Home జాతీయ వార్తలు పౌరసత్వ మంటలు

పౌరసత్వ మంటలు

CAB-Act-Protest
బెంగాల్, అసోంలలో హింసోద్రిక్తత, బెంగాల్‌లో 15 బస్సులు దగ్ధం, రైల్వే స్టేషన్‌కు నిప్పు, జాతీయ రహదారులు బంద్, ఆగిన రైళ్లు, పట్టాలపై ధర్నాలు, ఆందోళనకారులకు మమతా బెనర్జీ హెచ్చరిక, అసోంలో ఆయిల్ ట్యాంకర్ దగ్ధం, హౌరా వెళ్లే రైళ్లు రద్దు

కోల్‌కతా/ గువాహతి : పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌లో వరసగా రెండో రోజు శనివారం కూ డా హింసాత్మక ఆందోళనలు కొనసాగాయి. నిరసనకారులు చాలా బస్సులకు నిప్పంటించారు. ఒక రైల్వేస్టేషన్‌లో కొంతభాగాన్ని తగలబెట్టారని అధికారులు తెలిపారు. ముషీరాబాద్, ఉత్తర 24 పరగణాల జిల్లాలు, గ్రామీణ హౌరాలలో హింసాత్మక సంఘటనలు జరిగాయని పోలీసులు చెప్పారు. ఆ వేశంతో ఉన్న ఆందోళనకారులు దాదాపు 15 ప్ర భుత్వ, ప్రైవేట్ బస్సుల్ని అగ్నికి ఆహుతి చేశారు. హౌరాలో కోన ఎక్స్‌ప్రెస్‌వేని దిగ్బంధం చేసి, ట్రా ఫిక్‌ను  నిలిపేశారు.

గ్రామీణ హౌరాలో గత రాత్రి నుంచి 20 షాపుల్ని దహనం చేశారు. ము షీరాబాద్‌లో ఉత్తర, దక్షిణ బెంగాల్‌లను అనుసంధానం చేసే 34వ జాతీయ రహదారిని కూడా దిగ్బంధం చేసి, బస్సులకు నిప్పంటించినట్టు పోలీసులు తెలిపారు. జిల్లాలో ఇతర రోడ్లను కూడా బ్లాక్ చేశారు. హౌరా జిల్లాలో దొమ్‌జూర్ ప్రాంతంలో 6వ జాతీ య రహదారిని ఆటంకపరిచి, టైర్లను తగలబెట్టారు. వాహనాల్ని ఆపి దోచుకున్నారు. పరిస్థితి అదుపు చేసేందుకు అక్కడ పెద్ద ఎత్తున పోలీసుల్ని మోహరించారు.

రైల్వేస్టేషన్‌కు నిప్పు, ఆగిన రైళ్లు

హౌరా జిల్లాలో ఆందోళనకారులు సంక్రయిల్ రైల్వేస్టేషన్‌కు నిప్పు పెట్టారు. రైల్వేస్టేషన్‌లో పోలీసులపై దాడి చేశారు. షోండాలియా, కాక్రా మీర్జాపూర్ స్టేషన్లలో రైలు పట్టాలపై బైఠాయించారు. ఆగ్నేయ రైల్వేలో శనివారం 20 రైళ్లను వివిధ స్టేషన్లలో ఆపేశారు. మరికొన్నింటిని రద్దు చేశారు.

విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్య: మమతా

రాష్ట్రంలో శనివారం పలుచోట్ల విధ్వంసం, హింస చెలరేగడంతో పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ తీవ్రం గా స్పందించారు. శాంతికి భంగం వాటిల్లకుండా, ప్రజాస్వామికంగా ఆందోళన చేయవచ్చని అన్నారు. ‘చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు. రోడ్లపై ఆటంకాలు పెట్టి, ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దు. ప్రభుత్వ ఆస్తులకు ధ్వంస చేయవద్దు. హింసాత్మక ఆందోళనతో, విధ్వంసానికి పాల్పడితే కఠినచర్యలు తప్పవు’ అని మమతా బెనర్జీ హెచ్చరించారు.ప్రజల్ని అయోమయానికి గురిచేయవద్దని విన్నవిస్తున్నానన్నారు.

కర్ఫూ సడలింపు

ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో గువాహతిలో విధించిన కర్ఫూను శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటలవరకు సడలించినట్టు పోలీసులు తెలిపారు. ఆ సమయంలో డిస్‌పూర్, ఉజన్ బజార్, చంద్‌మారి, సిల్పుఖురి, జూ రోడ్‌తో సహా నగరంలో అనేకచోట్ల షాపుల ఎదుట ప్రజలు నిత్యావసరాలకోసం బారులుతీరి కనిపించారు.ఆటోరిక్షాలు, సైకిల్ రిక్షాలు నగరంలో తిరుగుతూ కనిపించాయి. అయితే బస్సులు మాత్రం రోడ్లపై కనిపించలేదు. పాఠశాలలు, ఆఫీసులు మూసిఉన్నాయి. అయితే పెట్రోల్ పంపులు పనిచేశాయి. కర్ఫూ సడలించినట్టు పోలీసులు లౌడ్‌స్పీకర్ల ద్వారా ప్రకటించారు.

ఆయిల్ ట్యాంకర్ దగ్ధం

అసోంలోని గువాహతిలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా శనివారం కూడా ఆందోళనలు జరిగాయి. సోనిట్‌పూర్‌లో ఆందోళనకారులు ఒక ఆయిల్ ట్యాంకర్ కు నిప్పు పెట్టారు. ఉదల్‌గురి జిల్లాలో సిపజార్ నుంచి ఈ ఖాళీ ట్యాంకర్ పెట్రోల్ నింపుకోడానికి వెడుతోండగా సోనిట్‌పూర్ లోని ధెకియజులి దగ్గర శుక్రవారం రాత్రి దగ్ధం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేశారు. అయితే అతను మరణించారు. ఇలా ఉండగా ఎఎఎస్‌యు, అసోం జాతీయ తబది యువ ఛాత్ర పరిషద్ ( ఎజెవైసిపి), మరో 30 సంస్థలు సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, నటీనటులు, గాయకులు, మేధావులు, అధ్యాపకులతో కలిసి బ్రహ్మపుత్ర లోయలోని అన్ని జిల్లాల్లో ఆందోళనలు జరిపా యి.

కామాఖ్య రైల్వే స్టేషన్‌లో ఎజెవైసిపి కార్యకర్తలు రైళ్లను ఆపేశారు. పట్టాలపై కూచుని ఆందోళన చేశారు. వివిధ సంస్థలు నిరాహార దీక్షలు చేపట్టాయి. ‘ప్రజల్ని ఇబ్బంది పెట్టడం మా ఉద్దేశం కాదు. కానీ, పౌరసత్వచట్టం వల్ల ఈ రాష్ట్రానికి కలిగే హానిని దేశప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఆందోళన చేస్తున్నాం’ అని ఎజెవైసిపి జనరల్ సెక్రెటరీ పాలాష్ ఛంగ్మాయ్ చెప్పారు. డిసెంబర్ 16న రాష్ట్రమంతటా 36 గంటలపాటు గణ అంశన్ (సామూహిక నిరాహార దీక్ష)కు, డిసెంబర్ 18న గ్రామసభలకు ఎజెవైసిపి పిలుపునిచ్చింది. ఎగువ అసోం జిల్లాలకు వెళ్లే రైళ్లను గువాహతి వద్ద నిలిపేసినట్టు ఎన్‌ఎస్‌ఆర్ ప్రతినిధి తెలిపారు.

పరీక్షలు రద్దు

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన జరుపుతుండడంతో జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో యూనివర్సిటీ జనవరి 5 వరకూ సెలవులు ప్రకటించింది. ‘అన్ని పరీక్షల్నీ వాయిదా వేశాం. కొత్త తేదీల్ని తర్వాత ప్రకటిస్తాం. డిసెంబర్ 16 నుంచి జనవరి 5 వరకూ సెలవులు ప్రకటించాం. జనవరి 6న యూనిర్సిటీని తెరుస్తాం’ అని విశ్వవిద్యాలయం సీనియర్ అధికారి చెప్పారు.

పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు పార్లమెంటుకు ర్యాలీ నిర్వహించాలనుకున్నప్పుడు పోలీసులు అడ్డుకోవడంతో పరస్పరం ఘర్షణ పడ్డారు. దాంతో శుక్రవారం నాడు యూనివర్సిటీ రణరంగాన్ని తలపించింది. శనివారం విద్యార్థులు యూనివరిటీ బంద్‌కు పిలుపునిచ్చి, పరీక్షల బహిష్కరణకు సిద్ధమయ్యారు. ‘అందరూ బతకాలనే కోరుకుంటారు. ఇది ఇజ్రాయెల్ కానీ, సిరియా కానీ కాదు. ప్రభుత్వం ప్రధానాంశల్ని పట్టించుకోవడం లేదు’ అని పప్పు యాదవ్ అనే విద్యార్థి ఆరోపించారు.

హౌరా వైపు నడిపే రైళ్లు రద్దు

పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బెంగాల్ రాష్ట్రం జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో హౌరా పట్టణానికి నడిపే పలు ఎక్స్ ప్రైస్ రైళ్లను రద్దు చేశారు. శనివారం నుండి సోమవారం వరకు ఏడు ఎక్స్ ప్రెస్ రైలు రద్దు చేశామని విడుదల చేసిన ప్రకటనలో రైల్వే అధికారులు తెలిపారు. ఈస్టర్న్ రైల్వే జోన్‌తోపాటు దక్షిణ మధ్య రైల్వే జోన్ నుండి నడిచే రైలు రద్దు చేశారు. శనివారం రద్దు చేసిన రైళ్లలో హౌరాతిరుపతి హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్, హౌరాఎర్నాకుల అంతోదయ ఎక్స్‌ప్రెస్, హౌరాఎంజిఆర్ చెన్నై సెంట్రల్ కోయంబత్తూర్ ఎక్స్ ప్రెస్, హౌరాయశ్వంత్‌పూర్ దూరంతో ఎక్స్‌ప్రెస్, హౌరాహైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉన్నాయి. అలాగే ఆదివారం బయలుదేరాల్సిన తిరుపతిహౌరా హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్, సోమవారం బయలుదేరాల్సిన హైదరాబాద్‌హౌరా ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ఉన్నాయని అధికారులు తెలిపారు.

Citizenship Act Protest in West Bengal