Home తాజా వార్తలు ప్రచారానికి సినీ దిగ్గజాలు

ప్రచారానికి సినీ దిగ్గజాలు

Sye Raa movie

 

‘సాహో’ చిత్రం తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘సైరా’. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథతో రూపొందుతున్న ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి రెండు షేడ్స్ ఉన్న పాత్రలో అభిమానులను అలరించనున్నారు. బంధిపోటు దొంగగా, తెల్లదొరలపై తిరుగుబాటు చేసే విప్లవ వీరుడిగా ఆయన కనిపించనున్నారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా ఈ చిత్రం విడుదల కానుంది. గాంధీ జయంతి రోజున సెలవు మొదలుకొని దసరా సెలవులను కవర్ చేసేలా సినిమా విడుదలను పకడ్బందీగా ప్లాన్ చేసింది కొణిదెల ప్రొడక్షన్స్. అందుకు తగ్గట్టే ప్రచారంలోనూ నూతన ఒరవడిని సృష్టించేందుకు నిర్మాత రామ్ చరణ్, దర్శకుడు- సురేందర్ రెడ్డి పక్కాగా ప్లాన్ సిద్ధం చేశారని తెలిసింది.

ఇక ఈనెల 10న తొలి సింగిల్ రిలీజ్ కానుంది. ఆతర్వాత 15న కర్నూల్‌లో ప్రీరిలీజ్ వేడుకను మెగాభిమానుల సమక్షంలో భారీగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. అలాగే అన్ని మెట్రో నగరాల్లోనూ భారీగా సినిమా ప్రమోషన్ ఈవెంట్లను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమా ప్రచారంలోకి సినీ దిగ్గజాలను దించుతున్నారన్నది తాజా అప్‌డేట్. బిగ్ బి అమితాబ్, రజనీకాంత్, పవన్‌కల్యాణ్, సుదీప్, మోహన్‌లాల్ సహా అన్ని భాషల స్టార్లు ఈ ప్రచారంలో పాల్గొంటారట.

తద్వారా ‘సైరా’కి కావాల్సినంత హైప్ తేవాలన్నది ప్లాన్. ఇక ప్రీరిలీజ్ ఈవెంట్‌కి పవన్‌కల్యాణ్ ముఖ్య అతిధిగా విచ్చేస్తారని తెలిసింది. అలాగే సూపర్‌స్టార్ రజనీకాంత్‌ని తమిళ ప్రమోషన్స్ కోసం, మలయాళం కోసం సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌ని మెగాస్టార్ చిరంజీవి స్వయంగా సాయం కోరతారని అంటున్నారు. ఇక టీజర్, మేకింగ్ వీడియోతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Cine Celebrities for Sye Raa movie propaganda