Home తాజా వార్తలు చిల్లర మల్లర మోడీ

చిల్లర మల్లర మోడీ

CM KCRప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి హిందువులు, ముస్లింలు అని విడదీసి మాట్లాడొచ్చా
ఇంత అధ్వాన్నం ఇప్పటివరకూ చూడలేదు, ఎన్నికలప్పుడే పాకిస్తాన్, రాముడు గుర్తొస్తాడా?
జూన్ తరువాత దేశం నివ్వెరపోయేలా కొత్త రెవెన్యూ చట్టం, నిర్మల్ ప్రచార సభలో కెసిఆర్

జూన్ నెల తర్వాత కొత్త రెవిన్యూ చట్టం తీసుకురాబోతున్నాం. ప్రతి గుంట భూమి లెక్క తేలేలా చర్యలు తీసుకుంటాం. భూమి యజమానికి సంపూర్ణ అధికారం కల్పించేలా కంక్లూజివ్ టైటిల్ ఇస్తాం. గిరిజనుల భూమి అయినా, గిరిజనేతరుల భూమి అయినా, ఏ భూమి ఎవరిదో అని తేల్చి పూర్తి యాజమాన్య హక్కు కల్పిస్తాం. రైతులు ఎంఆర్‌ఒ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ఎవ్వనికి ఏకాణ లంచం ఇవ్వకుండా ఉండే అధునాతన చట్టం తీసుకురాబోతున్నాం. అల్తుఫాల్తుగా చెప్తలేను..చెప్పింది కచ్చితంగా చేసి చూపిస్తా రైతులు రెండు నెలలు ఓపిక పట్టాలి. ఆరు నూరైనా దేశమే మన దగ్గర నేర్చుకుని పోయేలా కొత్త చట్టం తీసుకువస్తాం. మే నెల నుంచి రూ.2వేలు పెన్షన్ ఇస్తం.

పసుపు బోర్డు పెట్టమని ప్రధాని మోడీని స్వయంగా ఐదేళ్లలో ఐదొందల సార్లు కొరినా పెడచెవిన పెట్టిండు. ఇప్పుడు బిజెపి జాతీయ సెక్రెటరీ నిజామాబాద్‌కు వచ్చి మమ్మల్ని గెలిపించండి…మూడు రోజుల్లో పసుపు బోర్డు పెడుతామంటుండు. ఐదేళ్లు ఏడ పండినవు బిడ్డా… మేం ఎన్ని దండాలు పెట్టినా పట్టించుకోకుండా ఎలక్షన్‌లప్పుడు వచ్చి మాకు ఓటు గుద్దుండ్రి అని అడుగుతున్నవ్. అవును గుద్దాలె.. గుద్దుడు గుద్దితే బిజెపి పాతళానికి పోవాలె.

ఫేస్‌బుక్ తెరిస్తే దాంట్లో హిందువులు, దేవుళ్లు, దేవాలయాల పేరుతో పెద్ద హోరు నడుస్త్తంది. దేవుళ్లను మేము కాపాడతలేమా? ఎవరి ఇంట్లో దేవుని పటం లేదు చెప్పుండ్రి. అఖరికి క్యాలెండర్‌పై దేవుడి బొమ్మ అయినా ఉంటుంది. పొద్దున లేస్తే దేవుడికి దండం పెట్టే బుక్కెడు అన్నం తింటం. వరి కోసినా, కళ్లం చేసినా దేవుడికి దండం పెడుతం. నిర్మల్‌లో దేవాలయాలన్నీ బిజెపి వాళ్లే కట్టించారా..? ఇక్కడ నాగోబా జాతర జరుగుతలేదా..? వీళ్లు చెబితేనే జరుగుతుందా? యువకులు ఈ పిచ్చి ప్రచార హోరులో కొట్టుకపోవద్దు.

మనతెలంగాణ/హైదరాబాద్: బిజెపి పార్టీ సిగ్గులేని, భావదారిద్య్రం ఉన్న పార్టీ అని టిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ధ్వజమెత్తారు. పసుపు బోర్డు పెట్టమని ప్రధాని నరేంద్ర మోడీకి తానే స్వయంగా ఐదేళ్లలో 500 దరఖాస్తులు ఇచ్చినా దానిని పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. ఇప్పుడు బిజెపి జాతీయ సెక్రెటరీ నిజామాబాద్‌కు వచ్చి మమ్మల్ని గెలిపించండి…మూడు రోజుల్లో పసుపు బోర్డు పెడతామని అంటున్నారని విమర్శించారు. నువ్వు ఐదేళ్లు ఏడ పండినవు బిడ్డా…ఐదేళ్ల నుంచి మేము అడుగుతుంటే అప్పుడు ఎక్కడ పండుకున్నవు అని సిఎం కెసిఆర్ కడిగిపారేశారు. ఐదేళ్ల నుంచి ఎన్ని దరఖాస్తులు ఇచ్చినా…ఎన్ని దండాలు పెట్టినా పట్టించుకోకుండా, ఇప్పుడు ఎలక్షన్‌లప్పుడు వచ్చి మాకు ఓటు గుద్దుండ్రి అని అడుగుతున్నారని విమర్శించారు. గుద్దుడు గుద్దితే పాతళలోకం పోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. రైతులకు గిట్టుబాటు ధర రావాలె అని కెసిఆర్ పేర్కొన్నారు.

ఈ దేశంలో కనీస మద్దతు ధరను కేంద్రం తన వద్ద తొక్కి పెట్టుకుందని, ఆ అధికారం రాష్ట్రం చేతిలో లేదని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం నిర్మల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ బహిరంగ సభలో మంత్రి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, టిఆర్‌ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కే.కేశవరావు, అదిలాబాద్ టిఆర్‌ఎస్ ఎంపి అభ్యర్థి నగేష్, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, ఎన్నికలు రాగానే బిజెపి పార్టీకి పాకిస్తాన్, హిందువులు, ముస్లింలు గుర్తుకువస్తారని విమర్శించారు. ఎన్నికలు వస్తేనే హిందువులు, రామాలయం గుర్తొస్తదా..? ఎన్నికలు వస్తేనే పాకిస్తాన్ గుర్తుకు వస్తదా..? అని ప్రశ్నించారు. ప్రధాని స్థానంలో ఉన్న వ్యక్తి హిందువులు, ముస్లింలు అని విడదీసి మాట్లాడొచ్చునా..? ఇది ధర్మమేనా..? నిలదీశారు. ఈ లంగ పంచాయతీలు ఎందుకు..? ఏ మతమైనా అందరి రక్తం ఒకటే కదా..?చావు అయినా, సంతోషమైనా అందరికీ ఒకటే వస్తది కదా..? ఏ మతపోనికైనా గిచ్చితే నొప్పి పెట్టదా..? అని ప్రశ్నించారు.

అందరం ఒకటే కానీ ఈ లంగ పంచాయతీలు పెట్టాలె, సమాజాన్ని విభజించాలె, సెక్యులర్ భావాలతోని అద్భుతంగా బతికే ప్రాంతాలను కలుషితం చేయాలె అని అనుకుంటున్నారని అన్నారు. ఇంకా ఎంత కాలం ఈ అంశాన్ని వాడుకుంటారని ప్రశ్నించారు. దేశంలో ప్రజల సమస్యలు లేవా, పేదరికం లేదా..? అని పేర్కొన్నారు. ప్రధాన మంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి దేశంలోని ప్రజలను విడదీసి మాట్లాడొచ్చునా..? అని ప్రశ్నించారు. ప్రశాంతంగా అన్ని మతాలు కలిసి జీవించే గడ్డ తెలంగాణ అన్నారు. మసీదు పోయేటోడు మసీదుకు పోతుండు…గుడికి పోయేటోడు గుడికి పోతుండు..చర్చికి పోయేటోడు చర్చికి పోతుండు ఎవని దండం వాడు పెట్టుకుంటున్నడు అన్నారు. మనకు ఎవరికి ఎందుకు ఎతిరాజు ఉండాలె…ఈ లంగ పంచాయతీలు ఎందుకు…కడుపు నింపుతయా…? కాలు నింపుతయా..? అని అన్నారు.

ఎన్నికల్లో ప్రజలు గెలవాలె
ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలవాల్సింది…వ్యక్తులు కాదు..పార్టీలు కాదు…ప్రజలు గెలవాలె…ప్రజల అభీష్టం, ప్రజల అభిమతం గెలవాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిమతం గెలిచేటువంటి పరిపక్వత రావాలె అని, దురదృష్టవశాత్తు మన దగ్గర రాలేదని వ్యాఖ్యానించారు. ఏది పడితే అది అడ్డగోలుగా చెప్పడం, గోల్‌మాల్ చేయడం, ప్రచార హోరు సృష్టించడం, ఇష్టమొచ్చిన అబద్దాలు చెప్పడం, ఎన్నికల్లో ఓట్లు దంచుకుని పోవడం…ఇది జరుగుతోందని పేర్కొన్నారు. అది పోవాలె అని అన్నారు. ఇప్పుడు రాజ్యం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పోయిన ఎన్నికల్లో మొత్తం బ్లాక్‌మనీ ఎక్కడ పాతాళ లోకంలో ఉన్న సరే, ఎన్ని దేశాలలో ఉన్నా సరే తెస్తం…ఇంటికి రూ.15 లక్షలు వేస్తామని చెప్పారని, కానీ రూ.15 అయినా ఇచ్చారా..? అని అడిగారు. ఇప్పుడు మళ్లీ ఏ ముఖం పెట్టుకుని ఓటు అడుగుతున్నారని ప్రశ్నించారు. 10 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని కోటి మందికైనా ఇచ్చారా…? ఉన్నదా లెక్క…చూపెడతరా..? అని అడిగారు.

ప్రచారహోరులో యువత కొట్టుకుపోవద్దు
ఫేస్‌బుక్ తెరిస్తే దాంట్లో హిందువులు, దేవుళ్లు,దేవాలయాల పేరుతో పెద్ద హోరు అని వ్యాఖ్యానించారు. దేవుళ్లను మేము కాపాడతలేమా..? అని అడిగారు. ఎవరి ఇంట్లో ఎవరు దేవుడిని మొక్కడం లేదని, అఖరికి క్యాలెండర్‌పై దేవుడి బొమ్మ అయినా ఉంటుందని చెప్పారు. పొద్దున లేస్తే దేవుడికి దండం పెట్టే బుక్కెడు అన్నం తింటామని, వరి కోషినా, వరి కళ్లం చేసినా దేవుడికి దండం పెడతామని అన్నారు. నిర్మల్‌లో దేవాలయాలన్నీ బిజెపి వాళ్లే కట్టించారా..? ఇక్కడ నాగోబా జాతర జరుగలేదా..? వీళ్లు చెబితేనే జరుగుతుందా..? అని బిజెపిపై ప్రశ్నల వర్షం కురిపించారు. యువకులు ఈ పిచ్చి ప్రచార హోరులో కొట్టుకుని పోవద్దని సూచించారు. చైనాకు భారతదేశంతో ఏఏ రంగాలలో అపాయం ఉంటదో అధ్యయనం చేయమని ఒక కమిటీని నియమించారని, ఆ కమిటీకి ఏడాది సమయం ఇస్తే, మూడు నెలలకే నివేదిక ఇచ్చారని చెప్పారు. భారతదేశంలో ఇంకా పిచ్చి సన్నాసులు ఉన్నరు…ఇప్పటికీ కులమూ మతమూ అని కొట్టుకుని చస్తున్నారని, వాళ్లు మనతోని పోటీకి వచ్చే ముచ్చటనే లేదని, వాళ్లు పిచ్చి దేశమని నివేదిక ఇచ్చారని తెలిపారు. ఈ దేశం ఇట్లనే ఉండాల్నా…? అని ప్రశ్నించారు. 1976కు ముందు చైనా జిడిపి మనకంటే తక్కువగా ఉండేదని, ఇప్పుడు ప్రపంచంలో రెండవ పెద్ద ఎకానమీ దేశంగా మారిందని, మనకన్నా నాలుగురెట్లు అధికంగా ఉందని వివరించారు.

వాళ్లేమో బంగారం తింటున్నరు..మనం మన్ను తింటున్నమా..? అని అడిగారు. హిమాలయ పర్వతానికి వాడు అటు పక్క ఉంటే, మనం ఇటు పక్క ఉన్నామని తెలిపారు. వాళ్ల మేల్కుని పిడికిలి బిగించారని వ్యాఖ్యానించారు. చైనాలో కులం లేదు, మతం లేదు, ఆడ లేదు, మగ లేదని, అన్ని రకాల పనులు అందరూ చేస్తారని చెప్పారు. తాను చైనా వెళ్లినప్పుడు చూస్తే లక్షల మంది పనిచేసే మహిళలు ఫ్యాక్టరీలలోకి పనిచేసేందుకు వెళుతున్నారని చెప్పారు. మనదేశంలోనే ఇది ఆడవాళ్లు చేసే పని, ఇది మగవాళ్లు చేసే పని అని దరిద్రం ఉందని అన్నారు. ఎప్పటివరకైతే ఈ కులాల కుళ్లు, ఈ మతాల పంచాయతీ పోయి మొత్తం భారతీయులమందరం పిడికిలి బిగించమో అప్పటివరకు ఈ దేశం బాగుపడదని తెలిపారు. దళితులను అంటరానివాళ్లుగా చూస్తూ ఊరు బయటపెడతం, వారిని చిన్నచూపు చూస్తం, గిరిజనులను చిన్న చూపు చూస్తం, 50 శాతం మహిళలను పనిచేయనీయం అనే పద్దతి ఉందని చెప్పారు. భారతదేశం పురోగమించాలంటే దళితులు, గిరిజనులు గౌరవించబడాలె అని, మహిళలకు సమాన హక్కులు రావాలె అని వ్యాఖ్యానించారు. జాతి నిర్మాణరంగంలో అన్ని రంగాలలోకి మహిళల పాత్ర ఆహ్వానించాలె అని పేర్కొన్నారు.

ఇంత చిల్లర ప్రధానిని చూడలేదు
ఈ దేశంలో 3.44 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అయితే బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు తెలిపిలేక ఎన్నడు కూడా 2.20 లక్షల మెగావాట్లకు మించి వాడలేదని విమర్శించారు. ఈ దేశంలో పవర్ పాలసీ అంత దుర్మార్గంగా ఉందని అన్నారు. కరెంట్ పుట్టించే కర్మాగారాలు మూతపడి ఉంటాయని, అదిలాబాద్ బార్డర్‌లో ఉండే చత్తీస్‌ఘడ్‌లో 27 వేల మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అయ్యే జనరేటింగ్ స్టేషన్లు పడి ఉన్నాయని, వాటిని వాడరని దుయ్యబట్టారు. 70 వేల టిఎంసిల నీళ్లు ఉన్నయి, వాటిని వాడే తెలివిలేదని విమర్శించారు. సగం దేశం కరువుతోని ఉంటది…సగం దేశం చీకట్లో ఉంటది తాను పక్షి వర్రినట్లు వర్రుతున్నా, దానిపై కాంగ్రెస్ వాళ్లు మాట్లాడరు…బిజెపి వాళ్లు మాట్లాడరని అన్నారు.

ఇవి మాట్లాడకుండా కెసిఆర్ ముక్కు పెద్దగున్నది…కెసిఆర్ జాతకం చూసుకుంటడు, జ్యోతిష్యం చూసుకుంటడు, యాగం చేస్తడు అని మాట్లాడుతున్నారని, ప్రధానమంత్రి స్థాయి గిదా మాట్లాడేది అని ప్రశ్నించారు. నాకు ఇష్టమున్నది దేవుడికి దండం పెట్టుకుంట నీ ముళ్లె ఏం పోయింది అని ప్రధానిని అడిగారు. కేరళకు పోయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తిట్టారని చెప్పారు. ప్రధాని ఏ రాష్ట్రం పోతే ఆ రాష్ట్రంలో నాయకులను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇంత చిల్లర ప్రధానమంత్రిని, ఇంత అధ్వానమైన ప్రధానమంత్రిని తాను చూడలేదని, ఇది ఈ దేశం చేసుకున్న దురదృష్టమని వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి అంటే పాలసీ విధానం మాట్లాడాలని, విద్య గురించి మాట్లాడు, వైద్యం గురించి మాట్లాడు అని అన్నారు. మనదేశంలో అందరికీ విద్య ఉన్నదా…? అందరికీ వైద్యం ఉన్నదా..? ఉండటానికి చిన్నదో పెద్దదో కొంప ఉన్నదా..? అని, మౌళిక ప్రాథమిక అవసరాలు తీరినయా..? ఇవేవి మాట్లాడరని అన్నారు.

మనదేశంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, అంతర్జాతీయంగా లారీల స్పీడ్ గంటకు 80 కిలోమీటర్లు ఉంటే మన దగ్గర 24 కిలోమీటర్లు మాత్రమే ఉందని, అంతర్జాతీయ గూడ్స్ ట్రైన్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు ఉంటే మన దగ్గర 32 కిలోమీటర్లు అని పేర్కొన్నారు. 7500 కిలోమీటర్లు సముద్రతీరం ఉందని, లక్షదీవులు, అండమానులు వంటి అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నా వాటిని వాడమని చెప్పారు. 193 కిలోమీటర్ల సముద్రం ఉన్న సింగపూర్ పర్యాటకంగా అభివృద్ది చెందినా,మనకు సహజసిద్దంగా పర్యాటక ప్రాంతాలు ఉన్న వాటిని వాడే తెలివి లేదని అన్నారు. మౌళిక వసతుల కల్పన, పర్యాటక అభివృద్దిపై చర్చ లేదు కానీ కెసిఆర్ ముక్కు బాగలేదు, ఇంద్రకరణ్ మూతి బాగలేదు, నగేష్ నెత్తి బాగలేదు…అని మాట్లాడుతున్నారని, గిదా మాట్లాడేది అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఛోర్ హై అని రాహుల్‌గాంధీ అంటే, తల్లికొడుకులు జమనత్‌పై తిరుగుతున్నరు అని నరేంద్ర మోడీ విమర్శించుకుంటున్నారని..దేశానికి కావాల్సింది ఈ నాయకులేనా..? అని ప్రశ్నించారు.

అదిలాబాద్ తెలంగాణకు కశ్మీర్ లాంటిది
తెలంగాణకు అదిలాబాద్ జిల్లా కశ్మీర్ లాందిదని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఇండియా కశ్మీర్ ఎట్లానో తెలంగాణకు అదిలాబాద్ అలా ఉంటుందని పేర్కొన్నారు. ఈ జిల్లాలో అద్భుతమైన పంటలు పండే గొప్ప సారవంతమైన భూములు ఉన్నాయని తెలిపారు. ఈ భూములకు నీళ్లు రావాలె అని చెప్పారు. ఎస్‌ఆర్‌ఎస్‌పి నుంచి 50 వేల ఎకరాలు నిర్మల్‌కు, 50 వేల ఎకరాలు ముధోల్‌కు ఇచ్చే పనులు పూర్తవుతున్నాయని అన్నారు. అందులో శ్రీరాం సాగర్ నింపే కాళేశ్వరం పనులు ఈ సంవత్సరమే పూర్తవుతుందని చెప్పారు. తమ్మిడిహట్టి ప్రాజెక్టు ద్వారా 2 లక్షల ఎకరాలకు నీళ్లు వస్తాయని చెప్పారు. ఏడాది ఏడాదిన్నర కాలంలోనే అదిలాబాద్ జిల్లా కశ్మీర్ లాగా పచ్చని పంటలతో కళకళలాడే ఉంటుందని, అట్ల చేసే బాధ్యత నాది అని పేర్కొన్నారు. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఇతర నాయకుల కోరిక మేరకు అసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, అదిలాబాద్ నాలుగు జిల్లాలను చేసుకున్నామని తెలిపారు.

చాలా కష్టపడి రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించుకుంటున్నామని అన్నారు. ఐదేళ్ల క్రితం కరెంట్ విషయంలో ఆగమాగం ఉండేదని, ఇప్పుడు కరెంట్ కష్టాలు తీరాయని చెప్పారు. ఇప్పడు దేశంలో తలసరి విద్యుత్ వాడుకునే రాష్ట్రాలలో తెలంగాణ నెంబర్‌వన్ అని పేర్కొన్నారు. గతంలో రూ.200 ఉన్న పింఛన్‌ను రూ.వెయ్యికి పెంచి ఇస్తున్నామని, మే నుంచి దానిని రూ. 2 వేలకు పెంచబోతున్నట్లు వెల్లడించారు. రైతుబంధు పథకం కింద ఏడాదికి ఎకరానికి రూ.8 వేలు ఉంటే, ఇక నుంచి ఏడాదికి రూ.10 వేల ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతుబీమా ద్వారా చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షలు ఇస్తున్నామని చెప్పారు. దేశంలో 18-20 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉంటే వారిని ఎవ్వరూ పట్టించుకోలేదని, ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే బీడీ కార్మికులకు పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. పిఎఫ్ కార్డు ఉన్న బీడీ కార్మికులందరికీ పెన్షన్ ఇస్తామని సిఎం కెసిఆర్ అన్నారు. నగేష్ మూడు లక్షల మెజారిటీతో గెలవబోతున్నట్లు సర్వే రిపోర్టు ఉందని, కార్యకర్తలు, నాయకులు కష్టపడి భారీ మెజారిటితో గెలిపించాలన్నారు.

దేశం ఆశ్చర్యపోయేలా కొత్త రెవిన్యూ చట్టం
భారతదేశమే ఆశ్యర్యపోయేలా జూన్ నెల తర్వాత కొత్త రెవిన్యూ చట్టం తీసుకురాబోతున్నామని సిఎం కెసిఆర్ తెలిపారు. ప్రతి గుంట భూమి లెక్క తేలేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూమి యజమానికి సంపూర్ణ అధికారం కల్పించేలా కంక్లూజివ్ టైటిల్ ఇస్తామని చెప్పారు. గిరిజనుల భూమి అయినా, గిరిజనయేతరుల భూమి అయినా, ప్లేన్ భూమిలో ఉండే భూమి అయినా ఎవరి భూమి ఎవరిదో అని తేలి పూర్తి యాజమాన్య హక్కును కల్పిస్తామని తెలిపారు. పాస్‌బుక్‌లో 36 కాలమ్స్ పెట్టి రైతులను ఇబ్బంది పెట్టారని, పహాని నకల్‌ను మార్చేశామని తెలిపారు. దోపిడి శక్తులు రైతులను పీడించుకుని తినకుండా ఈ మార్పులు చేశామని అన్నారు. భూ సంబంధమైన సమస్యలు లేకుండా, రైతులు ఎంఆర్‌ఒ కార్యాలయాల చుట్టూ తిరగకుండా, ఎవ్వనికీ ఏకాన లంచం ఇవ్వకుండా ఉండే అధునాతన చట్టం తీసుకురాబ్తోన్నామని అన్నారు. రైతులు రెండు నెలలు ఓపిక పట్టాలని, ఆరు నూరైనా దేశమే మన దగ్గర నేర్చుకుని పోయేలా కొత్త చట్టం తీసుకువస్తామని తెలిపారు.

భూ సమస్యలు తీరి రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర రావాలె అని పేర్కొన్నారు. గ్రామాలలో రైతు సమన్వయ సమితి నాయకులు కథానాయకులై ధర్మంగా, న్యాయంగా ఎవరి భూమి వారికి వచ్చే కథ నడిపించాలని చెప్పారు. మంచిర్యాలలోనే ఒక రైతు ఫేస్‌బుక్‌లో మాట్లాడితే అతని సమస్య పరిష్కారం చేశానని తెలిపారు. భూ సమస్యల పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో తానే స్వయంగా రెండు మూడు రోజులు ఉండేలా క్యాంప్ ఏర్పాటు చేసి ఉండనున్నట్లు చెప్పారు. చీఫ్ సెక్రటరీ మొదలుకుని చిట్టచివరి అధికారి వరకు మొత్తం అధికార యంత్రాంగాన్ని తన వెంట తీసుకువచ్చి భూ సంబంధమైన సమస్య లేకుండా చేస్తానని పేర్కొన్నారు. రైతులు బ్యాంకు లోను కూడా పాస్‌బుక్ ఇచ్చే అవసరం లేకుండా, ప్రతి రోజు ఆర్‌ఒఆర్, ప్రతిరోజు జమాబంద్‌దీ జరిగే విధంగా, భూమి అమ్మినా, కొనుగోలు చేసిన వెంటనే వెబ్‌సైట్‌లో వచ్చేలా అధునాతన చట్టం చేయిస్తానని తెలిపారు.రైతులు నెల రెండు నెలలు ఓపిక పట్టాలని, అప్పటివరకు ఎవరికీ ఏకాన లంచం ఇవ్వొద్దని, దాని తర్వాత రూపాయి ఖర్చు లేకుండా పని జరుగుతుందని అన్నారు.

పదేళ్లలో పెట్టబోయే ఖర్చు రూ.30 లక్షల కోట్లు
రాబోయే పదేళ్లలో తెలంగాణ పెట్టబోయే ఖర్చు రూ.30 లక్షల కోట్లు అని సిఎం కెసిఆర్ తెలిపారు. మనం ఆర్థికంగా బాగున్నామని, ఇంకా కూడా బలపడతామని చెప్పారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కంటే కూడా రూ.3 లక్షల కోట్లు ఎక్కువ అని వ్యాఖ్యానించారు. అంత ధనవంతమైన రాష్ట్రం మనదని పేర్కొన్నారు. అందుకే ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ముసలివాళ్లు, పేదవాళ్లకు అన్నానికి బాధలేకుండా కొన్ని మంచి పనులు చేసుకున్నామని తెలిపారు. మహిళలు ప్రసవానికి పోతే బాధలేకుండా కెసిఆర్ కిట్ కార్యక్రమాన్ని పెట్టుకున్నామని చెప్పారు. మెల్లగనే కడుతున్నా డబుల్ బెడ్‌రూం ఇళ్లు కడుతున్నామని, ఈ సారి మరింత బడ్జెట్ పెంచుకుందామని తెలిపారు. సొంత జాగ ఉన్నా ఇళ్లు కట్టుకోవడానికి సాయం చేద్దామని పేర్కొన్నారు. మనకాడికి మనం ఉంటే కాదు, ఈ దేశం కూడా బాగుపడాలని అన్నారు. 1996లో కచ్చితంగా తెలంగాణ ఉద్యమం మళ్లీ వస్తుందని ఎస్‌ఆర్‌ఎస్‌పి కాలువ మీద తాను చెప్పారని, బతికుంటే, అదృష్టం బాగుంటే, ఆరోగ్యం బాగుంటే తానే జెండా లేవడతా అని చెప్పానని గుర్తు చేశారు. 2001లో ఏదైతే అదైతదని గులాబీ జెండా ఎగురవేసి కదిలానని, మొదట్లో ఎవరూ తనతో రాలేదని అన్నారు.

తనను అవమానపరిచి, అవహేళన చేశారని, తర్వాత ఒక్కొక్కరు జమై ఉద్యమం ఒక ఉప్పెన అయి ఇవాళ రాష్ట్రం తెచ్చుకున్నామని తెలిపారు. అప్పుడు తెలంగాణ వస్తదంటే ఎవరూ నమ్మలేదని చెప్పారు. భారతదేశం కూడా బాగుపడాలంటే ఒక దిక్సూచి రావాలె అని, దశ దిశ తీసుకుపోయే పద్దతి రావాలె అని వ్యాఖ్యానించారు. దాని కోసమే తాను ఫెడరల్ ఫ్రంట్ ప్రస్తావిస్తున్నానని తెలిపారు. కేంద్రంలో మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వమే వస్తుందని, తెలంగాణ మాత్రమే కాకుండా దేశం కూడా అభివృద్ది చెందాలని సిఎం కెసిఆర్ ఆకాంక్షించారు. దేశవ్యాప్తంగా చాలామందితో తాను మాట్లాడానని పేర్కొన్నారు. సెక్యులర్ భావాలతోని అన్ని మతాల ప్రజలను గౌరవప్రదంగా చూసుకునే భారతదేశం కావాలని, అన్ని మతాలు, అన్ని కులాలు సమానహోదాతోని బతికే భారతదేశం కావాలని ఆకాంక్షించారు. కులాల కుళ్లు, మతాల పంచాతీయ పెట్టే చిల్లరగాళ్లను చెంపదెబ్బ కొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ పార్టీ 16 ఎంపిలను గెలిస్తే నేషనల్ ఫ్రంట్‌లో మన బాధ్యత బాగా పెరుగుతుందని, ఈ దేశానికి దశ, దిశ చూపించడానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని సిఎం కెసిఆర్ చెప్పారు. దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తేవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. వినయశీలి అయిన అదిలాబాద్ లోక్‌సభ టిఆర్‌ఎస్ అభ్యర్థి నగేష్‌ను భారీ మెజారిటితో గెలిపించాలని సిఎం కెసిఆర్ కోరారు.

CM KCR Addresses at Election Campaign Meeting in Nirmal