Home ఎడిటోరియల్ కుక్క తోక వంకర!

కుక్క తోక వంకర!

Sampadakiyam    పంజరంలోని చిలుక మాదిరిగా తయారయ్యావని సిబిఐ (కేంద్ర పరిశోధన సంస్థ)ని ఆరేళ్ల క్రితం తీవ్రంగా విమర్శించిన సుప్రీంకోర్టు మళ్లీ అదే స్వరంతో ఇప్పుడు దానిని వేలెత్తి చూపడం అధికార దుర్వినియోగం అప్పటికీ ఇప్పటికీ కించిత్తు మార్పు లేకుండా కొనసాగుతున్నదని చాటుతున్నది. 2013లో కోల్‌గేట్ (బొగ్గు కుంభకోణం) కేసు విచారణ సందర్భంగా సిబిఐని పంజరంలో చిలుకతో పోల్చింది జస్టిస్ ఆర్.ఎం. లోధా కాగా ఇప్పుడు సాక్షాత్తు భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ దాని బండారాన్ని ఈ విధంగా బయటపెట్టారు. ప్రముఖులతో ముడిపడిన రాజకీయ కేసుల్లో సిబిఐ రికార్డు ఎంత మాత్రం హర్షించతగినట్టుగా లేదని న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో మంగళవారం నాడు ఆ సంస్థకు సంబంధించిన ఒక ముఖ్య కార్యక్రమంలో పాల్గొంటూ రంజన్ గొగోయ్ ఆందోళన వ్యక్తం చేశారు.

అధికారంలో ఉన్నవారు రాజకీయ స్వప్రయోజన కాండకు వాడుకోడానికి అనువుగానే సిబిఐ ఇప్పటికీ కొనసాగుతున్నదని గొగోయ్ చేసిన వ్యాఖ్యానం ఎంతటి సునిశితమైనదో సుస్పష్టమే. నాటి యుపిఎ హయాంలో గాని ఇప్పటి ఎన్‌డిఎ హయాంలో గాని సిబిఐ యజమాని జేబులో బొమ్మనే తలపిస్తున్నదని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు వెల్లడించారు. రాజకీయ ప్రముఖులకు ప్రమేయమున్న అనేక పై స్థాయి కేసుల్లో సిబిఐ వ్యవహార శైలి న్యాయ ప్రమాణాలకు తగ్గట్లు లేదని ఆయన అన్నారు. రాజకీయ మూలాలు లేని కేసుల్లో ఎంతో సమర్థంగా పని చేస్తున్న సిబిఐ ప్రభుత్వంలోని వారి ప్రమేయం గల వాటిల్లో తరచూ గాడి తప్పుతున్నదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాల్లోని పెద్దలు తమకు విధేయులైన వారిపై గల కేసులను సిబిఐకి అప్పజెప్పకుండా ఉండడం, ఒకవేళ గత్యంతరం లేని పరిస్థితుల్లో దాని దర్యాప్తుకు ఆదేశించినా ఆ కేసు విచారణ సరైన మార్గంలో ముందుకు జరగకుండా చూడడం మామూలయిపోయింది.

గత ఏడాది అక్టోబర్‌లో సిబిఐ అప్పటి డైరెక్టర్ అలోక్ వర్మకు అతని తదుపరి అధికారిగా నియమితులైన గుజరాత్ కేడర్ ఐపిఎస్ అధికారి రాకేశ్ అస్థానాకు మధ్య తలెత్తిన వైషమ్యాలు చిలికిచిలికి గాలివాన అయి అనేక మలుపులు తిరిగి చివరికి ప్రధాని మోడీ నాయకత్వంలోని నియామక కమిటీ మితిమించిన చొరవతో అలోక్ వర్మను తొలగించే వరకు వెళ్లడం దానిని సుప్రీంకోర్టు తప్పుపట్టడం తెలిసిందే. బోఫోర్స్ వంటి కేసుల్లోనూ సిబిఐని అప్పటి కేంద్ర పాలకులు దుర్వినియోగపరిచారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. కేంద్రంలో అధికారంలో ఎవరుంటే వారి అడుగులకు మడుగులొత్తడం సిబిఐ పెద్దలకు వెన్నతో పెట్టిన విద్యగా మారితే మారిపోయి ఉండొచ్చు. అందుకే వారు ‘హిజ్ మాస్టర్స్ వాయిస్’ గా వ్యవహరిస్తూ ఉండొచ్చు. కాని భారత రాజ్యాంగం నిర్దేశిస్తున్న పాలనలో నిజాయితీని, నిష్పాక్షికతను పరిపూర్ణంగా కాపాడవలసిన బాధ్యతను పక్కన పెట్టి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన కనసన్నలలో మెలిగిన రాకేశ్ అస్థానా వంటి ఆఫీసర్‌ను సిబిఐలోని ఉన్నత అధికార పీఠానికి నియమించడం నరేంద్ర మోడీ లోపాన్నే ఎత్తి చూపింది.

గుజరాత్‌లో కీలకమైన కేసుల్లో దర్యాప్తును తనకు అనుకూలంగా నడిపించినందుకు బహుమతిగా అస్థానాకు సిబిఐ పదవిని ప్రధాని బహూకరించారనే విమర్శ తలెత్తింది. అందుకే భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ మంగళవారం నాటి ప్రసంగంలో సిబిఐకి కూడా కాగ్ (కంప్ట్రోలర్ ఆడిటర్ జనరల్) కు కల్పించిన మాదిరిగా రాజ్యాంగబద్ధ హోదా కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాగ్ ఎదురులేని సంస్థే అయినప్పటికీ దాని నిర్ణయాలు ప్రభుత్వాల మనుగడపై ఎటువంటి ప్రభావం చూపలేకపోడం కళ్లముందున్న కఠోర సత్యమే. అయితే సిబిఐ ఎవరి అదుపాజ్ఞలకు, బెదిరింపులకు లొంగనవసరంలేని వ్యవస్థగా మార్పు చెందితే దర్యాప్తు క్రమంలో అది స్వతంత్రంగా, స్వేచ్ఛాయుతంగా నడుచుకో గల స్థితిని అందుకుంటుంది. కేసుల విచారణలో నిర్భయంగా నిర్ణయాలు తీసుకోగలుగుతుంది.

కేసు ప్రధానికి, మంత్రికి, ముఖ్యమంత్రికి అటువంటి ఇతర పెద్దలకు సంబంధించినదైనప్పటికీ దాని సక్రమ నడకకు అడ్డు తగలకుండా ఇతర కేసులలో మాదిరిగానే నిజాయితీతో దర్యాప్తు జరిపే అవకాశం దానికి కలుగుతుంది. అప్పుడు నేర పరిశోధనలో నిర్భీతికి కావలసినంత చోటు కలుగుతుంది. సుప్రీంకోర్టు అన్నట్టు చిలుక ఒక్కటే అయినా దాని యజమానులనేక మంది అనే దుస్థితికి తెర పడుతుంది. పెద్దలు చేసే నేరాలపై విచారణ ఏళ్లూ పూళ్లూ పట్టిపోకుండా సత్వర న్యాయం కలగడానికి ఆస్కారమేర్పడుతుంది. న్యాయం చుట్టూ అలముకున్న గాఢాంధకారం పటాపంచలవుతుంది.

CJI Ranjan Gogoi advocates more autonomy to CBI