Home రంగారెడ్డి బహదూర్‌గూడలో కాల్పుల కలకలం

బహదూర్‌గూడలో కాల్పుల కలకలం

Clash between the two sides in the land dispute

శంషాబాద్ రూరల్ : బహదూర్‌గూడ గ్రామంలోని వివాదాస్పద భూముల వ్యవహారంలో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి గాలిలోకి కాల్పులు జరిపిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. శంషాబాద్ మండల శివార్లలో ఉన్న బహదూర్‌గూడ గ్రామంలోని ఆరు వందల యాభై ఎకరాల విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా వివాదం కొనసాగుతున్నది. ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారి మంగళవారం కాల్పులకు దారి తీసింది. ప్రత్యర్ధి వర్గాన్ని బెదిరించి భయ బ్రాంతులకు గురి చేయడానికి గాలిలోకి కాల్పులు జరపడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగినప్పటికి బుధవారం తెల్లవారు జామున పోలీసులకు ఫిర్యాదు అందడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో రంగంలోకి దిగిన శంషాబాద్ రూరల్ పోలీసులు సెక్షన్ 307 ఆయుధాల చట్టంలోని సెక్షన్ 27 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు రూరల్ ఇన్‌స్పెక్టర్ కృష్ణప్రసాద్ తెలిపారు.

ఆది నుండి వివాదాలే
బహదూర్‌గూడ భూముల వ్యవహారం మొదటి నుంచి వివాదస్పదంగానే ఉన్నది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఈ సంఘటన పూర్వపరాలు ఈ విధంగా ఉన్నాయి… దండమూడి బయోటెక్ సంస్థ వారు రైతుల వద్ద 110 ఎకరాల భూమిని ఖరీదు చేశారు. ఈ భూమికి సంబంధించి రైతుల వద్ద ఎలాంటి రెవెన్యూ రికార్డులు లేనప్పటికి సాగు చేస్తున్న వారి వద్ద నుంచి ఈ సంస్థ యజమాని దండమూడి అవనీంద్ర కుమార్ కొనుగోలు చేశారు. ఆ భూమికి కాపలాకాయడం కోసం నగరానికి చెందిన అల్తాఫ్ అనే వ్యక్తిని నియమించారు. అల్తాఫ్‌తో పాటు మహేందర్, మల్లేష్ అనే వ్యక్తులు సైట్ వద్ద ఉంటున్నారు. ఇదిలా ఉండగా మధుసూదన్‌రెడ్డితో పాటు మరి కొందరు అదే గ్రామంలోని అయిదు వందల ఎకరాల భూమిని ఖరీదు చేశారు. పైగా వంశస్థులకు చెందిన భూములు అని కోర్టు అనుమతితో తాము ఖరీదు చేసినట్టు మధుసూదన్‌రెడ్డి వర్గం పేర్కొంటున్నది. దండమూడి అవనీంద్రకుమార్ తన భూమిని డ్రిమ్ ఇండియా ఇన్‌ఫ్రా కంపనీకి చెందిన రఫీక్, రజాక్ అనే వారికి విక్రయించాడు. వారు ఆ భూమిని ప్లాట్లుగా మారుస్తున్నారు. ఈ నేపథ్యంలో అవనీంద్రకుమార్ కొడుకు హరిష్ ఈ భూములను తాము విక్రయించడం లేదని అనవసరంగా తమ భూమిలోకి వచ్చి వివాదం సృష్టిస్తున్నాడని శంషాబాద్ రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ఎనిమిది నెలల క్రితం ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు. మరో వైపు రజాక్, రఫీక్‌లు కూడా హరిష్‌పై ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదు అయింది. కాగా అసలు ఈ భూమి ఎవరికి చెందుతుంది ఇది ప్రైవేట్ స్థలమా..? లేక ప్రభుత్వ స్థలమా..? తెలియజేయాలని కోరుతూ రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. దీనిపై స్పష్టత రాకముందే జూలై 31 వ తేదీ మధ్యాహ్నం రఫీక్ తనతో పాటు మరికొందరిని తీసుకుని వచ్చి పొలం చూపిస్తుండగా ఆ భూమి వద్ద కాపలాదారుగా ఉన్న అల్తాఫ్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. దీంతో ఇరు వర్గాల మధ్య మాట మాట పెరిగి ఘర్షణకు దారి తీసింది. దీంతో ప్రతర్థులను భయ బ్రాంతులకు గురి చేయడానికి రఫీక్ తన వద్ద ఉన్న రివాల్వర్‌తో గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపాడు. దీంతో అక్కడ ఉన్న వారందరూ చెల్లచెదురై పారిపోయారు. గొడవ జరిగిన ప్రదేశం జనవాసాలకు దూరంగా ఉండటంతో విషయం బయటకి తెలియలేదు. ఈ సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరుగగా అల్తాప్ అర్ధరాత్రి 1 గంటకు ఫిర్యాదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఎది ఎమైనా ఈ సంఘటన నగర శివార్లలో రోజు రోజుకు గన్‌కల్చర్ పెరిగి పోతుండటం పట్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.