Home తాజా వార్తలు 14 తర్వాతనే పరీక్షల నిర్వహణపై స్పష్టత

14 తర్వాతనే పరీక్షల నిర్వహణపై స్పష్టత

Exams
పరిస్థితిని బట్టి నిర్ణయం

హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో దాదాపు అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏ పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారన్న అంశంపై ఈ నెల 14వ తేదీ తర్వాతనే స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. సాధారణంగా మార్చి నెలలో వివిధ వార్షిక పరీక్షలు, ఆ తర్వాత నెలలో ప్రవేశ పరీక్షలు జరుగుతుంటాయి. మార్చి నెలలోనే కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూడడంతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం మార్చి 31 వరకు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మార్చి 4 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాగా, ఆ సమయంలో కరోనా పాజిటివ్ కేసులు రాష్ట్రంలో అంతగా నమోదు కాకపోవడంతో ఇంటర్ ప్రధాన పరీక్షలు సజావుగా ముగిశాయి.

మార్చి 23న జరగాల్సిన ఇంటర్ పరీక్షలు జియోగ్రఫీ పేపర్-2, మోడర్న్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ పేపర్-2, మోడర్న్ లాంగ్వేజ్ ఉర్దూ పేపర్- 2, మోడర్న్ లాంగ్వేజ్ హిందీ పేపర్- 2 వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈ పరీక్షల తేదీలను తర్వాత ప్రకటిస్తామని పేర్కొంది. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంతో భాగంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న ఇంటర్మీడియేట్ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కూడావేస్తున్నట్లు ఇంటర్ బోర్డు వాయిదా వేసింది. అలాగే మార్చి 19 నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యే నాటికి కరోనా పాటిజివ్ కేసులు నమోదయ్యాయి. అయినా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.

టెన్త్ పరీక్షలు వాయిదా వేయాలంటూ హైకోర్టు ఆదేశించడంతో ఈ నెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది. ఆ తర్వాత కూడా మరోసారి టెన్త్ పరీక్షలకు వాయిదా వేసింది. ఈ నెల 14 తర్వాత పరిస్థితిని బట్టి పరీక్షల రీ షెడ్యూల్‌ను విద్యాశాఖ ప్రకటించే అవకాశం ఉంది. పదవ తరగతి పరీక్షల నూతన షెడ్యూల్ ఏదీ ప్రకటించలేదని,టెన్త్ పరీక్షల షెడ్యూల్ అంటూ వాట్సాప్‌లో వైరల్ అవుతున్న వార్తలు అవాస్తవమని ఎస్‌ఎస్‌సి స్పష్టం చేసింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అలాంటి వార్తలను నమ్మొద్దని సూచించింది.

ప్రవేశ పరీక్షలపై కూడా ప్రభావం

రాష్ట్రంలో వివిధ రకాల ప్రవేశ పరీక్షలపై కూడా కరోనా ప్రభావం పడింది. ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-(ఎన్‌ఐటి), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ(ఐఐటి)లతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్‌స్టిట్యూషన్స్(సిఎఫ్‌టిఐ)లలో ప్రవేశాల కోసం నిర్వహించే రెండవ విడత జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-(జెఇఇ మెయిన్) ఇప్పటికే మే చివరి వారంలో నిర్వహిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించగా, మే 17న జరగాల్సిన జెఇఇ అడ్వాన్స్‌డ్ ఇటీవల ఢిల్లీ ఐఐటి వాయిదా వేసింది.

షెడ్యూల ప్రకారం జెఇఇ మెయిన్ పరీక్షలు ఏప్రిల్ 5,7,8,9,11 తేదీలలో నిర్వహించాల్సి ఉండగా, పరీక్షల తేదీల రీ షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. అలాగే రా్రష్ట్ర ఎంసెట్, ఇసెట్, లాసెట్, పిఇసెట్, పిజిఎల్‌సెట్ తదితర ప్రవేశ పరీక్షలు మే నెలలో జరుగనున్నాయి. ప్రస్తుతం ఈ పరీక్షల దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ప్రవేశ పరీక్షలు కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితిని బట్టి ప్రవేశ పరీక్షల నిర్వహణపై ఆయా సెట్ల కన్వీనర్లు నిర్ణయం తీసుకోనున్నారు.

Clarification on Exams After April 14 in Telangana