Home జాతీయ వార్తలు ప్రతీకారంతో దక్కేది న్యాయం కాదు

ప్రతీకారంతో దక్కేది న్యాయం కాదు

CJI Bobde

 

తక్షణ న్యాయం అసాధ్యం
సామాజిక ఘటనలు బాధాకరం
సరైన విశ్లేషణతోనే సమగ్ర న్యాయం
ప్రధాన న్యాయమూర్తి బోబ్డే

జోధ్‌పూర్ : ఏ ఘటనలో అయినా తక్షణ న్యాయం అనేది అసాధ్యం అని, సమగ్ర విచారణతో వెలువడేదే న్యాయం అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్‌ఎ బోబ్డే స్పష్టం చేశారు. హైదరాబాద్ శివార్లలో పోలీసులు నలుగురు యువకులను ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో సిజెఐ శనివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రతీకార చర్యలతోనే న్యాయం సిద్థిస్తుందని అనుకుంటే అది న్యాయ లక్షణాన్ని కోల్పొతుందని బోబ్డే చెప్పారు. రాజస్థాన్ హైకోర్టుకు చెందిన నూతన భవనాన్ని ప్రారంభించేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. న్యా యం కీలక మౌలిక లక్షణాలను సంతరించుకుని ఉం టుంది. న్యాయం సిద్ధించే క్రమంలో దగ్గరిదారులు ఉంటాయని భావించడం లేదు.

సమగ్రంగా అన్ని అంశాలను పరిశీలించుకున్న తరువాతనే న్యాయం వెలువరించడం సరైన న్యాయం అన్పించుకుంటుందని అభిప్రాయపడ్డారు. త్వరితగతి న్యాయం కోసం చర్యకు దిగడం ప్రతీకార చర్య అవుతుందని పేర్కొన్నారు. అయితే ఇటీవలి కాలంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు, కొన్ని ఘటనలు నిజంగానే మునుపటి చర్చను మరోమారు రగిలిస్తున్నాయని అన్నారు. పలు చోట్ల మహిళలపై దాడు లు, అత్యాచారాలు, కాల్చిచపంపడాలు వంటి ఘటనలను ప్రధాన న్యాయమూర్తి పరోక్షంగా ప్రస్తావించారు. ఇటువంటి ఘటనలపై గతంలో తీవ్రస్థాయి చర్చలు ఆవేదనలు వ్యక్తం అయ్యాయి. ఇప్పటి ఘటనలతో తిరిగి చర్చకు ఆజ్యం పోసినట్లు అయిందని తెలిపారు. క్రిమినల్ జస్టిస్ సిస్టం పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందాల్సిందే, జరిగిన నేరాలకు శిక్షలు పడటం, తగు న్యాయం దక్కే వ్యవస్థ సమగ్రం కావాల్సి ఉంది. ఇం దులో ఎటువంటి సందేహం లేదన్నారు. కేసుకు సంబంధించిన పూర్వాపరాలను బట్టి తీర్పుల దశలో క్రిమినల్ జస్టిస్ వ్యవస్థపై పునరాలోచన జరగాల్సి ఉందన్నారు.

చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ప్రతీకారమే
న్యాయం కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవచ్చా? అనేది కీలక ప్రశ్న. న్యాయం న్యాయంగానే వెలువడాల్సి ఉంటుంది. పగ ప్రతీకారపు ఛాయలను సంతరించుకుంటే న్యాయం గతి తప్పుతుందని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. గత ఏడాది అసాధారణ రీతిలో నలుగురు న్యాయమూర్తులు పత్రికలతో మాట్లాడటం, వ్యవస్థపై ఆక్షేపణలకు దిగడంపై కూడా సిజెఐ మాట్లాడారు. జడ్జిల ఈ చర్య తమను తాము సరిదిద్దుకునే చర్య అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. సీనియరు న్యాయమూర్తులు అత్యున్నత న్యాయస్థానం పరిస్థితి బాగా లేదని చెప్పడం, పలు తక్కువ స్థాయి విషయాలు జరగడం మంచిది కాదని చెప్పడంపై ప్రధాన న్యాయమూర్తి స్పందించారు.

ఈ విధంగా వారు బహిరంగంగా మాట్లాడటం సమర్థనీయం కాదన్నారు. ఓ విధంగా చూస్తే ఇది స్వీయ దిద్దుబాటు చర్య అని తాను భావిస్తున్నట్లు తెలిపారు. గత ఏడాది జనవరి 12వ తేదీన సీనియర్ న్యాయమూర్తులు జె చలమేశ్వర్, రంజన్ గొగోయ్, ఎంబి లోకూర్, కురియన్ జోసెఫ్‌లు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం సుప్రీంకోర్టు చరిత్రలో అసాధారణ ఘట్టంగా మారింది. నిజానికి న్యాయవ్యవస్థ తనను తాను సరిదిద్దుకోవల్సి ఉంటుంది. అప్పటి విలేకరుల సమావేశంతో దిద్దుబాటుకు వీలేర్పడింది. అయితే ఇది వివాదాస్పద చర్యగా మారింది. దీనిని న్యాయమూర్తిగా తాను సమర్థించడం లేదన్నారు.

CJI sensational comments on Disha accused encounter