Home తాజా వార్తలు అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళం

అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళం

CM KCR about Donations For Yadadri Temple

సిఎం కెసిఆర్ కుటుంబం తొలివిరాళం కిలో 16 తులాలు
హెటిరో అధినేత 5 కేజీల బంగారం భూరి విరాళం
 యాదాద్రిని కాలినడకన నలుమూలలా, అణువణువూ పరిశీలించిన సిఎం కెసిఆర్
 ఆలయ ప్రాంగణంలో అద్భుత దృశ్యాల వీక్షణ, శిల్పాల ప్రత్యేకతపై ఆసాంతం చర్చ
 ప్రతి ఒక్క శిల్పాన్ని శ్రద్ధగా పరికించిన ముఖ్యమంత్రి
పుష్కరిణి, కల్యాణకట్ట, ప్రెసిడెన్షియల్ సూట్లు సహా వివిధ నిర్మాణాల పరిశీలన
 అధికారులకు ముఖ్యమంత్రి విలువైన సూచనలు
 పనుల పురోగతిని సిఎంకు వివరించిన స్తపతి ఆనంద్ సాయి, అధికారులు
 బాలాలయంలో నరసింహస్వామిని దర్శించుకున్న కెసిఆర్, వేదపండితుల ఆశీర్వచనం
 టెంపుల్ సిటీలో మద్యపానం, ధూమపానం నిషేధం, శాఖహారానికి మాత్రమే అనుమతి
అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళం
స్వామివారి పాదాల చెంత ముహూర్త పత్రిక
చినజీయర్ స్వామి స్వదస్తూరితో రాసి ఇచ్చిన ముహూర్త పత్రికను స్వామివారి పాదాల చెంత ఉంచాలని ఆలయ ఇఒ గీతకు ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా అందించారు. ఆలయ ప్రధాన అర్చకులతో సిఎం మాట్లాడుతూ యాదాద్రిలో పది వేల మంది రుత్విక్కులతో సుదర్శన హోమం నిర్వహిస్తామని, జీయర్ స్వామి స్వయంగా పర్యవేక్షిస్తారని వివరించారు.

మన తెలంగాణ/హైదరాబాద్ : దాదాపుగా పూర్తికావస్తున్న ఆలయ పునర్నిర్మాణ పనులను, ప్రధానాలయం, గర్భగుడిని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేతంగా మంగళవారం పరిశీలించారు. ఏరియల్ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ అభివృద్ధి పనులతోపాటు, పరిసరాలన్నింటిని నిషితంగా ఆయన పరిశీలించారు. తొలుత మధ్యాహ్నం 12.40 గంటలకు యాదాద్రి క్షేత్రం టెంపుల్ సిటీ దగ్గర ఏర్పాటు చేసిన హెలీపాడ్ వద్దకు ముఖ్యమంత్రి చేరుకున్నారు. అక్కడ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంఎల్‌ఎ సునీతా మహేందర్ రెడ్డి, శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంఎల్‌సి ఎలిమినేటి కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ మహేశ్ భగవత్, యాదాద్రి ఆలయ ఇఒ గీత, వైటిడిఎ చైర్మన్ కిషన్‌రావు, సిఎంఒ అధికారి భూపాల్ రెడ్డి, దేవదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు సిఎం కెసిఆర్‌కు తులసి మొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వెంట మంత్రి మల్లారెడ్డి, ఎంఎల్‌ఎ మర్రి జనార్దన్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్ ఉన్నారు.

అనంతరం కాన్వాయ్ ఘాట్ రోడ్డు ద్వారా ముఖ్యమంత్రి నేరుగా కొండపై బాలాలయానికి చేరుకున్నారు. అక్కడ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, భువనగిరి శాసనసభ్యుడు పైళ్ల శేఖర్ రెడ్డి, వేదపండితులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. బాలాలయంలో ప్రత్యేక అర్చన చేసిన ముఖ్యమంత్రికి వేద పండితులు ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. అక్కడి నుంచి ముఖ్యమంత్రి విఐపి ప్రవేశ ద్వారం నుంచి ప్రధాన దేవాలయానికి చేరుకున్నారు. పెంబర్తి కళాకారులు తయారుచేసిన ప్రధానాలయ ద్వారాలను సిఎం ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాంగణంలోని ఆలయ ప్రాకారం వెంట ఉన్న శిల్పాల ప్రత్యేకతలను వెంట ఉన్నవారికి వివరించారు. అడుగడుగునా వ్యూ పాయింట్ల వద్ద ఆగి, అక్కడి నుంచి కనిపించే అందమైన దృశ్యాలను సిఎం కెసిఆర్ తిలకించారు. గండి చెరువు, పుష్కరిణి, కల్యాణ కట్ట, దీక్షాపరుల మంటపం, సత్యనారాయణ వ్రత మంటపం తదితర నిర్మాణాల విశేషాల గురించి అధికారులతో చర్చించారు. జలాశయాలను ప్రత్యేకంగా రూపొందించిన తీరును సిఎం సహచర మంత్రులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా స్థానిక ఎంఎల్‌ఎ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి అభినందిస్తూ… మీరు ఎంఎల్‌ఎగా ఉన్న సమయంలో ఇంతటి ఉజ్వలమైన దేవాలయం నిర్మించడం వల్ల.. సునీతమ్మా నీ జన్మ ధన్యమైంది అని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వేంచేపు మంటపం వద్ద కొద్దిసేపు ఆగి పరిశీలించిన ముఖ్యమంత్రి ప్రధాన దేవాలయం గర్భాలయం వైపు చేరుకున్నారు. బంగారు వర్ణంతో శంకు, చక్ర నామాలతో ఇండోర్‌లో తయారు చేయించిన క్యూలైన్లను, గర్భాలయ ద్వారాల బంగారు తాపడాలను సిఎం కెసిఆర్ పరిశీలించారు. అక్కడ మంటపంలో ఏర్పాటు చేసిన నర్సింహస్వామి కల్యాణ ఘట్టాన్ని, చిత్రించిన తంజావూరు చిత్రపటాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆలయ మంటపం చుట్టూ తాపడం చేసి ఉన్న ప్రహ్లాద చరిత్ర ఘట్టాల విశేషాలను మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు, టిఆర్‌ఎస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులుతో పంచుకున్నారు. ఆల్వార్ మంటపం కలియదిరుగుతూ, ఒక్కో శిల్పాన్ని సీఎం ప్రత్యేకంగా పరికించారు. ధ్వజస్థంభం ఏర్పాటు కానున్న వేదికను కూడా పరిశీలించారు. పనుల పురోగతిని ఆలయ స్తపతి, ఆనంద్ సాయి ముఖ్యమంత్రికి వివరించారు. తుది పనులపై సిఎం కెసిఆర్ పలు సూచనలు చేశారు. క్యూ కాంప్లెక్స్, ఎస్కలేటర్స్, శివాలయం, విష్ణు పుష్కరిణితోపాటు, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణాలను కూడా ఆయన పరిశీలించారు.

ప్రెసిడెన్షియల్ సూట్ల పరిశీలన

యాదాద్రిలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, గవర్నర్లు వంటి వివిఐపిలు బస చేయడానికి ప్రత్యేకంగా నిర్మించిన ప్రెసిడెన్షియల్ సూట్లను సిఎం పరిశీలించారు. వీక్షకుల లాంజ్ నుంచి బంగారు వర్ణంలో కాంతులీనుతున్న ఆలయ గోపురాలను ముఖ్యమంత్రి తాదాత్మ్యంతో తిలకించారు. ఆ సూట్ పై నుంచి చూస్తే.. విద్యుద్దీప కాంతులతో ధగధగ వెలిగిపోతున్న యాదాద్రి ఆలయాన్ని, నందనవనంలాగా కనిపిస్తున్న పచ్చదనం దృశ్యాలను చూసి.. సిఎం కెసిఆర్‌తో సహా వెంట ఉన్నవారందరూ పులకించిపోయారు. అక్కడి నుంచి మళ్లీ ఆలయం ప్రాకారం దగ్గరకు తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి, లైటింగ్ ఏర్పాట్లను ప్రత్యేకంగా పరిశీలించారు. పలు సూచనలను చేశారు. సిఎం పర్యటన సందర్భంగా ఆలయ అర్చకులు తమకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.

దానిపై సిఎం కెసిఆర్ స్పందిస్తూ… నిర్ణయం ఎప్పుడో తీసుకున్నామన్నారు. కనుక ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయక, అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని మంత్రి జగదీశ్ రెడ్డిని, కలెక్టర్ పమేలా సత్పతిని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ ఆదేశించారు. అదేవిధంగా రింగురోడ్డు నిర్మాణ సమయంలో షాపింగ్ స్థలాలు కోల్పోయిన వారికి కల్యాణ కట్ట సమీపంలో ప్రతి ఒక్కరికీ వేయి స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో ఉచితంగా షాపులు నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మీకు పిఆర్‌సి వస్తుందా?అని సిఎం కెసిఆర్ ఆలయ ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. దానికి వారు వస్తుందనిసమాధానమివ్వడంతో సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం యాదాద్రిలోని రామలింగేశ్వరాలయంలో అభిషేక అర్చన చేసిన సిఎం… వివిఐపి గెస్ట్ హౌజ్ లో మంత్రులు, శాసనసభ్యులు తదితర ప్రముఖులతో కలిసి భోజనం చేశారు.

సూట్లలో అన్ని సౌకర్యాలు కల్పించాలి

పర్యటనలో భాగంగా సిఎం కెసిఆర్ సాయంత్రం కొండ కింద పూర్తయిన లక్ష్మీపుష్కరిణి, కల్యాణ కట్ట, టెంపుల్ రింగ్ రోడ్ వెంట తిరుగుతూ, గిరి ప్రదక్షిణ మెట్ల దారి, గోపురం దగ్గర నిర్మాణాలను పరిశీలించారు. తుది పనులపై పలు మార్పులు సూచించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ టెంపుల్ సిటి నిర్మాణ పనులను సిఎం పర్యవేక్షించారు. మొత్తంగా 250 ఎకరాల్లో విస్తరించి ఉండే ఈ టెంపుల్ సిటీలో 50 ఎకరాల్లో పచ్చదనం, మిగతా 200 ఎకరాల్లో 250 కాటేజీల నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. సుమారు 800 నుంచి 1000 గజాల విస్తీర్ణంలో నిర్మించే ఒక్కో కాటేజీలో మొత్తం 4 సూట్లు ఉంటాయన్నారు. దాతల నుంచి విరాళాలు సేకరించిన ధనంతో వైటిడిఎ ఈ కాటేజీలను నిర్మిస్తుందన్నారు. దాతలు సూచించిన పేరును ఆ కాటేజీకి పెట్టుకోవచ్చన్నారు. మొత్తంగా దాదాపు వెయ్యి కుటుంబాలు బస చేసే ఈ సూట్లలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాటేజీలకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సరిపడా నీళ్లు, నిరంతర విద్యుత్తు, అన్నిరకాల వసతులు, హంగులు సమకూర్చాలని సిఎం ఆదేశించారు. యాదాద్రి పవిత్రతను కాపాడటానికి అందరూ సహకరించాలని, టెంపుల్ సిటీ పరిధిలో మద్యపానం, ధూమపానం నిషేదాన్ని కఠినతరంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇక్కడ కేవలం శాఖాహారాన్ని మాత్రమే అనుమతించాలన్నారు.

వెల్లువెత్తిన భూరి విరాళాలు

ప్రధాన ఆలయ గర్భగుడి విమాన గోపురానికి బంగారు తాపడం కోసం 126 కిలోల బంగారం అవసరం కావడంతో మొదటి సారిగా ఒక కిలో 16 తులాల బంగారాన్ని సిఎం కెసిఆర్ విరాళంగా ప్రకటించారు. సిఎం కెసిఆర్ స్పూర్తిగా తీసుకుని పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు, వ్యాపారవేత్తలు వరుస ప్రకటన చేశారు.

ప్రపంచ దేశాల నుంచి వైష్ణవి మత గురువులను ఆహ్వానిస్తాం

ఉత్తరాయణంలో 2022 మార్చి 21న అంకురార్పణతో సుదర్శన యాగం పూజలు 28న మహా కుంభ సంప్రోక్షణ పూజతో ఆలయం పునర్ ప్రారంభం ముహూర్తం ప్రకటించిన నేపథ్యంలో దేశంతో పాటు దేశ నలుమూలల ప్రపంచ దేశాల నుంచి వైష్ణవి మాత గురువులను పీఠాధిపతులు ఆహ్వానిస్తామని సిఎం కెసిఆర్ తెలిపారు. ఆధునిక వసతులతో 250 కాటేజ్ నిర్మాణాలకు శ్రీకారం పెడుతున్నట్టు తెలిపారు. ఆలయ ప్రారంభం నాటికి పనులు పూర్తి చేసే విధంగా పనులను వేగవంతం చేసినట్లు తెలిపారు.

ఎపి భక్తురాలు కిలో బంగారం విరాళం

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామికి ఎపికి చెందిన ఓ భక్తురాలు విరాళాన్ని ప్రకటించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహాస్వామి గర్భగుడి బంగారు తాపడం కోసం ఒక కిలో బంగారాన్ని విరాళంగా ఇస్తానని వైఎస్‌ఆర్ కడప జిల్లా వ్యాపారవేత్త, జడ్పీటీసీ మోడెం జయమ్మ మంగళవారం పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని పునర్నిర్మాణాన్ని చేపట్టి, పూర్తిచేయడం ఒక గొప్ప యజ్ఞం అని ఆమె పేర్కొన్నారు. అతి త్వరలో దేవాలయాన్ని పునః ప్రారంభించబోతున్న సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తాను అందించే బంగారానికి సంబంధించిన చెక్కును సిఎం కెసిఆర్ మరోసారి యాదాద్రి పర్యటనకు రానున్న సందర్భంలో లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో సిఎం కెసిఆర్‌కు అందజేస్తామని ఆమె తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహాస్వామిలు తనకు ఇష్టదైవాలని తెలిపారు.

గోపురానికి స్వర్ణ విరాళాలు

CM KCR about Donations For Yadadri Temple