Saturday, February 4, 2023

పాస్టర్ పై దాడిచేసిన నిందితులను శిక్షించాలి: యేరుషలేం మత్తయ్య

- Advertisement -

pastor-Dr-swamiహైదరాబాద్: మత ప్రచారం చేస్తున్నాడంటూ కొందరు ఓ పాస్టర్ పై దౌర్జన్యం చేసి మానసికంగా హింసించారు. అంతేకాదు అసభ్య పదజాలంతో దూషించి బైబిల్ ను తలపై పెట్టుకుని ప్రమాణం చేయించారు. ఇంతటితో ఆగకుండా వాహనంపై ఎక్కించుకుని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో అప్పగించి ఆయనపై కేసు నమోదు చేయించి కటకటాల్లో పెట్టిచ్చారు.
వివరాల్లోకెళితే హైదరాబాద్ లోని వనస్తలిపురంకు చెందిన డాక్టర్ కె.ఎ.స్వామి సిటీ కాలేజీలో అధ్యాపకుడిగా పనిచేశారు. వైశ్య కుటుంబానికి చెందిన డాక్టర్ స్వామి యేసు క్రీస్తు బోధలకు ఆకర్శితుడై క్రైస్తవునిగా మారారు. అంతేకాకుండా ఇటీవల తన అధ్యాపక ఉద్యోగానికి రాజీనామా చేసి ఓ చర్చి పార్టస్ గా కొనసాగుతున్నారు. అలాగే గిడియన్ బైబిల్ సొసైటీ అనే సంస్థకు గౌరవ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సోమవారం మత సంబంధంలేని ప్రాంతమైన హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై సువార్త ప్రకటిస్తుండా దుండగులు దాడికి పాల్పడ్డారు. సమీపంలోని ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ను కలిసే నిమిత్తం వెళుతుండగా ఓ పాదచారుడిని ఆపి చిరునామాను అడిగారు. ఈ సందర్భంగా ఆయన వద్ద ఉన్న ప్యాకెట్ బైబిల్ ను సదరు పాదచారుడికి ఇచ్చారు. దీన్ని గమనించిన కొందరు క్రైస్తవేతర అల్లరిమూకలు పాస్టర్ ను అటకాయించి దౌర్జన్యానికి పాల్పడ్డారు.
పాస్టర్ ను ఒంటరిని చేసి దుర్భాషలాడారు. ఈ సన్నివేశాన్ని వారే తమ ఫోన్ లో వీడియో చిత్రీకరించి వాటిని సదరు పాస్టర్ స్వామి ఫోన్ కు వాట్సాఫ్ మెసెజ్ చేశారు. పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తూ మార్గం మధ్యంలో పాస్టర్ స్వామిని దారుణంగా కొట్టారని తెలిసింది. మొదట గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో నిందితులు ఆయనపై కేసు పెట్టారు. అనంతరం మహంకాళి పోలీస్ స్టేషన్ కు తరలించారని పాస్టర్ బంధువులు తెలిపారు. కాగా, సాయంత్రం వరకు పోలీసులు పాస్టర్ ను పోలీస్ స్టేషన్ లో ఉంచి అనంతరం విడిచిపెట్టినట్లు తెలంగాణ క్రైస్తవ సంఘాల కార్యాచరణ అధినేత యేరుషలేం మత్తయ్య తెలిపారు. పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన పాస్టర్ స్వామి అనంతరం కూలబడిపోయాడు. అయితే పాస్టర్ ను నిందితులు గాయాలు కనిపించకుండా దారుణంగా కొట్టారని, దీంతో మెదడుకు తీవ్రంగా గాయాలు కావడంతోపాటు పక్షవాతం వచ్చిందని, దీంతో కామినేని హాస్పటల్ కు తరలించినట్లు యెరుషాలేం మత్తయ్య తెలిపారు.
దీంతో గాంధీనగర్, మహంకాళి పోలీసు స్టేషన్లలో నిందితులపై ఫిర్యాదు చేయగా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని మత్తయ్య ఆరోపించారు.
పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని నిందితులను కఠినంగా శిక్షించాలని, క్రైస్తవులపై దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న పలు క్రైస్తవ సంఘాలు రెండు రాష్ట్రాల్లో ధర్నాలు నిర్వహించి సంఘటనను తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://www.youtube.com/watch?v=PlJVX3OZBFM

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles