Thursday, April 25, 2024

హత్యా రాజకీయాలపై అగ్గిపిడుగు

- Advertisement -
- Advertisement -

2017 అక్టోబర్ 24, మంగళవారం ఉదయం భారతీయ చలన చిత్ర పరిశ్రమ ఒక గొప్ప చలన చిత్ర దర్శకుణ్ణి కోల్పోయింది. ఆయన పేరు ఐ.వి. శశి (69) పలు భారతీయ భాషల్లో చలన చిత్రాలు రూపొందించిన ఆయన, హత్యా రాజకీయాల్ని నిరసించిన మానవతా మూర్తి. కమల్ హాసన్, మమ్ముట్టి, రజనీకాంత్ లాంటి కమర్షియల్ సినీ సూపర్ స్టార్‌లను తన వాస్తవిక సినిమాల్లో ఉపయోగించుకుని, వారికి ఒక ప్రత్యేకమైన సినీ వ్యక్తిత్వాన్ని తెచ్చి పెట్టారు. కేరళలో ప్రస్తుతం హత్యా రాజకీయాలు నడుస్తున్నాయి. ఇలాంటివి అక్కడ లోగడ కూడా జరిగాయి. అక్కడి రచయితలు, సినీ దర్శకులు చలన చిత్రాలుగా వాటిని భద్రపరుస్తూ వస్తున్నారు. అలాంటి ప్రయత్నమే ఐ.వి. శశి చేశారు. 1921 నాటి మోప్లా తిరుగుబాటును ‘1921’ గా తెరకెక్కించారు. ఇది 1988లో వెలువడింది. మత కలహాల, ప్రాంతీయ దురభిమానాల దుష్ఫలితాలు ఎలా ఉంటాయో తేల్చి చెప్పడానికి మనకు ఇలాంటి దర్శకులు ఎంత మందైనా అవసరమే! ఎన్ని చిత్రాలైనా అవసరమే!! 1921 జూన్ నవంబర్‌ల మధ్య ఆరు నెలల కాలంలో కేరళలో జరిగిన పాశవిక హత్యలు, మత కల్లోలాలు ఒక చరిత్ర సృష్టించాయి. అంతటి ఘోరాలు అంతకు ముందుగాని, ఆ తర్వాతగాని జరగలేదు. రచయిత టి. దామోదర్, దర్శకుడు ఐ.వి.శశి, నిర్మాత మన్నిల్ మహ్మద్ ఇంకా ఎంతో మంది చరిత్ర పరిశోధకులు సంయుక్తంగా చేసిన కృషి ఫలితమే 1921 చలన చిత్రం!

1920లలో మలబార్ ప్రాంతంలో ఎక్కువ మంది రైతు కూలీలు ముస్లింలే! ఈ ముస్లిం సమూహానికే ‘మోప్లా’ అని పేరు. వీరి మీద హిందూ అగ్ర వర్ణాల వారు అజమాయిషీ చేసేవారు. అన్ని రకాలుగా దోచుకునేవారు. హింసించేవారే. ఈ రెండు మతాల మధ్య శత్రుత్వం ఏపుగా పెరిగి, పూవులు పూసి కాయలు కాయడానికి కారణం వీరి మధ్య మూడవ శక్తి పని చేయడమే. ఆ మూడవ శక్తి ఆనాటి బ్రిటీష్ ప్రభుత్వం. బ్రిటీష్ పాలకులు ఒక ‘పథకం’ ప్రకారం హిందువుల్ని, ముస్లింలని విడగొట్టి, వారి మధ్య శత్రుత్వాన్ని పెంచి పబ్బం గడుపుకున్నాయి. ఆనాడు ఆ బ్రిటీష్ వాడు నేర్పిన ఆ ‘పథకం’ నేటి మన రాజకీయ నాయకులంతా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపయోగించుకుంటున్నారు. ‘1921’ చిత్రానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఆనాటి వాతావరణం, ఆనాటి వేషభాషలు, ఆనాటి తిరుగుబాటు తీవ్రత మొదలైన అంశాలన్నీ యథాతథంగా నమోదు చేయబడ్డాయి. అదీగాక నిజంగా తిరుగుబాటు జరిగిన ప్రాంతాల్లోనే చిత్ర చిత్రీకరణ జరిగింది. చరిత్రను వక్రీకరించకుండా, ఖర్చుకు వెనుకాడకుండా చేసిన సాహసోపేతమైన ప్రయత్నం ఇది. ఒక వైపు భారత స్వాతంత్య్ర సమరం కేరళలో ఆ సంవత్సరమే ఊపందుకుంది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వచ్చి చేరిన టర్కీ వారు, బ్రిటీష్ వారు ఆ ప్రాంతంలోని ముస్లింలను రాచి రంపాన పెట్టారు. బ్రిటీష్ వారు మోప్లా జాతికి అత్యంత ప్రియమైన తిరురంగడి మసీదును నేల మట్టం చేశారు.

మోప్లా జాతి ముస్లింలు భరించలేకపోయారు. బ్రిటీష్ సైనికుల్ని తరిమి తరిమి కొట్టారు. ప్రజల తిరుగుబాటును అణచివేయడం ఏ కాలంలోనైనా ఏ ప్రభుత్వానికైనా సాధ్యం కాదు. అక్కడ అప్పడు అదే జరిగింది. అప్పుడు ప్రభుత్వం కుట్రపూరితమైన ‘పథకం’ అమలు చేసింది. ఆ పథకం ఏమిటంటే హిందూ అగ్ర వర్ణాల వారికీ, మోప్లా ముస్లింలకూ మధ్య కలహాలు సృష్టించడం. ప్రభుత్వం తన స్వార్థ ప్రయోజనం మాత్రమే చూసుకుంది. ఇరు వర్గాల వారు చంపుకుంటూ ఉంటే, వినోదం చూసి ఆనందించింది మరో పక్క బలపడింది. వర్గ పోరు జరగడమంటే ప్రభుత్వాలు సుస్థిరంగా రాజ్యపాలన చేస్తున్నట్టే! హిందూ అగ్ర వర్ణాలకు, మోప్లా ముస్లింలకు మధ్య చెలరేగిన కలహాల ఫలితంగా ఇరువైపులా రక్తం ప్రవహించింది. శవాలు ఊరేగాయి. కొన్ని శతాబ్దాలుగా ఈ దేశంలో కలిసి ఉంటున్న హిందూ ముస్లింలు శత్రువులు కారని అసలు శత్రువు బయటి నుంచి వచ్చిన బ్రిటీష్ వాడని గ్రహించడానికి కొంత కాలం పట్టింది. తిరురంగడి మసీదు ముల్లా అలీ ముసావియర్ రక్త పాతాన్ని ఆపడానికి బ్రిటీష్ వారికి లొంగిపోయాడు. వారు అతణ్ణి ఉరి తీశారు. ఆ రకంగా కొన్ని దశాబ్దాల వరకూ మోప్లా జాతి మలబార్ ప్రాంతంలో కోలుకోలేదు.

తిరుగుబాటుదారుల నాయకుడు ఖాదర్ పాత్రను మలయాళీ నటుడు మమ్ముట్టి మహాద్భుతంగా పోషించారు. అలీ ముసావియర్ పాత్రను మధు, పోలీస్ సూపరింటెండెంట్ అమూసాహిబ్ పాత్రను కె.పి. ఉమర్, రిటైర్డు ఆర్మీ ఆఫీసర్ పాత్రను సోమన్, మహ్మద్ ముసావియర్ పాత్రను బహద్దూర్‌లు ప్రతిభావంతంగా పోషించారు. ఇతివృత్తం, నటీనటుల నటన, కథాకథన పద్ధతి మాత్రమే కాదు సాంకేతిక పరంగా కూడా ఉన్నత ప్రమాణాల్లో ఉన్న చిత్రం ఇది. ఇలాంటి చిత్రాలకు అవార్డులు రావడం గొప్ప విషయం కాదు. కొన్ని చిత్రాలు అవార్డులు వచ్చినందువల్లే గొప్పవవుతాయి. మరి కొన్నింటికి రాకపోతే అవార్డు కమిటీ అజ్ఞానం బయటపడుతుంది. అయితే ఆ చిత్రాల గొప్పతనం తరిగిపోదు. జాతీయ స్థాయిలో ‘1921’ ఉత్తమ మలయాళ చిత్రంగా ఎన్నికైంది. ఫిలింఫేర్ అవార్డు సాధించింది. దర్శకుడు ఐ.వి.శశి, హీరో మమ్ముట్టిలకు ఆ చాత్రంతో ఎంతో ప్రజాదరణ లభించింది. మలబార్‌లో జరిగిన ఈ ఖిలాఫత్ ఉద్యమం వంటి ఉద్యమాలు దేశంలో ఎన్నో చోట్ల ఎన్నో జరిగాయి. ప్రజా ఉద్యమాల్ని చిత్తశుద్ధితో తెర కెక్కించి చరిత్రను కాపాడుకుందామన్న మహదాశయం ఉండాలేగాని, దేశంలో ఇతివృత్తాలకు కొదువ లేదు. మన తెలంగాణలో మాత్రం ఎన్ని ఉద్యమాలు లేవూ? ఎంతటి పోరాటాలు లేవూ? వాటిపై దృష్టి సారించేవారు లేరు. అందుకే జాతీయ స్థాయిలో నిలబడ్డ మన పోరాటాల చలన చిత్రమే లేదు. పోనీ “మా భూమి”ని చెప్పుకుందామంటే అది బెంగాలి దర్శకుడు గౌతమ్ ఘోష్ ఖాతాలో ఉంది. మలబార్ ప్రాంతంలో 1930 తర్వాత వచ్చిన కమ్యూనిస్టు ఉద్యమాల్ని మరి కొంత మంది మలయాళ దర్శకులు చిత్రీకరించారు. “ఆస్థికల్ పొక్కున్ను” (అస్థికలు పుష్పిస్తాయి) అన్న పేరుతో శ్రీకుమార్ తీసిన చిత్రం మంచి గుర్తింపు పొందింది. వామపక్ష రాజకీయాల్ని ఇతివృత్తాలుగా తీసుకుని ఆదూర్ గోపాలక్రిష్ణన్ (ముఖాముఖిం) లెనిన్ రాజేంద్ర (మీనా మసాత్తిలె సూర్యన్) వంటి వారు రాజకీయ సినిమాలకు ఒరవడి పెట్టారు.

ఇరుప్పం వీదు శశిధరన్ (28 మార్చి 194824 అక్టోబర్ 2017)గా పుట్టిన ఈయన సినీ జగత్తులో ఐ.వి.శశిగా ప్రసిద్ధుడయ్యారు. ఆయనకు తను పెట్టి పెరిగిన ఊరు కొజికోడ్ (కాలికట్) అంటే ఎంతో ఇష్టం. ‘అంగడి వలియంగడి’ చిత్రం కొజికోడ్‌లో తను చిన్నప్పుడు తిరిగిన అంగళ్లలోనే చిత్రీకరించారు. ఏ మాత్రం వీలు దొరికినా, అక్కడి వెస్ట్ హిల్స్‌లోని తన ఇంటి చుట్టూ ఉన్న చిననాటి మిత్రులతో గడిపేవారు. కొత్త సినిమా ఏదైనా అనుకుంటే యూనిట్ సభ్యుల్ని పిలిచి అక్కడి హోటల్ మహారాణిలో ‘సిట్టింగ్’ లేసేవారు. ఒక రకంగా మలయాళ చిత్ర పరిశ్రమకు ఆ హోటల్ కేంద్ర బిందువు! తొలి దశలో శశికి కూడా అంతే. ఆ ఊళోల. ఆ హోటల్లో మాత్రమే ఆయన సినిమా స్క్రిప్టులు తయారయ్యేవి. (ఒక జాతీయ కవి సమ్మేళనానికి కేంద్ర సాహిత్య అకాడెమీ ఆహ్వానంపై తెలుగు కవిగా ఈ వ్యాస రచయిత కొజికోడ్ వెళ్లినపుడు ఆ హోటల్లోనే బస చేయడం జరిగింది. అందువల్ల ఐ.వి.శశి సినిమా స్క్రిప్టులు తయారైన చోటు, వాతావరణం చూసినట్లయ్యింది. అంతేకాదు, ఐ.వి.శశి దర్శకత్వ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించిన మలయాళ జ్ఞానపీఠ్ గ్రహీత ఎం.టి. వాసుదేవ నాయర్‌తో కలిసి ఓ సభలో పాల్గొన్న అనుభవం కూడా ఈ వ్యాస రచయితకు ఆ ఊళ్లోనే దక్కింది.) ఐ.వి.శశి తమిళం, తెలుగు, హిందీ భాషా చిత్రాలు కూడా తీసి తన పరిధి పెంచుకున్నారు. ముప్పయి నాలుగేళ్లలో నూటాయాభై పై చిలుకు సినిమాలు తీశారు. కథా ఇతివృత్తాన్ని బట్టి ఆయన శైలి ఉంటూ ఉండేది.

కమర్షియల్‌గా బాగా డబ్బు తెచ్చినా బ్లాక్ బస్టర్ చిత్రాలూ ఉన్నాయి. అలాగే, కళాత్మకంగా మేధోపరమైన ప్రశ్నల్ని లేవనెత్తిన చిత్రాలూ ఉన్నాయి. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్‌ను తన ‘అల్లా ఉద్దీన్ అద్భుత విలక్కున్’లో తొలి అడుగులు వేయించింది ఈయనే. కమల్ హాసన్‌ను (గురు), మోహన్ లాల్‌ను (దేవసురమ్), రాజేష్ ఖన్నాను (అనూఖారిస్తా), మిథున్ చక్రవర్తిని (పతిత) ఇంకా ఎంతో మంది హీరో, హీరోయిన్లకు తెర మీద అద్భుతమైన జీవితాన్నిచ్చింది ఈ దర్శకుడే! 1982 లో నర్గిస్ దత్ జాతీయ సమైక్యతా అవార్డునందుకున్న ఐ.వి.శశి 2015లో ‘ఆరూఢమ్’కు జీవన సాఫల్య పురస్కారం పొందారు. అలాగే మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యున్నత పురస్కారం జె.సి.డేనియల్ అవార్డు కూడా స్వీకరించారు. అ మెరికాలో తొలి మలయాళ చలన చిత్రం షూట్ చేసిన ఘనత వీరిదే. ఇంకా చెప్పుకోవాలంటే ‘సురలోక జలధార’ అనే గీతాన్ని నయగరా జలపాతం ఒంటారియో కెనడాలో చిత్రీకరించింది కూడా వీరే. ఇలాంటివన్నీ ఏవో రికార్డుల కోసం ఆయన చేయలేదు. కథకు, చలనచిత్రానికీ తప్పక అవసరం అని అనుకుంటేనే ఆయన అలా చేసేవారు.

ఐ.వి.శశికి మలయాళ చిత్ర పరిశ్రమలో గొప్ప గౌరవప్రదమైన స్థానం ఉంది. 1980లలో సినిమా షూట్ చేస్తున్నప్పుడు సెట్ మీద సీమ అనే నటి కనిపించింది. ఆయనకు ఆమె సహజ నటన నచ్చింది. తర్వాత ఆమెను ఆరాధించడం ప్రారంభించారు. చివరకు ఆమెను పెండ్లి చేసుకున్నారు. ఆమెతో దాదాపు ముప్పయి సినిమాలు తీశారు. అవన్నీ విజయవంతమయ్యాయి. నటి సీమ అసలు పేరు శాంత కుమారి. తమిళనాడుకు చెందిన ఈమె, దక్షిణాది చిత్రాల్లో, హిందీలో గొప్పనటిగా పేరు తెచ్చుకున్నారు. వీరికి ఒక కూతురు (అనూమిలన్) ఒక కొడుకు (అని శశి). కూతురు తల్లిలాగానే నటనారంగాన్ని ఎంచుకుంది. ఐ.వి.శశి చిత్రం “సింఫనీ’లో నటించింది కూడా! ఐ.వి.శశి తన చివరి రోజులు తమిళనాడు చెన్నైలోని సాలిగ్రామంలో గడిపారు. కళ కళ కోసమే అని కాకుండా, కళ సమాజం కోసం అని బాధ్యతతో సినిమానే శ్వాసిస్తూ బతికిన ఐ.వి.శశికి మంచి సినిమా కోసం తహతహలాడిన ప్రేక్షక ప్రపంచం శ్రద్ధాంజలి ఘటించింది.

డా. దేవరాజు
మహారాజు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News