Friday, January 27, 2023

జాతీయ విధానం కావాలి

- Advertisement -

Clarification should be given on grain purchase:TRS MPs

ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాలి : పార్లమెంటు ఉభయసభల్లో గళమెత్తిన టిఆర్‌ఎస్ ఎంపిలు

జాతీయ ఆహార విధానంపై చర్చ
చేపట్టాలంటూ రెండు సభల్లోనూ
వాయిదా తీర్మానాలు
తిరస్కరించడంతో గురికావడంతో
నిరసన తెలిపిన ఎంపిలు
పలుమార్లు సభలు వాయిదా
వరి సాగు పెంచడం తప్పా? :
కేంద్రాన్ని నిలదీసిన కెకె
సెంట్రల్ హాల్‌లో గాంధీ విగ్రహం
వద్ద ప్లకార్డులతో ఆందోళన

మన తెలంగాణ/హైదరాబాద్ : మొదటి రోజు పార్లమెంట్ సమావేశంలోనే టిఆర్‌ఎస్ ఎంపిలు తమ నిరసన గళాన్ని పెద్దఎత్తున వినిపించారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వెంటనే ఒక జాతీయ స్థాయి విధానాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పలుమార్లు సభకు అంతరాయం కలిగించారు. సమావేశాల్లో భాగంగా సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్ర విభజన అంశాలపై కేంద్రాన్ని నిలదీయాలని పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కెసిఆర్ రెండు రోజుల క్రితం జరిగిన పార్టీ పార్లమెంటరీ సమావేశంలో ఎంపిలకు స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. ఆయన జారీ చేసిన సూచనలు, సలహాలు, ఆదేశాల మేరకు తొలిరోజునే టిఆర్‌ఎస్ ఎంపిలు తమ ప్రతాపాన్ని ప్రదర్శించారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాల కారణంగా తెలంగాణలో రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా సభలోనే వారు ఆందోళనకు దిగారు.

ఈ అంశంపై చర్చించేందుకు ఉభయసభల్లోనూ ముందుగా స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి రైతు సమస్యలపై చర్చించాలని వాయిదా తీర్మానం ఇచ్చారు. ధాన్యం కొనుగోలు అంశంపై తెలంగాణలో చాలా దారుణమైన పరిస్థితి నెలకొని ఉందని పేర్కొంటూ రూల్ 267 కింద తక్షణమే ధాన్యం కొనుగోలు అంశంపై చర్చించాలని రాజ్యసభ ఛైర్మన్‌కు ఎంపి కేశవరావు నోటీసు ఇవ్వగా, జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధాంపై చర్చకు అనుమతి ఇవ్వాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వాయిదా తీర్మానం నోటీసును ఎంపి నామా నాగేశ్వరరావు ఇచ్చారు.

అయితే ఉభయసభల్లోనూ ఎంపిలు ఇచ్చిన వాయిదా తీర్మానాలు తిరస్కరణకు గురయ్యాయి. ఇందుకు నిరసనగా ఉభయ సభల్లో పార్టీ ఎంపిలు ఆందోళనకు దిగారు. దీంతో పలుమార్లు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అనంతరం టిఆర్‌ఎస్ ఎంపిలు సెంట్రల్ హాల్లో ప్లకార్డులు ప్రదర్శించారు. పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా రాజ్యసభలో పార్టీ నేత కె. కేశవరావు మాట్లాడుతూ, ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత దుర్భరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయన్నారు.

ఈ విషయాన్ని పలుమార్లు కేంద్రం దృష్టికి తీసుకొచ్చినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని విమర్శించారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటా వారిని ఆగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రెండు పంటలు పండుతున్నా కూడా ప్రస్తుతం దుర్భర పరిస్థితి నెలకొందన్నారు. రబీ వరిని బాయిల్డ్ రైస్‌గా చేసి కేంద్రానికి ఇస్తున్నామన్నారు. ఏ పంటలు వేయాలో అధ్యయనం చేస్తూ పంట సామర్థ్యం పెంచినట్లు పేర్కొన్నారు. రైతులు 62 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి ఎంత ధాన్యం సేకరిస్తారో కేంద్రం స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే పంటల సేకరణలో కేంద్రం జాతీయ విధానం తీసుకురావాలని కేశవరావు డిమాండ్ చేశారు.

గతంలో కేంద్ర ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొంటామని చెప్పిందని కేశవరావు అన్నారు. ఇప్పటికైనా కేంద్రం స్పష్టత ఇస్తే పంట మార్పిడిపై రైతులకు వివరిస్తామని తెలిపారు. సమయం ఇస్తే పంట మార్పిడి వైపు రైతులు మరలుతారన్నారు. బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు వెల్లడించారు. వరి పంట ఉత్పత్తి పెంచడమే సిఎం కెసిఆర్ చేసిన తప్పా అని కేంద్రాన్ని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపకూడదన్నారు. రాష్ట్రానికి సంబంధించి నాలుగు డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని ఆయన కోరారు. పార్లమెంట్లో గందరగోళం సృష్టించే ఉద్దేశం తమకు లేదని కేశవరావు స్పష్టం చేశారు.

అనంతరం లోక్‌సభలో పార్టీ నేత నామ నాగేశ్వర రావు మాట్లాడుతూ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో సిఎం కెసిఆర్ ముందు చూపు వల్ల రైతులకు సమృద్ధిగా సాగునీరు, ఎరువులు, విత్తనాలు, రైతు బంధు వంటి పథకాలతోపాటు 24 గంటల నాణ్యమైన ఉచిత కరెంటు అందటం వల్ల దిగుబడులు పెరిగాయన్నారు. ఆ మేరకు ఎఫ్‌సిఐ కొనుగోళ్లను పెంచాల్సి ఉందన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవడమే కాదు, రైతు సంక్షేమం కోసం అవసరమైన విధానాలను చేపట్టాలన్నారు. దేశానికి ఆదర్శవంతమైన రైతుకు ప్రయోజనం చేకూర్చే అనేక పథకాలు అమలు అవుతున్నాయన్నారు. అలాగే దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం విధి, విధానాలను రూపొందించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు రైతుల కోసం తమ ఆందోళన, ఉద్యమం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్య సభ సభ్యులు సురేష్ రెడ్డి, బండా ప్రకాశ్, జోగినపల్లి సంతోష్ కుమార్, గడ్డం రంజిత్ రెడ్డి, బిబి పాటిల్, మన్నే శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles