Home ఆంధ్రప్రదేశ్ వార్తలు 18 రోజులు… 18 గంటలు

18 రోజులు… 18 గంటలు

AP CM Chandrababu Naidu

 

అమరావతి: ఎన్నికల మిషన్- 2019 పై టిడిపి చీఫ్ చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆ పార్టీ నాయకులతో మాట్లాడారు.  ఎన్నికలకు ఇంకా 18 రోజులే వ్యవధి ఉందని,  ఈ రెండు వారాల్లో ప్రచారం ఉధృతం చేయాలని చంద్రబాబు టిడిపి శ్రేణులకు సూచించారు. రైతులు, మహిళలంతా టిడిపికి మద్దతుగా ఉన్నారని తెలిపారు. యువతరాన్ని ప్రోత్సహించి వారి మద్దతును కూడా పొందాలన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు రోజుకు 18 గంటలు పని చేయాలని కోరారు. ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరినీ కలిసి అన్ని వర్గాల మద్దతు పొందాలని ఆయన పేర్కొన్నారు. ఏమైనా అపోహలు ఉంటే తొలగించి టిడిపికి మద్దతు కూడగట్టాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

రైతులకు రుణమాఫీ అసాధ్యమని అప్పట్లో చెప్పిన జగన్  ఇప్పుడేమో రైతులపై మొసలి కన్నీరు కరుస్తున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు.  జగన్ నిర్వాకంతో లక్ష ఎకరాల భూమి నిరుపయోగంగా మారిందని ఆయన ఆరోపించారు. వాన్ పిక్ 28,000 ఎకరాలు, లేపాక్షి 8,808 ఎకరాలు ,బ్రాహ్మణి స్టీల్స్ 10,000 ఎకరాలు, జగన్ కేసుల్లో చిక్కుకుని ప్రజోపయోగం లేకుండా పోయిందని ఆయన అన్నారు. సమాజానికి జగన్ పెను ప్రమాదంగా మారారని, పులివెందుల హత్యపై డ్రామాలు ఆడారని, విశాఖలో కోడికత్తి ఘటన జగన్ ఆడిన ఇంకో డ్రామా అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. టిడిపి డేటా చోరికి భారీ కుట్ర చేశారని పేర్కొన్నారు. ఫారం- 7 ద్వారా 9 లక్షల ఓట్ల తొలగింపు  కుట్ర  జరిగిందని, జగన్ కుట్రలకు, డ్రామాలకు అంతు లేకుండా పోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆంధ్రా పోలీసులు, వైద్యులపై తనకు  నమ్మకం లేదని జగన్ చెప్పడం వ్యవస్థలను అపహాస్యం చేయడమేనని  చంద్రబాబు మండిపడ్డారు. ఎపి వ్యవస్థలను నమ్మని జగన్ ఓట్లు మాత్రం కావాలని వస్తున్నాడని, జగన్ కు తగిన బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలను కోరారు.

CM Chandrababu Naidu Teleconference With TDP Leaders