Home తాజా వార్తలు పరిశుభ్రతే అసలైన వ్యాక్సిన్

పరిశుభ్రతే అసలైన వ్యాక్సిన్

Corona

 

కరోనాకు ముందు జాగ్రత్తే మందు
మూడో దశకు వెళ్లకుముందే కఠిన చర్యలు తీసుకోవాలి, దశల వారీగా..జోన్ల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేయాలి
వైరస్‌పై అవగాహన లేకే ఆ 11 మంది చనిపోయారు, యువకులకూ డేంజరే విచ్చలవిడిగా తిరగొద్దు : మన తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూలో యశోద ఆసుపత్రి సీనియర్ వైద్యులు ఎం.వి. రావు

మన తెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి వ్యక్తిగత, సమాజ, పరిసరాల పరిశుభ్రతే అసలు సిసలైన వ్యాక్సిన్ అని యశోదా ఆసుపత్రి సీనియర్ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ ఎం.వి రావు అభిప్రాయపడ్డారు. కొవిడ్ 19కి మందులు, వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడకుండా ముందు జాగ్రత్తలతోనే వ్యాధిని జయించవచ్చునన్నారు. ఈ వైరస్ సోకితే మరణమే శరణ్యమని భావించడం సరికాదని, ప్రజలు భయపడేంత తీవ్రమైంది కాదన్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా అందుతున్న మరణాల సమాచారమే ఆధారంగా పేర్కొన్నారు. మొత్తం ప్రజలంతా కరోనా అంటే ఇక మరణమే అనే వైరాగ్యం అక్కర్లేదని అన్నారు. కరోనా రెండోదశ దాటి మూడోదశకు ప్రవేశించకుండా కఠిన చర్యలు తీసుకోక తప్పదని, ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు తీసుకున్న లాక్‌డౌన్, కర్ఫూతో పాటు మరిన్ని కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

అయితే రాష్ట్రంలో మూడోదశ ప్రారంభమైనట్లు ఇప్పుడే చెప్పలేమని, కానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఏప్రిల్ 14 తరువాత లాక్‌డౌన్ ఎత్తివేస్తే, ఆ తరువాత చోటుచేసుకునే పరిణామాలు అత్యంత కీలకంగా మారుతాయని వ్యాఖ్యానించారు. యశోదా ఆసుపత్రి సీనియర్ ఫిజిషియన్ ఎం.వి రావు మన తెలంగాణ ప్రత్యేక ఇంటర్వూలో కరోనా వైరస్ కట్టడి, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మాట్లాడారు.

లాక్‌డౌన్ ఎత్తేయడం ఛాలెంజింగ్ టాస్క్
లాక్‌డౌన్ ఒక్కసారి ఎత్తివేస్తే కరోనా ముప్పు ఊహించడం కష్టం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రపంచంలోనేఅత్యంత, సమర్థ చర్యలు తీసుకున్నాయి. ఇప్పుడు లాక్‌డౌన్ ఎత్తివేయడం ఒక ఛాలెంజింగ్ టాస్క్. ఒకవేళ ఎత్తివేయాలనుకుంటే అది దశలవారీగా, జోన్‌ల వారీగా చేపట్టాలనేది నా సూచన. రద్దీ ప్రదేశాలలో నియంత్రణలు కొనసాగాలి. ముఖ్యంగా జనం రద్దీ అత్యధికంగా ఉండే మాల్స్, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల దగ్గర సమూహాలపై నియంత్రణలు పకడ్బందీగా ఉంటేనే కరోనా వ్యాప్తిని నివారించగలుగుతాం. ఉదాహరణకు జనసాంద్రత అత్యధికంగా ఉండే హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌ను జోన్‌ల వారీగా కొన్ని గంటల పాటు దశలవారీగా ఎత్తివేస్తే సమూహాల వ్యాప్తిని నివారించవచ్చు. అలా కాకుండా గుండుగుత్తగా ఎత్తివేస్తే పరిస్థితిని ఊహించలేం.

చనిపోయిన 11 మందిలో అవగాహనలోపం
కరోనాతో తెలంగాణలో 11 మంది మృతి చెందడం విషాదరకం. అయితే దీనికి బాధితులంతా వ్యాధి ముదిరిన తరువాతనే ఆసుపత్రుల్లో చేరడం ఒక కారణం కాగా మరొకటి ఈ వైరస్ గురించి కానీ, కనీస లక్షణాలపై వారికి అవగాహన లేకపోవడమే. జ్వరం, దగ్గు, గొంతు నొప్పి సాధారణమే కదా అని వారు తెలియక వ్యాధిని నిర్లక్షం చేసి ఉండవచ్చు. వ్యాధి ముదిరిన తరువాత ఆసుపత్రులకు రావడంతో వారు మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వచ్చింది.
మృతి చెందిన వాళ్లలో ఎక్కువ భాగం గ్రామీణ ప్రాంతాల వారు ఉన్నారు.

పాజిటివ్ వస్తే మరణమే కాదు
కరోనా పాజిటివ్ వస్తే మరణమే శరణ్యం కాదని, తొలిదశలో డాక్టర్లను సంప్రదిస్తే మరణాలను నివారించవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ భారీన పడి చనిపోతున్న వారి శాతం 3.34 శాతంగ కొనసాగుతుంది. ఒకవేళ రాష్ట్రానికి మర్కజ్ బాధితులు రాకపోయి ఉంటే తెలంగాణలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెప్పినట్లు ఏప్రిల్ 7 నాటికి తెలంగాణలో పరిస్థితులు ఆదుపులోకి వచ్చేవి. అమెరికా, స్పెయిన్, ఇటలీ లాంటి దారుణ పరిస్థితులు తెలంగాణలో ఏర్పడకుండా ఉండటానికి సిఎం కెసిఆర్ ముందుచూపే కారణమని చెప్పవచ్చు.

వేగవంతమైన పరీక్షలతోనే బాధితుల సంఖ్యపై స్పష్టత
కరోనా వైరస్ భారీన పడిన వారి అసలు సంఖ్య తేలాలంటే వేగవంతమైన పరీక్షలు జరగాలి. దీనికి ర్యాపిడ్ యాంటి బాడీస్ టెస్టులు జరగాలి. అమెరికాలో అబొట్ అనే సంస్థ ఈ పరీక్షలు నిర్వహిస్తున్నది. ఇది రక్తంతో తీసుకుని చేసే పరీక్ష. చివరకు నర్సులే కాకుండా, బాధితులు కూడా రక్తం తీసుకుని కొన్ని నిమిషాల్లోనే పాజిటివ్ ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇది చౌక, త్వరగా, నమ్మకంగా జరిగే పరీక్ష. ఐసిఎంఆర్ కూడా ఈ పరీక్షలనే సిఫార్సు చేస్తున్నది. కానీ ఇప్పుడు దేశంలో, రాష్ట్రంలో ఆ స్థాయిలో కిట్స్ ఇంకా అందుబాటులోకి రాలేదు. కరోనా నివారణకు విటమిన్ సి,డి, బి కాంప్లెక్స్, జింక్ లాంటి మందులు వాడితే పూర్తి రక్షణ అనుకోవడం భ్రమే. అవి కొంత మేరకు వ్యాధిని రాకుండా ఆపగలుగుతాయే తప్ప నివారించలేం.

మందులు వైద్యుల పర్యవేక్షణలోనే వాడాలి
హైడ్రోక్లోరోక్విన్, అజిత్రాలు లాంటి ట్యాబ్లెట్స్ వైద్యుల సలహా లేకుండా వాడరాదు. అనుభవజ్ఞులైన డాక్టర్లు సిఫార్సు చేస్తే తప్ప మందులు నివారణ కోసమని వాడితే దుష్పరిణామాల బారిన పడే ప్రమాదం ఉంది. కరోనాకి కేంద్ర బిందువైన చైనాలోని వూహాన్‌లో సెకంట్ వేవ్ వ్యాధి ప్రారంభమైంది. ఒక్కసారి కరోనా ఆగితే మళ్లీ రాదనే గ్యారంటీ లేదని వూహాన్ రుజువు చేసింది. వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక దూరం, వస్తువులను తాకకపోవడం, స్వీయ నియంత్రణ చర్యలే శరణ్యం. యువకులు ఈ వ్యాధి తమకు రాదనుకోవడం కూడా భ్రమనే. వారు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లాక్‌డౌన్, కర్ఫూ సడలింపు సమయంలో విచ్చలవిడిగా తిరగొద్దు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలకు సంపూర్ణంగా సహకరించాలి.

ప్రభుత్వాల కన్నా పౌరుల బాధ్యతే ఎక్కువ
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మూడోదశలోకి రాకుండా ఉండాలంటే ప్రభుత్వాల కన్నా పౌరుల బాధ్యతే ఎక్కువ. దేశంలో ప్రజలంతా ఇండ్లలో ఇంకో రెండు వారాల పాటు స్వీయ నిర్భంధంలో ఉంటే ఈ ఉపద్రవాన్ని అధిగమించి ప్రపంచానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచే అవకాశం ఉంది. కరోనాను ముందుగానే గుర్తించి దేశంలో 15 లక్షల మందిని విమానాశ్రాయాల్లో స్క్రీనింగ్ చేయడం వల్ల పరిస్థితి చేయిదాటకుండా ఉందని అంతా గమనించాలి. తెలంగాణలో కూడా ప్రభుత్వం విమానాలు అన్నీ నిలిపివేసే సమయానికి 22 వేల మందిని క్వారంటైన్ చేసి, వైరస్ తీవ్రత ప్రకారం చర్యలు తీసుకోవడం వల్ల పాజిటివ్‌లు, మరణాలు కనిష్టంగా తగ్గించగలిగాం.

 

Cleanliness can curb the Corona