Home తాజా వార్తలు డంబాలు పలకొద్దు

డంబాలు పలకొద్దు

kcr

 

ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్ ఉండాలి
ప్రజల భాగస్వామ్యంతో పట్టణాలను అందంగా తీర్చిదిద్దాలి
ప్రగతి భవన్‌లో జరిగిన మున్సిపల్ సమ్మేళనంలో ప్రజాప్రతినిధులకు సిఎం కెసిఆర్ కర్తవ్యబోధ

మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణలోని అన్ని పట్టణాలు, నగరాలను దేశంలోకెల్లా ఆదర్శ పట్టణాలుగా మార్చే గురుతర బాధ్యత కొత్తగా ఎన్నికైన మేయర్లు, చైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లపై ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. మంగళవారం ప్రగతి భవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి మున్సిపల్ సమ్మేళనంలో సిఎం కెసిఆర్ ప్రజాప్రతినిధులకు కర్తవ్యబోధ చేశారు. రాజకీయ నాయకుల ప్రవర్తన ఎలా ఉండాలో సోదాహరణంగా వివరిస్తూ, చివరికి భర్తృహరి సుభాషిత పద్యం చదివి, అర్థం చెప్పి కార్యోన్ముఖులను చేశారు. “మీ కర్తవ్యాన్ని నిర్వహించడంలో మీరు విజయాన్ని సాధించాలి. ప్రజా జీవితంలో అనేక రకాల అనుభవాలుంటాయి. దేశంలో, రాష్ట్రంలో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రాజకీయాలు చాలా సులభం అయిపోయాయి. ఒకప్పుడు రాజకీయాలంటే కష్టంతో, త్యాగంతో కూడుకున్నటువంటివని ఈ సందర్భంగా సిఎం వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వారి వలస పాలన తర్వాత స్వతంత్ర భారతంలో సౌకర్యవంతమైన రాజకీయాలు వచ్చాయన్నారు.

అప్పట్లో ఆత్మార్పణ, త్యాగం అయితే నేడు స్వేచ్ఛా భారతంలో ఉన్నామన్నారు. జాతి నిర్మాణ రంగంలో మనమంతా మమేకమైపోయామన్నారు. దీన్ని గుర్తెరిగి పనిచేసే వారికి మంచి పేరు వస్తుందన్నారు. ప్రజా నాయకులుగా ఎదిగితే, అది జీవితానికి మంచి సాఫల్యమని సిఎం పేర్కొన్నారు. అధికారం, హోదా వచ్చాక మనిషి మారకూడదని హితువు చెప్పారు. లేని గొప్పతనాన్ని, ఆడంబరాన్ని తెచ్చుకోవద్దు అని సూచించారు. ఐదు కోట్ల మందిలో 140 మందికే మేయర్లు, చైర్ పర్సన్లు అయ్యే అవకాశం వచ్చిందన్న విషయాన్ని ప్రజాప్రతినిధులుగా మీరు గుర్తు పెట్టుకోవాలన్నారు. దీన్ని ఒక ముందడుగుగా స్వీకరించి, సానుకూలంగా మార్చుకోగలిగితే ప్రజా జీవితంలో ఎంత ముందుకైనా పోవచ్చు అని… అది మీ చేతుల్లోనే ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. విధి నిర్వహణలో విఫలం కావొద్దు అన్నారు.

పదవి అసిధారావ్రతం (కత్తిమీద సాము) లాంటిదని, ప్రజా జీవితం అంత సులభం కాదన్నారు. సోయి తప్పి పని చేయవద్దని సిఎం పేర్కొన్నారు. చాలా కష్టపడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామని, మన రాష్ట్రం వస్తే మనం బాగుపడతామని ప్రబలంగా పోరాడామన్నారు. ప్రజలు తనను రెండు సార్లు సిఎం చేశారన్నారు. తన వరకైతే గెలిచేంత వరకే రాజకీయమని తర్వాత కాదన్నారు. ప్రభుత్వ పథకాల అమలు చూస్తే అది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుందన్నారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ లాంటి పథకాలు అన్ని గ్రామాల్లో వివక్ష లేకుండా అమలు చేశామన్నారు. ప్రజలంతా మనవాళ్లే అనుకున్నామని సిఎం అన్నారు. ఏ పని చేయాలన్నా తదేక దీక్షతో చేయాలని వారికి సూచించారు. చాలా మందికి ఆత్మవిశ్వాసం తక్కువ ఉంటుందని, అలా ఉండకూడదన్నారు. అవగాహతో అర్థం చేసుకుని, చేయాలని అనుకుంటేనే బాధ్యత తీసుకోవాలన్నారు.

పట్టుదల ఉంటేనే ఏరంగంలోనైనా విజయం సాధిస్తారన్నారు. మీ మీద ప్రజలకు నమ్మకం కలగాలని, అలా ఒక్కసారి నాయకుడి మీద విశ్వాసం కలిగితే ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తారని సిఎం అన్నారు. ప్రజాశక్తిని మనం సమీకృతం చేయగలిగితే గొప్ప ఫలితాలు సాధించేందుకు అవకాశముంటుందన్నారు. ఇప్పుడు ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులే రేపటి నాయకులు అవుతారన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గట్టిగా సంకల్పంతో పనిచేస్తే వందశాతం విజయం సాధిస్తారని అని సిఎం చెప్పారు. “మున్సిపాలిటీ అంటేనే మురికికి, చెత్తకు పర్యాయపదంగా మారిందన్నారు. అవినీతికి మారుపేరు అయిందని వ్యాఖ్యానించారు. బల్దియా .. ఖాయా పీయా చల్దియా అనే సామెతలు వచ్చాయని గుర్తు చేశారు. ఆ చెడ్డ పేరు పోవాలంటే పారదర్శకమైన విధానాలు అవలంభించాలని సిఎం సూచించారు. అవినీతి రహిత వ్యవస్థ ఉండాలన్నారు. ఇందుకు పట్టణ ప్రగతి ప్రణాళికా బద్ధంగా ఉండాలని, అడ్డదిడ్డంగా ఎటుపడితే అటు కాదన్నారు.

అది మీ చేతుల్లో ఉందని అన్నారు. “ప్రజాప్రతినిధులు డంబాచారాలు పలకవద్దు. అన్ని పనులు ఓవర్ నైట్‌లో చేసేస్తాం అని మాట్లాడవద్దన్నారు. ఏం చేయాలనే విషయంలో పక్కా ప్లానింగ్ వేసుకోవాలని సూచించారు. వాటిపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలన్నారు. సమగ్ర కార్యాచరణను రచించుకుని రంగంలోకి దిగాలన్నారు. అందరినీ కలుపుకుని పోయి, ప్రజల భాగస్వామ్యంతో అనుకున్న విధంగా పట్టణాలను తీర్చిదిద్దాలన్నారు. ఫోటోలకు ఫోజులివ్వడం తగ్గించి, పనులు చేయించడంపై ఎక్కువ దృష్టి పెట్టాలన్నారు. సరిగ్గా అనుకుని ఆరు నెలలు కష్టపడితే పట్టనాలు మంచి దారి పడతాయన్నారు. ప్రగతి నిరోధక శక్తులు ఎప్పుడూ ప్రతిబంధకంగా ఉంటూనే ఉంటాయని వాటిని అధిగమించాల్సిన అవసరముందన్నారు. ప్రగతికాముకంగా ముందుకు సాగాలి. ఎప్పుడూ ఇతర దేశాల విజయగాథలు వినడమే కాదు. మనమూ విజయం సాధించాలన్నారు. మన పట్టనాలను మనమే మార్చుకోవాలి అని పేర్కొన్నారు. చివరిగా సిఎం ఏనుగు లక్ష్మణకవి రాసిన పద్యాన్ని చదివారు.

మేయర్ల, చైర్ పర్సన్లు, అధికారులు అనుకున్న లక్ష్యం సాధించి, ఉత్తములుగా నిలవాలని ఆకాంక్షించారు. ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులై యారంభించి పరిత్యజించుదురు విఘ్నాయత్తులై మధ్యముల్ ధీరుల్ విఘనిహన్య మానులగుచు ధ్రుత్యున్నతొత్సాహులై ప్రారబ్ధార్ధము లుజ్జగింపరు సుమీ ప్రజ్ఞానిధలల్ గావునన్ (ఏదైనా పని మొదలు పెట్టినపుడు ఎన్ని అడ్డంకులు ఎదురయినా వెరువక తుదికంటా లక్ష్యం కోసం శ్రమించడమే కార్య సాధకుడి నైజం. అలాంటివారు ఉత్తములు. ఎప్పుడో ఎదురయ్యే అడ్డంకులను తలచుకుని ఏ పనిఊ చేపట్టనివారు అధములు. ఏదో చెయ్యాలన్న తపనతో మొదలు పెట్టినప్పటికీ మధ్యలో ఆటంకాలు ఎదురవగానే వదిలేసేవారు మధ్యములు) అని హితబోధ చేశారు.

Cities should be beautified with participation of people