Home రాజన్న సిరిసిల్ల తెలంగాణ కోటి ఎకరాలు మగాణం చేయడమే కెసిఆర్ స్పప్నం

తెలంగాణ కోటి ఎకరాలు మగాణం చేయడమే కెసిఆర్ స్పప్నం

CM dream is to make crores of acresమన తెలంగాణ / సిరిసిల్ల :  తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా చేయడమే సిఎం కేసిఆర్ స్వప్నమని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.  తంగళ్లపల్లి మండలం సారంపల్లి మంగళవారం గ్రామంలో నిర్వహించిన రైతు బంధు కార్యక్రమం ఆయన పాల్గొని  చెక్కులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు రావల్సిన 1200 టిఎంసిల నీటితో కోటి 20లక్షల ఎకరాలు సాగు చేయవచ్చన్నారు. గోదావరి, కృష్ణా జలాలను సాగు చేసే అవకాశం ఉన్న ప్రతి నేలకు పారిస్తమని అన్నారు.  కోటి రతనాల వీణ నా తెలంగాణ అని కవి దాశరథి అన్నారని, మన సిఎం కేసిఆర్ నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం అంటున్నారన్నారు. 14 ఏళ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో కరెంటే ఉండదన్న ఆంధ్రాపాలకుల మాటలను అబద్దం చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఏర్పడిన 6 నెలల్లోనే విద్యుత్తులో స్వయం సమృధ్ధిసాధించామని వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నామని, అవసరమైతే ఇతర రాష్ట్రాలకు కరెంట్ సరఫరా చేసే దశకు చేరుకున్నామ న్నారు. ఒకప్పుడు కరెంట్ వస్తే వార్త అని ఇప్పుడు కరెంట్ పోతే వార్త అని మంత్రి అన్నారు. కాంగ్రెసోళ్లు 2009 మానిఫెస్టోలో మొదట 9 గంటలు కరెంటిస్తామని, తరువాత 6 గంటలని మాట మార్చారనీ, అది కూడా 3 విడతల్లో ఇచ్చారని గుర్తు చేశారు. రాత్రి కరెంట్ వల్ల అనేకమంది కరెంట్ షాకులకు, పాము కాట్లకు, నక్సల్స్ పేరిట బలయ్యారన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశిస్తున్నారని అన్నారు. అన్ని రాష్ట్రాల ప్రజలు, రైతులు తమ రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో సిఎం కేసిఆర్ అమలు చేస్తున్న పథకాలు తమకు కూడా అమలు చేయాలని కోరాలనే వివిధ రాష్ట్రాల్లో రైతు బంధు పథకం ప్రకటనలిచ్చారని, ప్రతిపక్షాలకు ఎందుకు కడుపుమంట అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతుబంధు చెక్కుల పంపిణీ, పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్నిదేశానికి స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్లలో కేసిఆర్ మినహ ఏ పాలకులు చేయలేక పోయారన్నారు. కేంద్రమంత్రి అరుణ్ జైట్లి సైతం పథకం వివరాలు విని ఆశ్చర్యపోయారన్నారు. స్వయంగా రైతు అయిన రైతు పక్షపాతి సిఎం కేసిఆర్ రైతుసంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టారన్నారు. రైతు బంధు పథకాన్ని ఏడాది ముందే ప్రకటించి ఏటా 8 వేల కోట్ల రూపాయలు కేటాయించి అమలు పరుస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిదన్నారు. 38 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగేలా 17,000 కోట్ల రూపాయలు మాఫీ చేసిన ఘనత కేసిఆర్‌దే అన్నారు. తెలంగాణలో నేడు విత్తనాలు, ఎరువులు రైతులకు సకాలంలో అందుతున్నాయన్నారు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు క్యూలు కట్టేవారని, కొందరు రైతులు విత్తనాలు, ఎరువులకు క్యూలు కట్టి ప్రాణాలు కూడా కోల్పోయారని వివరించారు. తాను ఎంఎల్‌ఏగా ఉన్నప్పుడు సిరిసిల్ల నియోజక వర్గంలోని వెంకటాపూర్ గ్రామంలో మునిగె ఎల్లయ్య అనే దళిత రైతు ఎరువుల కోసం క్యూలో నిలబడి మరణించారన్నారు. ఇప్పడా పరిస్థితి రాష్ట్రంలో ఎక్కడా లేనేలేదన్నారు. రైతు యూనిట్‌గా పంటల బీమా పథకం అమలు కావాలని, గ్రామమో,మండలమో యూనిట్‌గా పంటల బీమా పథకం అమలు చేస్తే ప్రయోజనం రైతులకు లేదన్నారు. రైతులు స్వయం సమృధ్ధి సాధించాలన్నదే తమ లక్షమన్నారు. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణం వేగంగా సాగుతోందన్నారు.
ప్రతిపక్ష కాంగ్రెస్, బిజేపిలు తమకు ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా తాము మాత్రం ప్రజలు, రైతు సంక్షేమ చర్యలు చేపడుతూనే ఉంటామన్నారు.తెలంగాణ దేశంలోనే విత్తన భాండాగారంగా తయారవుతుందనే విశ్వాసం తనకుందన్నారు. జూన్ రెండు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజునుండి రైతులకు 5,00,000 రూపాయల బీమా పథకం అమలు చేయనున్నామన్నారు. 1931లో నిజాం రాజు చేపట్టిన తరువాత 86 సంవత్సరాలకు విజయవంతంగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి 60 లక్షల మంది రైతులకు పట్టాదార్ పాస్‌పుస్తకాలు అందిస్తున్నామన్నారు. వ్యవసాయం దండుగ అనుకున్న రోజులున్నాయని, సిఎం కేసిఆర్ వ్యవసాయం అంటే పండుగ అనే వాతావరణాన్ని తయారు చేశారన్నారు. ఉపాధి హమి పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సిఎం కేసిఆర్ కేంద్రాన్ని కోరామని, శాసన సభలో తీర్మాణం చేశామని తెలిపారు. ధాన్యం మద్దతు ధరపై కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో మరో హరిత విప్లవం వస్తోందన్నారు. రైతుబంధు చెక్కులకు బ్యాంకుల్లో వెంటనే డబ్బు ఇచ్చేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. గల్ఫ్‌లో ఉన్న రైతుల రైతుబంధు చెక్కులు, పట్టాదార్ పాస్ పుస్తకాలను వారి కుటుంబ సభ్యులకు పంపిణీ చేసేందుకు కార్యక్రమాన్ని రూపొందిస్తామన్నారు. సిరిసిల్ల నియోజక వర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజక వర్గంగా తీర్చిదిద్దుతానని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు,కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎంపి వినోద్‌కుమార్, జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, జేసి యాస్మిన్ భాష, ఆర్‌డిఓ నునావత్ పాండురంగ, జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, ఎంపిపి జూపల్లి శ్రీలత, జడ్పిటిసి పుర్మాణి మంజుల, సెస్ చైర్మన్ డి లకా్ష్మరెడ్డి, ఏఎంసి చైర్మన్ జిందం చక్రపాణి, సెస్ మాజీ చైర్మన్ చిక్కాల రామారావు, ప్రజాప్రతినిధులు ఇతరులు పాల్గొన్నారు.