*వారం రోజుల పర్యటన తరువాత తిరిగి వచ్చిన కెసిఆర్
మన తెలంగాణ / హైదరాబాద్ : వారం రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం రాత్రి నగరానికి చేరుకున్న సిఎం కెసిఆర్ విమానాశ్రయం నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌తో సమావేశమయ్యారు. ఢిల్లీ పర్యటన విశేషాలను గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. ప్రధాని తో, కేంద్ర హోం మంత్రితో సమావేశం అవుతారని వార్తలు వచ్చినప్పటికీ వారిని కలవకుండానే హైదరాబాద్‌కు తిరు గు ప్రయాణమయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులతో పాటు పునర్ వ్యవస్థీకరణ చట్టంలో అమలుకు నోచుకోకుండా ఉన్న పలు హామీలను, ఎయిమ్స్‌కు నిధుల కేటాయింపు తదితర అంశాలను జైట్లీతో ప్రస్తావించడం, లభించిన సానుకూల స్పందన తదితరాలను వివరించినట్లు తెలిసింది. వచ్చే నెల 12వ తేదీన ప్రారంభం కానున్న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై గవర్నర్‌తో చర్చించారు. రానున్న వర్షాకాలం నుంచి రైతులకు ఇవనున్న నాలుగు వేల పెట్టుబడి పథకం, దానికి అవసరమైన ఆర్థిక వనరులు, బ్యాంకుల్లో నగదు లభ్యత, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహకారం, రిజర్వు బ్యాంకు నుంచి ముందస్తుగానే పొందే రుణం తదితరాలకు సంబంధించి కూడా గవర్నర్‌తో సిఎం కెసిఆర్ చర్చించినట్లు తెలిసింది. ఢిల్లీ పర్యటన తర్వాత క్రమం తప్పకుండా గవర్నర్‌కు వివరించడం ఆనవాయితీగా వస్తున్నట్లుగానే ఇప్పుడు కూడా నేరుగా విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్ళడం విశేషం. సిఎం కెసిఆర్ శనివారం పుట్టినరోజు వేడుకల నేపథ్యంలో ఒక రోజు ముందుగానే గవర్నర్ నుంచి జన్మదిన శుభాకాంక్షలను, ఆశీర్వాదం అందుకున్నారు. ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి గవర్నర్ శనివారం చెన్నై వెళ్తున్నందున ఒకరోజు ముందుగానే కెసిఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు.