Home ఎడిటోరియల్ గంగ ప్రక్షాళన ఓ కల

గంగ ప్రక్షాళన ఓ కల

Cleaning of Ganga River

గంగానదిని తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ‘భారతీయుల ఆత్మ’గా అభివర్ణించారు. ప్రముఖ షహనాయి విద్వాంసుడు బిస్మిల్లా ఖాన్‌ను ఒక అమెరికన్ విశ్వవిద్యాలయం రెసిడెన్షియల్ మ్యూజిషియన్‌గా రావాలని కోరినప్పుడు ఆయన తనతో పాటు గంగానదిని కూడా తీసుకువచ్చే అవకాశం ఉందా అని ప్రశ్నించారట. గంగానదిని సజీవమైనదిగా కోర్టు ప్రకటించింది. కాని నేడు తమ స్వార్ధంతో చాలా మంది ఈ భారత ఆత్మ గొంతు నులుముతున్నారు. గంగానది ప్రక్షాళన కోసం 111 రోజులక్రితం నిరాహారదీక్షకు ఉపక్రమించిన స్వామి జ్ఞాన్ స్వరూప్ సనంద్ హృషీకేశ్‌లో కన్నుమూశారు. గంగానది కోసం తన ప్రాణాన్ని తర్పణ చేసినవారిలో జ్ఞాన్ స్వరూప్ మొదటివారు కాదు. బహుశా చివరి వారు కూడా కాకపోవచ్చు.

ఏడేళ్లక్రితం స్వామి నిగమానంద సరస్వతి నాలుగు నెలలపాటు కఠోర నిరశన వ్రతం కొనసాగించి ఇదే రీతిన తనువు చాలించారు. గంగానది ప్రక్షాళన కోసం జూన్ 22 నుంచి జి.డి.అగర్వాల్ నిరాహారదీక్ష చేస్తున్నారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. గంగోత్రి, ఉత్తరకాశీ, ఉత్తరాఖండ్ వరకు గంగానది ప్రవాహం అడ్డంకులు లేకుండా అవిరళంగా ప్రవహించాలని ఆయన కోరారు. “అవిరళ్ గంగా” నినాదంతోనే ఆయన పోరాటం కొనసాగింది. తేనె కలిపిన నీరు తప్ప మరేమీ తీసుకోలేదు. గంగానది ప్రక్షాళనకు సంబంధించిన చర్చలు విఫలమవడంతో మరణించడానికి రెండు రోజుల ముందు నీరు కూడా ముట్టడం మానేశారని తెలిసింది. 1932లో జన్మించిన అగర్వాల్ ఐఐటి రూర్కీలో ఇంజనీరింగ్ చేశారు. 1980లో సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీగా చేశారు. యూనివర్శిటీ ఆఫ్ రూర్కీ విజిటింగ్ ప్రొఫెసర్. యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పర్యావరణ ఇంజనీరింగ్ లో పరిశోధన చేశారు. 2011లో సన్యాస దీక్ష స్వీకరించి స్వామీ జ్ఞాన స్వరూప్ సనంద్ గా మారారు. అనేక శాస్త్రీయ గ్రంథాల రచయిత. సన్యాసిగా మారిన ఈ శాస్త్రవేత్త గంగానది ప్రక్షాళన కోసం జీవితం అంకితం చేశారు.

గంగోత్రి ఉత్తరకాశీల మధ్య భాగీరథి నది అడ్డంకుల్లేకుండా ప్రవహించాలని కోరుతూ 2008లో 30 రోజుల పాటు ఆయన నిరాహారదీక్ష చేశారు. ఈ నిరాహారదీక్ష తర్వాత అప్పటి ఉత్తరాఖండ్ ప్రభుత్వం దిగి వచ్చింది. భైరాన్ ఘాటీ 380 మెగావాట్ల హైడల్ ప్రాజెక్టు, పాలమనేరి480 మెగావాట్ల ప్రాజెక్టు పనులను నిలిపేసింది. భాగీరథి ప్రవాహం విషయంలో, ప్రక్షాళన విషయంలో ప్రభుత్వం రాతపూర్వక హామీ కూడా ఇచ్చింది. కాని ఇచ్చిన హామీని ప్రభుత్వం తుంగల్లో తొక్కిందని మళ్ళీ 2009లో 20 రోజుల పాటు నిరాహారదీక్ష చేశారు. కేంద్రంలోని యుపియే ప్రభుత్వం దిగి వచ్చింది. లోహరింగ పాల ప్రాజెక్టు పనులన్నీ ఆపేస్తామని రాతపూర్వకమైన హామీ ఇచ్చింది.

జూన్ 2013లో కూడా ఒకసారి జి.డి.అగర్వాల్ నిరాహారదీక్ష చేశారు. జాతీయ గంగా లోయ సంస్థ పనేమీ చేయకుండా కాలక్షేపం చేస్తున్నప్పుడు సెప్టెంబర్ 21 నుంచి 101 రోజుల వరకు నిరాహారదీక్ష చేశారు. గంగా బేసిన్ అధారిటీ కూడా ఆయన పోరాటం వల్ల ఏర్పడిందే. అప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆ సంస్థ సభ్యులు రాజేంద్ర సింగ్, రవి చోప్రా, రాషిద్ సిద్దీకీలు రాజీనామా చేశారు. ఒక విద్యావేత్త జీవనదిని కాపాడమని పదేళ్లుగా పోరుతూ చివరకు ప్రాణత్యాగం చేయడం కన్నా విషాదం ఏముంటుంది. మీడియా కూడా ఆయన దీక్షనూ, దాని ప్రాముఖ్యతనూ సరిగా గుర్తించలేదు. స్వామి నిగమానంద దీక్ష సమయంలో కూడా ఇదే నిర్లక్ష్యం. ఆయన కూడా ప్రాణత్యాగం చేశారు.

గంగానది ఒడ్డున హరిద్వార్ లో ఉన్న మాత్రి సదన్ సాధారణ ఆశ్రమం కాదు. ఆ ఆశ్రమానికి చెందిన స్వామీ జ్ఞాన స్వరూప్ సనంద్ సాధారణ సాధువు కూడా కాదు. పేరుప్రఖ్యాతులున్న ఆశ్రమం, ప్రసిద్ధ సాధువు. ఇంతకు ముందు ఈ ఆశ్రమానికి చెందిన ప్రధాన సాధువు స్వామీ శివానంద్ కూడా గంగానది పరిరక్షణ కోసం నిరాహార దీక్ష చేశారు. ఆ తర్వాత ఆయన శిష్యులు నిగమానంద్, దయానంద్, యజ్ఞానంద్, పూర్ణానంద్ లు కూడా సుదీర్ఘ నిరాహారదీక్షలు చేశారు. హరిద్వార్ లో గంగానది చుట్టూ అక్రమ మైనింగ్ కార్యకలాపాలను నిరోధించాలని వీరంతా పోరాడుతున్నారు. ఇందులో నిగమానంద్ చేసిన నిరాహారదీక్ష కూడా స్వామీ జ్ఞానస్వరూప్ సనంద్ మాదిరిగా అక్షరాలా ఆమరణ నిరాహారదీక్ష. 2011లో నిగమానంద్ 115 రోజుల నిరాహారదీక్ష చేసి తుదిశ్వాస విడిచారు.

ఆగష్టు 20వ తేదీన ఉత్తరాఖండ్ హైకోర్టు ఒక తీర్పులో పరిశుద్ధం చేయకుండా మురికినీటిని గంగానదిలో వదలరాదని ప్రభుత్వాన్ని ఆదేశించింది. హరిద్వార్ లో మురికినీటి శుద్ధీకరణ ప్లాంటు ఉంది. దాని సామర్థ్యం రోజుకు 4 కోట్ల 50 లక్షల లీటర్లు. దీనికి రెట్టింపు శుద్ధిచేయని మురికినీరు గంగానదిలో వదలడం రోజూ జరుగుతోంది. కాలుష్యనియంత్రణ మండలి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునళ్ళు ఏం చేస్తున్నాయని స్వామీ సనంద్ నిలదీసేవారు. వారణాసిలోని అస్సీ డ్రయిన్ రోజుకు 35 మిలియన్ లీటర్ల డ్రయినేజీని గంగానది ఎగువ ప్రాంతాన రమణలో ఉన్న మురికినీటి శుద్ధీకరణ ప్లాంటుకు పంప్ చేస్తున్నారు. నది ఎగువప్రాంతానికి మురికినీరు పంపింగ్ చేయడమేమిటని స్వామి ప్రశ్నించారు. సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంటులను నడిపే నిజాయితి, సామర్థ్యం కూడా నేడు కనబడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గంగానది చరిత్రే భారతదేశ నాగరికత, సంస్కృతి చరిత్ర’ -అని తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ అన్నారు. గంగానదిలో మునిగితే చాలు పాపాలన్నీ పోతాయనేది భక్తుల నమ్మకం. ఆ అపరిశుభ్రత వల్ల ఎలాంటి వ్యాధులు, రోగాలు ప్రబలుతాయోనని నేడు భయపడుతున్నారు. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రదేశాలు గంగానదికి ఇరువైపులా ఉన్నందున, చుట్టుప్రక్కల కాలుష్యాన్ని విడుదలచేసే అనేక పరిశ్రమలు ఉండడం వలన, గంగానదీ జలాలు తీవ్రమైన కాలుష్యానికి గురవుతున్నాయి. కాన్పూరు వంటి నగరాలలోని రసాయనిక పరిశ్రమలు, తోలు పరిశ్రమలు, ఒక ముఖ్య కారణం. ప్రజల గృహాలనుండి వెలువడే మురుగునీరు రోజూ 100 కోట్ల లీటర్లు గంగలో కలుస్తుందని అంచనా.

గంగా నది ప్రక్షాళనకు మొత్తం 20 వేల కోట్ల రూపాయలు కేటాయించగా, వాటిని 2020 అంటే, మరో రెండేళ్లలో ఖర్చు పెట్టాల్సి ఉంది. మురుగు కాల్వల ప్రక్షాళన, పారిశ్రామిక వ్యర్థాల ట్రీట్‌మెంట్, గంగా నది ఉపరితలం క్లీనింగ్ కోసం నమామి గంగా పథకంలో భాగంగా కేంద్రం 221 ప్రాజెక్టులను ప్రకటించింది. వాటికి 2,238.73 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. 221 ప్రాజెక్టుల్లో ఇప్పటి వరకు 58 ప్రాజెక్టులు మాత్రమే పూర్తయ్యాయి. మొత్తం ప్రాజెక్టుల్లో 26 శాతం మాత్రమే పూర్తయినట్లు ప్రభుత్వమే అంగీకరించింది. 105 సీవరేజ్, ఎస్‌టీపీ ప్రాజెక్టులు ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. కేంద్రప్రభుత్వం, పౌరసమాజం, ఐఐటి కన్సార్టియం ఎవరు పట్టించుకోవడం లేదంటూ అగర్వాల్ వాపోయారు. అందుకే తన ప్రాణాలను కూడా పణంగా పెట్టి నిరాహారదీక్ష చేశారు. గంగమ్మ కోసం పోరాడిన గంగపుత్రుడి ఆత్మ భౌతికకాయాన్ని వదిలి గంగాప్రవాహంలో ఐక్యమైంది.