Home జాతీయ వార్తలు సుప్రీం గౌరవం పెంచారు

సుప్రీం గౌరవం పెంచారు

CJI Ranjan Gogoi

 

జస్టిస్ గొగోయ్‌కు జడ్జిల ప్రశంసలు

గువహతి : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై పలువురు సీనియర్ జడ్జిలు ప్రశంసలు కురిపించారు. అత్యంత వివాదాస్పద అయోధ్య వ్యాజ్యంలో తుదితీర్పు వెలువరించడం అభినందనీయమని పేర్కొన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమానికి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు పలువురు పాల్గొన్నారు. పదవి బాధ్యతల నుంచి వైదొలుగుతున్న జస్టిస్ గొగోయ్, త్వరలోనే ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు తీసుకునే జస్టిస్ బోబ్డే కూడా రావడంతో ఈ సభ ప్రత్యేకతను సంతరించుకుంది.

జస్టిస్ గొగోయ్ వ్యక్తిత్వం ఆయన పట్టుదల ధైర్యం సమున్నతమైనందునే ఎటువంటి తప్పుడు రూలింగ్‌లకు అవకాశం ఏర్పడలేదని జస్టిస్ బోబ్డే పేర్కొన్నారు. అయోధ్య వివాదాస్పద స్థలిపై ఇటీవలే జస్టిస్ రంజన్ గొగోయ్ ఆధ్వర్యపు ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు వెలువరించింది. పదవీ బాధ్యతల నుంచి వైదొలుగుతున్న దశలో అత్యంత కీలక వ్యాజ్యంపై తీర్పు వెలువరించిన ప్రధాన న్యాయమూర్తిగా దేశ న్యాయ చరిత్రలో జస్టిస్ గొగోయ్ నిలిచారు. తాను జస్టిస్ గొగోయ్‌తో కలిసి పనిచేసిన గౌరవాన్ని దక్కించుకున్నానని, ఆయన విశిష్ట వ్యక్తిత్వం అందరికీ మార్గదర్శకం అని, ఎక్కడా తప్పటడుగు పడని మార్గం ఆయన హయాంలో రూపుదిద్దుకుందని నియుక్త ప్రధాన న్యాయమూర్తి తెలిపారు.

దేశంలోని న్యాయస్థానాలు: గతం నుంచి ఇప్పటివరకూ అనే పుస్తక అస్సామీ ప్రతి విడుదల కార్యక్రమం ఇక్కడ జరిగింది. దేశం ముందున్న కీలక సమస్యల పరిష్కార దిశలో జస్టిస్ గొగోయ్ నిర్ణయాత్మక తీర్పులు వెలువరించారని సీనియర్ న్యాయమూర్తి అరుణ్ మిశ్రా కొనియాడారు. రెండు నుంచి మూడు వారాల వ్యవధిలో జస్టిస్ గొగోయ్ వేయి పేజీల తీర్పును రూపొందించి అసాధ్యాన్ని సాధ్యం చేశారని తెలిపారు. అయోధ్య వ్యాజ్యం తన హయాంలోనే పరిష్కారం కావాలనే తపనతో కాకుండా, సుప్రీంకోర్టు అత్యంత క్లిష్టమైన అంశాలపై సవ్యమైన పరిష్కారాన్ని అందించగల్గుతుందని, ఈ సామర్థం, సాధన ఉందని సుప్రీంకోర్టు నిరూపించుకుందని , దీని వెనుక పాత్రధారి జస్టిస్ గొగోయ్ అని కొనియాడారు. ఈ నెల 17వ తేదీన జస్టిస్ గొగోయ్ పదవీ బాధ్యతల నుంచి వైదొలుగుతారు.

ఎటూ తేలకుండా ఉన్న వ్యవహారాలను సరైన రీతిలోకి తేవడం అంత సాధ్యమైన విషయమేమీ కాదని, దీనిని జస్టిస్ గొగోయ్ చేసి చూపించారని న్యాయమూర్తులు ప్రశంసించారు. ఇంగ్లీషులో వెలువడ్డ కోర్టు ఆఫ్ ఇండియా: పాస్ట్ టు ప్రజెంటు పుస్తకాన్ని దేశంలోని వివిధ భాషలలో అనువాదం అవుతోంది. ఇటీవలే దేశం ఒక చరిత్రను చూసిందని, ఇప్పటివరకూ చెలరేగిన వివాదాలు సద్దుమణిగాయని, సుప్రీంకోర్టు ముక్తకంఠంతో కీలక వ్యాజ్యంపై తీర్పు వెలువరించడం భారత న్యాయ చరిత్రలో చిరస్థాయిగా ఉంటుందని జస్టిస్ శ్రీపతి రవీంద్ర భట్ తెలిపారు. పుస్తకావిష్కరణ సందర్భంగా తనపై వ్యక్తం అయిన అభినందనలపై స్పందించిన జస్టిస్ గొగోయ్ తాను ఈ సభలో ఎటువంటి వ్యాఖ్యలకు దిగదల్చుకోలేదని, వివాదాస్పద అంశాలపై ప్రస్తావించడం సరైందికాదన్నారు.

CJI Ranjan Gogoi will pass Judgment in four major cases