Thursday, March 28, 2024

శ్రీశైలంలో సిఐడి దర్యాప్తు షురూ

- Advertisement -
- Advertisement -

పవర్‌హౌజ్‌ను పరిశీలించిన అడిషనల్ డిజి గోవింద్ బృందం
అగ్ని ప్రమాదం ఆనవాళ్లు సేకరణ, సంఘటన పూర్వాపరాలపై ఆరా

CID to Begin Probe in Srisailam power plant Accident

మన తెలంగాణ/నాగర్‌కర్నూల్ ప్రతినిధి: దేశ చరిత్రలోనే దురదృష్ట సంఘటనగా నిలిచిన శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సిఐడి అడిషనల్ డిజి గోవింద్ సింగ్ నేతృత్వంలో విచారణ చేపట్టింది. సిఐడి డిఐజి సుమతి, అడిషనల్ డిజి గోవింద్ సింగ్‌లు శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగల పెంట వద్ద గల శ్రీశైలం ఎడమగట్టు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టును సందర్శించారు. 20వ తేదిన రాత్రి 10:30 గంటల సమయంలో ప్యానెల్ బోర్డులకు షార్ట్ సర్కూట్ సంభవించడం వల్ల భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం ద్వారా తొమ్మిది మంది అధికారులు, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులు మృతిచెందిన విషయం విధితమే. ఈ ఘటనలో పవర్ ప్రాజెక్టుకు సంబంధించి భారీ నష్టం సంభవించిందని తెలుస్తుంది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు కోసం సిఐడి బృందం సభ్యులతో సమగ్ర విచారణ నిర్వహిస్తున్నారు. ఆదివారం క్లూస్ టీంతో పాటు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చెందిన సిబ్బంది భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో సంఘటన ఆనవాళ్లను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. శనివారమే భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో విచారణ కొనసాగించాల్సి ఉండగా పొగ, వేడి సేగ కారణంగా ఆదివారం విచారణను పట్టినట్లు సమాచారం.

ఆదివారం సిఐడి అడిషనల్ ఎస్పి శ్రీనివాసులతో పాటు ముగ్గురు డిఎస్పీలు, ముగ్గురు ఇన్స్‌పెక్టర్లు కలుపుకుని మొత్తం 25 మంది సిఐడి బృందం సభ్యులు సమగ్ర దర్యాప్తు చేపట్టారు. జెన్‌కొ అధికారులు సిబ్బందితో పూర్తి స్థాయి వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాద సంఘటనకు గల కారణాలు, సంఘటన సమయంలో ఉద్యోగులు తప్పించుకునేందుకు అవకాశాలు ఉన్న బయటికి వెళ్లలేకపోవడానికి గల అవాంతరాలు, ఏ యూనిట్లో ఎంత సమయంలో షార్ట్ సర్కూట్ చోటు చేసుకుంది, ప్యానెల్ బోర్డులలో మంటలు రావడానికి కారణాలు, ప్యానెల్ బోర్డు నుంచి ట్రాన్స్‌ఫార్మర్లు, రియాక్టర్లకు మంటలు ఎలా వ్యాపించాయి, ఆ సమయంలో భద్రతా చర్యలు, అగ్ని మాపక పరికరాలు పనిచేశాయా, పొగ కమ్ముకోవడం ద్వారా(స్మోక్) అలారం సైరన్లు పనిచేశాయా, ఆ సమయంలో సిసి కెమెరాలు, సంఘటనను మొబైల్ ఫోన్ల ద్వారా చిత్రీకరించిన వీడియోలు, ఫోటోలు, వంటి వాటిని సిఐడి బృందం సేకరించినట్లు సమాచారం. సంఘటన సమయంలో మంటల్లో చిక్కుకున్న ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులు అధికారులతో మాట్లాడిన సమయం ఇతర అంశాలను తెలుసుకునే విధంగా వారి ఫోన్ నెంబర్లు సేకరించినట్లు తెలిసింది.

ఇదిలా ఉండగా సాధారణ సమయాలలో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోకపోగా సంఘటన జరిగిన రోజు అమెరాన్ కంపెనీకి చెందిన టెక్నిషియన్లు బ్యాటరీలను అమర్చారు. ఈ సంఘటనలో ఇద్దరు కంపెనీ టెక్నీషియన్లు మృత్యువాత పడ్డ విషయం విధితమే. ఇదిలా ఉండగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న సమయంలో బ్యాటరీలను అమర్చడం ద్వారా ఏదైనా విద్యుత్ కనెక్షన్ తప్పుగా ఇవ్వడం ద్వారా ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్కూట్ చోటుచేసుకుందా అనే కోణంలో సైతం విచారణను చేపడుతున్నట్లు సమాచారం. ఆరు టర్బన్ల ద్వారా ప్రతి టర్బన్ నుంచి 150 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులో జరిగిన సంఘనను ముఖ్యమంత్రి కెసిఆర్ తీవ్రంగా పరిగణిస్తూ సిఐడి విచారణకు ఆదేశించిన విషయం విధితమే. తెలంగాణ రాష్ట్రానికి శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ హైడ్రొ ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ప్రధాన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా వెలుగొందుతుంది. ప్రతి రోజు శ్రీశైలం జలాశయం నుంచి రివర్సబుల్ వాటర్ సిస్టం ద్వారా 42వేల క్యూసెక్కుల నీటిని వినియోగిస్తూ 20 మెగా యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. విద్యుత్ ఉత్పత్తికి ప్రధాన వనరుగా ఉన్న శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని వీలైనంత తొందరగా పునఃరుద్దరించే పనుల్లో రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. షార్ట్ సర్కూట్ వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడంతో పాటు పవర్ ప్రాజెక్టును పునఃరుద్దరించేందుకు నివేదికను వీలైనంత త్వరగా రాష్ట్ర ప్రభుత్వానికి సిఐడి అధికారులు అడుగులు వేస్తున్నారు. టర్బన్లకు నష్టం జరగకపోతే ప్యానెల్ బోర్డులు, ట్రాన్స్‌ఫార్మర్లను వీలైనంత త్వరగా పునఃరుద్దరించి విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా సొరంగంలో నుంచి లీకేజీ అవుతున్న నీటితో రెండు అంతస్తుల మేరకు నిండి ఉన్నట్లు సమాచారం. అధికారులు ముందస్తు చర్యలుగా ప్రత్యేకంగా మోటర్లను అమర్చి లీకేజీ నీటిని తోడేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా విద్యుత్ శాఖ అధికారులు సొరంగంలోకి తాత్కాలికంగా విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. సోమవారం నుంచి కాలిన ప్యానెల్ బోర్డులు, ట్రాన్స్‌ఫార్మర్లు తొలగించే పనులు చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు దట్టమైన పొగ కమ్ముకోవడం, ట్రాన్స్‌ఫార్మర్లు కాలడం ద్వారా అందులో ఉన్న ఆయిల్ చిమ్మడం, పొగ కమ్ముకోవడంతో నల్లగా మారిన భాగాలను శుభ్రపరిచే పనులకు శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ పనులన్నీ సిఐడి అధికారులు అనుమతిస్తేనే చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆనవాళ్లు సేకరించడం ఫోటో, వీడియోగ్రఫీ ద్వారా సొరంగంలో జరిగిన సంఘటనను చిత్రీకరించే పనులు పూర్తయితే పునఃరుద్దరణ పనులు ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకోసం నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం ఉద్యోగులు, సిబ్బంది సహకారాన్ని కూడా తీసుకునే అవకాశాలు ఉన్నాయి. భూగర్భ పవర్ హౌజ్ వద్ద నాగర్‌కర్నూల్ జిల్లా పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రతను చేపట్టింది. జిల్లా కలెక్టర్ శర్మన్ నేతృత్వంలో సిఐడి బృందానికి పూర్తిస్థాయిలో టెక్నికల్ సహకారాన్ని అందించేందుకు అక్కడే ఉండి చర్యలు తీసుకుంటున్నారు.ఇదిలా ఉండగా జులై 26వ తేదిన జెన్‌కొ సిఎండి ప్రభాకర్ రావు శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని సందర్శించి విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్న తీరు తెన్నులతో పాటు సమస్యలను అధికారులతో అడిగి తెలుసుకున్న విషయం విధితమే. సిఎండి సందర్శించిన 25 రోజులకు దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. కాగా ముఖ్యమంత్రి ఆదేశాలతో ఈ నెల 20వ తేదిన జరిగిన శ్రీశైలం ఎడమ గట్టు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు దుర్ఘటనపై సిఐడి విచారణ జరుగుతుండడంతో పూర్తి స్థాయి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు బృందం సభ్యులు విచారణను వేగవంతం చేశారు.

CID to Begin Probe in Srisailam power plant Accident

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News