూ, బహుమతులిస్తూ ఆనందాన్ని పంచుతూ అందరి మనస్సులను దోచుకుంటాడీ తాత. చూడచక్కని వేషంతో నవ్వుల పూలను కురిపిస్తూ అందరికీ ప్రేమను పంచే శాంతా క్లాజ్ మనందరికీ తెలుసు కానీ భయానక రూపంతో అందరినీ భయపెడుతూ బహుమతులిచ్చే శాంతా క్లాజ్ గురించి మీకు తెలుసా.కొన్ని పాశ్చాత్య దేశాల క్రిస్మస్ వేడుకల్లోని వింత సాంప్రదాయాలలో ఈ భయానక శాంతా క్లాజ్‌లు ఒకటి. క్రైస్తవుల పర్వదినమైన క్రిస్మస్‌కి పదిరోజుల ముందు నుంచే హడావుడి చేసే ఈ శాంతాలు మంచికి రూపంతో పని లేదని నిరూపిస్తాయి. విచిత్రమైన వేషధారణతో,భయానక రూపాలతో వుండే ఈ శాంతా క్లాజ్‌లు పిల్లల దగ్గరకు వెళ్లి బొమ్మలు, చాక్లెట్లు, బిస్కట్లు పంచిపెడుతూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తారు. రూపాన్ని ఆధారంగా చేసుకొని మంచి వ్యక్తిత్వం వున్న మనుషులను దూరం చేసుకోకూడదని ఈ శాంతా క్లాజ్‌లు పిల్లలకు వివరిస్తారు. సహాయం చేయడానికి, సంతోషాన్ని,ప్రేమను పంచడానికి మంచి మనస్సు, సహాయం చేయాలనే ఆలోచన వుండాలి దానికి రూపంతో పనిలేదని ఈ భయపెట్టే శాంతాలు ప్రపంచానికి చాటిచెప్తాయి.

Happy Christmas Day 2018