Home తాజా వార్తలు పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్

పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్

CM KCR as TRS party president
ప్లీనరీలో వెలువడనున్న ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌ఎస్) పార్టీ అధ్యక్షుడిగా సోమవారం సిఎం కెసిఆర్ మారుమారు ఎన్నిక కానున్నారు. దీనికి నగరంలో హైటెక్స్ ప్రాంగణం వేదిక కాబోతున్నది. దీని కోసం భారీ ఎత్తున పార్టీ ప్రతినిధులు భాగ్యనగరానికి తరలివస్తున్నారు. ఈ అధ్యక్ష పదవి కోసం కెసిఆర్ పేరుతో మాత్రమే 18 సెట్ల నామినేషన్ నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో కెసిఆర్ ఎన్నిక లాంఛనగా మారింది. ఈ విషయాన్ని నేటి పార్టీ ప్లీనరి సమావేశంలో పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జీగా వ్యవహరించిన మాజీ ఎంఎల్‌సి శ్రీనివాస్‌రెడ్డి అధికారికంగా ప్రకటన చేయనున్నారు. దీంతో ఆయన 10వ సారి పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో కెసిఆర్ టిఆర్‌ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. ఎన్నికల సంఘం ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒక సారి నిబంధనల మేరకు పార్టీ అధ్యక్ష పదవికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించారు. అయితే ఏప్రిల్ మాసంలో జరగాల్సిన ఈ ఎన్నికల కరోనా కారణంగా వాయిదా పడింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పూర్తిగా అదుపులో ఉండడంతో పాటు సుమారు 93 శాతానికిపైగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా పూర్తి అయింది. ఈ నేపథ్యంలో సోమవారం ప్లీనరి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కెసిఆర్‌ను పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించనున్నారు.

తెలంగాణ సాధకుడు

తెలంగాణ ప్రజల చీరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించిన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ రాష్ట్రం కోసం అనేక మంది బలిదానాలు చేశారు.. ఎంతోమంది పోరాడారు.. కానీ, ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి రాష్ట్రం సాధించే వరకు విశ్రమించకుండా పోరాడిన వ్యక్తి కెసిఆర్ అని చెప్పవచ్చు. దీని కోసం తెలంగాణలో అన్ని పార్టీలను కలుపుకుని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవిశ్రాంతంగా పోరాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన ఆయన జీవన ప్రస్తానం గురించి ఒక్కసారి గమనించినట్లయితే….ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లాలోని చింతమడక గ్రామంలో 17 ఫిబ్రవరి, 1954 న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు కెసిఆర్ జన్మించారు. చిన్నతనంలో మధ్యతరగతి జీవితం అనుభవించాడు. సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బిఎ పూర్తిచేశారు.

అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఎ (తెలుగు సాహిత్యం) చదివాడు.1969 ఏప్రిల్ 23న శోభను కెసిఆర్ వివాహమాడారు. శోభా, కెసిఆర్ దంపతుల సంతానమే కుమారుడు కెటిఆర్,కుమార్తె కవిత. విద్యార్థి దశలో ఉన్నప్పుడే రాజకీయ అనుభవం సంపాదించిన వ్యక్తి చంద్ర శేఖర్‌రావు. ప్రారంభంలో అప్పటి తెలుగుదేశం పార్టీలో చేరి 1985లో రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు. 1987..19-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. 1999…-2001 ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్‌గా పనిచేశారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటుచేశాడు. 2004 ఎన్నికల్లో తన సొంత పార్టీ టిఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందారు. 14వ లోక్ సభలో కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రొగ్రెసివ్ అలయెన్స్ కూటమికి మద్దతు ప్రకటించి 5 లోకసభ సభ్యులున్న టిఆర్‌ఎస్ తరఫున కెసిఆర్ మంత్రి పదవి పొందారు.

2004 నుండి 2006 వరకు కేంద్రంలో కార్మికశాఖ మంత్రి పదవిని నిర్వహించిన అనంతరం మారిన రాజకీయ పరిమాణాల నేపథ్యంలో మంత్రిపదవులకు రాజీనామా చేయడమే కాకుండా యుపిఎ కూటమికి మద్దతు కూడా ఉపసంహరించుకున్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనే లక్ష్యంగా లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. అనంతరం జరిగిన ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి. జీవన్‌రెడ్డిపై సుమారు రెండు లక్షలకుపైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్ర డిమాండ్‌తో 2008లో మళ్లీ రాష్ట్రమంతటా టిఆర్‌ఎస్ సభ్యుల రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికల్లో మళ్లీ కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి లక్షా 50 వేల పైగా మెజారిటీతో భారీ విజయాన్ని నమోదు చేశారు. ఆ తర్వాత 2009లో జరిగిన 15వ లోక్ సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసి మళ్లీ విజయం సాధించారు. కాగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రెండో సారి పదవీ బాధ్యతలు స్వీకరించిన వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆకస్మిక మతి చెందడం.. కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు వంటి పరిణమానాలను తనకు అనుకూలంగా మార్చుకొని తెలంగాణ ఉద్యమాన్ని కెసిఆర్ మరింత ఉధృతం చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచారు.

2009, నవంబర్ 29న నిరవధిక నిరాహార దీక్ష మొదలు పెట్టారు. దీనిని దీక్షా దివస్‌గా పేర్కొన్నారు. ఈ క్రమంలో తెలంగాణ పోరాటం ఉధృతం కావడంతో ఇక తెలంగాణ రాష్ట్ర ఇవ్వడం తప్పితే మరో మార్గం లేదని భావించిన కేంద్ర ప్రభుత్వం .. 2009, డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే సీమాంధ్రలో ఉమ్మడి రాష్ట్రం కోసం ఆందోళనలు మిన్నంటడంతో అప్పటి యుపిఎ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. దీంతో తెలంగాణలో మరోసారి తెలంగాణ ఉద్యమం తీవ్ర రూపు దాల్చింది. కెసిఆర్ నేతృత్వంలో ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు పోరాటం తీవ్ర తరం చేశాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 2014 జూన్ 2న తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2న మధ్యాహ్నం 12.57 గంటలకు ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన తన నాలుగున్నర పాలన తరువాత సెప్టెంబరు 2018లో రాష్ట్ర శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా 2018 డిసెంబరు 7వ తేదీన జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ఘనవిజయం సాధించారు. డిసెంబరు 13వ తేదీన గురువారం మధ్యాహ్నం 1:25 నిమిషాలకు రాజ్ భవన్‌లో కెసిఆర్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండవసారి పదవీబాధ్యతలు చేపట్టారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ 119 స్థానాల్లో పోటీచేసి 88 స్థానాల్లో విజయ దుందుభి మెగించింది.ప్రస్తుతం బంగారు తెలంగాణ నినాదంతో కెసిఆర్ తన పాలనను కొనసాగిస్తున్నారు.

రాజకీయ జీవితం

విద్యార్థి దశలో ఉన్నప్పుడే చంద్రశేఖర్ రావు రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయాడు. విద్యార్థి దశ నుంచే కెసిఆర్‌కు రాజకీయ రంగంలోకి వెళ్ళాలనే స్పష్టత ఉండేది. అప్పటి కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్ మోహన్ కెసిఆర్‌కు రాజకీయ గురువుగా కొనసాగారు. 70వ దశకంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న కెసిఆర్, 1982లో తాను ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోగన్‌పైనే పోటీచేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

వరుస విజయాలు, మంత్రి పదవులు

1985లో తెలుగుదేశం తరఫున ఎన్నికల్లో పోటీచేసి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. ఇది కెసిఆర్‌కు రాజకీయ జీవితంలో తొలి విజయం. ఆ తరువాత 1989, 1994, 1999, 2001 (ఉప ఎన్నిక)లో వరుసగా గెలుపొందాడు.1987..19-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. 1992-..1993లో పబ్లిక్ అండర్ ండర్ చైర్మెన్ పదవిని నిర్వహించాjg. 1997..19-98లో కెసిఆర్‌కు తెలుగు దేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా కలిగిన రవాణా మంత్రి పదవి లభించింది. 1999…-2001 కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవి కూడా నిర్వహించాడు.

ఉద్యమ నాయకత్వం….టిఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు

2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి కెసిఆర్ రాజీనామా సమర్పించారు. 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశాడు. తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కెసిఆర్ అమితంగా ప్రభావితం చేశాయి. 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల ఏర్పాటుతో తెలంగాణ ఏర్పాటు కూడా అంత అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పరిచింది. అదే సంవత్సరం తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటుచేసిన సమావేశాల్లో రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చర్చించాడు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుచేయాలన్న ఆలోచనను బలపరిచాయి. ఈ నిర్ణయం కెసిఆర్ తన రాజకీయ బలాబలాలపై ఉన్న అవగాహన కూడా అంచనా వేసే తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోడం, విద్యుత్తు ఛార్జీల పెంపు వంటివి కెసిఆర్ నిర్ణయంపై తీవ్ర ప్రభావం చూపాయి.

మరోవైపు అప్రతిహతంగా అప్పటికి పదిహేనేళ్ళ పైచిలుకు 5 ఎన్నికల్లో సిద్ధిపేటలో వరుసగా గెలుస్తూండడంతో స్థానికంగా తనకు ఎదురులేదన్న అంచనాకు కూడా వచ్చాడు. దీంతో టిఆర్‌ఎస్ స్థాపనకు ముందు సైద్ధాంతికంగానూ తెలంగాణ ఏర్పాటు, దాని అవసరాల గురించి అధ్యయనం చేశాడు. అప్పటికే మలిదశలోకి అడుగుపెట్టిన తెలంగాణ ఉద్యమానికి కెసిఆర్ టిఆర్‌ఎస్ స్థాపన అన్నది రాజకీయమైన వ్యక్తీకరణ అయింది. టిఆర్‌ఎస్ స్థాపించిన 20 రోజులకు 2001 మే 17న తెలంగాణ సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పరిచి, తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించాడు. ఆపైన తన వాగ్ధాటికి, రాజకీయ వ్యూహాలకు పదును పెట్టుకుంటూ సాగాడు.

నిరాహార దీక్ష, పోరాటం, రాష్ట్ర సాధన

2009 నవంబరు 29న కెసిఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షను చేపట్టడానికి కరీంనగర్ నుండి సిద్ధిపేట దీక్షాస్థలికి బయలుదేరుతుండగా మధ్యలో కరీంనగర్ దగ్గరలోని అలుగునూరు వద్ద పొలీసులు అరెస్టుచేసి ఖమ్మం పట్టణానికి తరలించారు. అదే రోజున పోలీసులు దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించి 29, 30 తేదీల్లో బంధించారు. 30న జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడ నుంచి ప్రభుత్వాసుపత్రికి కెసిఆర్‌ను తరలించారు