Home జాతీయ వార్తలు నేడు రాజ్యసభకు పౌరసత్వ సవరణ బిల్లు

నేడు రాజ్యసభకు పౌరసత్వ సవరణ బిల్లు

Citizenship-Bill
ఆమోదం లభిస్తుందన్న విశ్వాసంతో బిజెపి

న్యూఢిల్లీ : వివాదాస్పద పౌరసత్వ సవరణ బిల్లు (2019)కు లోక్‌సభ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో రాజ్యసభలో ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సమాయత్తమవుతోంది. రాజ్యసభలో ఈ బిల్లును బుధవారంనాడు ప్రవేశపెట్టనుంది. పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌ల్లో మతపరమైన వేధింపులు ఎదుర్కొని ఇక్కడి వచ్చిన శరణార్థులు భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. ఈ మూడు దేశాలకు చెందిన హిందవులు, క్రైస్తవులు, పార్శీలు, జైనులు, బౌద్ధులు, సిక్కులు ఈ పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. సరైన ట్రావెల్ డాక్యుమెంట్లు, ఇతర పత్రాలు లేకపోయినా 2014 డిసెంబర్ 31 లేదా అంతకు ముందు భారత్‌కు వచ్చి ఉండాలి.

ఈ బిల్లుపై సోమవారంనాడు లోక్‌సభలో సుమారు 12 గంటల పాటు వాదోపవాదాలు, విమర్శలు, ఆరోపణల అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓటింగ్ చేపట్టారు. బిల్లుకు అనుకూలంగా 311 ఓట్లు పడగా, వ్యతిరేకంగా 80 మంది ఓటేశారు. దీంతో బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది. ఈ బిల్లు రాజ్యసభలో సైతం ఆమోదం పొండాల్సి ఉం టుంది. బిల్లుకు ఆమోదం లభించాలంటే 245 మంది సభ్యుల రాజ్యసభలో కనీసం 123 మంది సభ్యులు మద్దతివ్వాల్సి ఉంటుంది. అయితే పెద్దల సభలో కూడా బిల్లుకు ఆమోదం లభిస్తుందని అధికార ఎన్‌డిఎ విశ్వాసంతో ఉంది. తమకు సరిపడా సంఖ్యాబలం ఉందని ఆ వర్గాలు ప్రకటిస్తున్నాయి. రాజ్యసభలో బిజెపికి 83 మంది ఉన్నారు.

మిత్ర పక్షం జెడియు ఆరుగురు, శిరోమణి అకాలీదళ్ ముగ్గురు, ఎల్‌జెపి, ఆర్‌పిఐ నుంచి ఒక్కొక్కరు, పదకొండు మంది నామినేటెడ్ సభ్యులు ఇలా మొత్తం 105మంది బలం ఉన్నట్లు. ఇంకా 18మంది మద్దతు అవసరం. ఈ నేపథ్యంలో తమతో కలిసి వస్తారని భావిస్తున్న ఎఐఎడిఎంకె(11), వైఎస్‌ఆర్‌సిపి(2), టిడిపి(2)తో బిజెపి సంప్రదింపులు జరుపుతోంది. ఇంకా లోక్‌సభలో బిల్లును సమర్ధించిన మిగతా పార్టీలు కూడా రాజ్యసభలో కలిసి వస్తాయని బిజెపి విశ్వాసంతో ఉంది. అలా మొత్తం 127మంది మద్దతు లభిస్తుందని, బిల్లు ఆమోదానికి ఢోకా ఉండదని ఎన్‌డిఎ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

కాంగ్రెస్ విప్ జారీ…

పౌరసత్వ సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొంది బుధవారంనాడు రాజ్యసభ ముందుకు వస్తుండటంతో కాంగ్రెస్ అప్రమత్తమైంది. రాజ్యసభ ఎంపిలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. పార్టీ ఎంపిలు రాజ్యసభలో బిల్లు చర్చ, ఓటింగ్ సందర్భంగా బుధవారంనాడు సభకు తప్పనిసరిగా హాజరుకావాలని పార్టీ అధిష్ఠానం ఆ విప్‌లో ఆదేశించింది.
రాజ్యాంగంపై దాడి : రాహుల్

ప్రభుత్వం విధానంపై పోరాడాలి: ప్రియాంక

లోక్‌సభ ఆమోదం పొందిన పౌరసత్వ (సవరణ) బిల్లుపై కాంగ్రెస్ పార్టీ మంగళవారంనాడు ప్రభుత్వాన్ని దుయ్యబట్టింది. ఇది రాజ్యాంగంపై దాడి అని, దీనికి మద్దతు తెలిపేవారు దేశ పునాదుల్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. సోమవారం లోక్‌సభలో బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 311మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయడంతో బిల్లు ఆమోదం పొందింది. 80 మంది బిల్లును వ్యతిరేకించారు. బుధవారంనాడు బిల్లును రాజ్యసభలో ప్రవేశపెడతారు. ‘గత అర్ధరాత్రి పౌరసత్వ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినప్పుడు కుట్రతో కూడిన మూఢవిశ్వాసం స్పష్టమైంది. ఇది భారతీయ ఆత్మపై దాడి’ అని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంకగాంధీ దేశ స్వాతంత్య్రంకోసం మన పెద్దలు రక్తం ధారపోశారని అన్నారు.

ఈ సందర్భంగా ఆమె అర్ధరాత్రి భారతదేశం స్వాతంత్య్రం పొందినప్పుడు జవహర్‌లాల్ ప్రసంగాన్ని గుర్తు చేశారు. ‘అర్ధరాత్రివేళ, ప్రపంచమంతా నిద్రిస్తున్నప్పుడు భారతదేశం స్వేచ్ఛకోసం, జీవితంకోసం లేచింది’ అని నెహ్రూ అన్నారు. ‘సమానత్వం, మత స్వాతంత్య్రంకోసం ఆనాడు తీవ్రపోరాటం చేశారు. మన రాజ్యాంగం, మన పౌరసత్వం, బలమైన, ఐక్య భారతదేశంకోసం మనం కన్న కలలు అందరికీ చెందుతాయి. కాబట్టి ఒక ప్రణాళిక ప్రకారం రాజ్యాంగాన్ని ధ్వంసం చేయాలన్న ప్రభుత్వ అజెండాకు వ్యతిరేకంగా మనం పోరాడాలి’ అని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిలుపునిచ్చారు.

మాకు సమాధానమిస్తేనే పౌర బిల్లుకు మద్దతు : ఉద్ధవ్

ముంబయి: పౌరసత్వ బిల్లు పై లోక్‌సభలో శివసేన స భ్యుల సందేహాలకు ప్రభు త్వం సమాధానం చెప్పాలని, దీనిపై స్పష్టత వచ్చేంతవరకూ పౌరసత్వ (సవరణ) బిల్లుకు సేన రాజ్యసభలో మద్దతివ్వదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థా కరే మంగళవారం స్పష్టం చేశారు. దిగువ సభలో సేన బిల్లుకు మద్దతిచ్చింది. మతపరమైన పీడనకు గురై పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్థాన్‌ల నుంచి వచ్చే ముస్లిమేతర శరణార్థులకు భారతదేశ పౌరసత్వం కల్పించడం ఈ బిల్లు ఉద్దేశం.

సవరణ బిల్లుపై ఏడు గంటలపాటు సాగిన సుదీర్ఘ చర్చ తర్వాత సోమవారం అర్ధరాత్రి దాటిన కొద్దిసేపటికి లోక్‌సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. బిల్లుపై సవివరమైన చర్చ అవసరమని థాకరే మంగళవారం విలేకరులకు చెప్పారు.‘ఈ బిల్లు అమలుకన్నా ఆర్థిక, ఉపాధి రంగాల్లో సంక్షోభం, పెరిగిన జీవన వ్యయం, ముఖ్యంగా ఉల్లిపాయల ధరలపై మోడీ ప్రభుత్వం శ్రద్ధ వహించాలని ఉద్ధవ్ సలహా ఇచ్చారు. ‘బిల్లును, బిజెపిని సమర్థించేవారు దేశభక్తులని, వ్యతిరేకించేవారు జాతి వ్యతిరేకులనే అభిప్రాయం మారాల్సిన అవసరం ఉంది. బిల్లుపై లేవనెత్తిన అన్ని అంశాలకు ప్రభుత్వం సమాధానమివ్వాలి’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు.

citizenship bill in rajya sabha today