Thursday, April 25, 2024

జలసాధకుడికి జేజేలు

- Advertisement -
- Advertisement -

CM KCR

ఈ సృష్టిలో తరాలు మారుతూ ఉంటాయి. నాయకులు మారుతూ ఉంటారు. కానీ అతికొద్ది మంది మాత్రమే చరిత్రలో చెరగని గుర్తుగా మారుతారు. తమ పేరును చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించుకుంటారు. రాజ్యాలనేలిన రాజుల చరిత్రలు నేటి తరాలు గొప్పగా చెప్పుకుంటాయి. నేడు తెలంగాణ ఉద్యమ నేత, కాళేశ్వర రూపకర్త ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చరిత్రను భవిష్యత్ తరాలు గొప్పగా చెప్పుకుంటాయనటం అతిశయోక్తి కాదు. నాయకులు అందరూ అవుతారు కానీ ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే నాయకులు అరుదు. అది కొందరికే సాధ్యం. నాయకత్వం అంటే పదవి మాత్రమే కాదు అది ఒక బాధ్యత అని నమ్మే వ్యక్తి కేసీఆర్. అందుకే ప్రజలు ఆయన్ని గుండెల్లో పెట్టుకుంటున్నారు. నేడు తెలంగాణలో కెసిఆర్ అంటే ఒక ఐకాన్, ఒక రోల్, ఒక మార్గదర్శకుడు, భవిష్యత్ రాజకీయ నేతలకు అతనో స్ఫూర్తి అని చెప్పవచ్చు.

సుదీర్ఘంగా సాగిన తెలంగాణ ఉద్యమానికి విజయం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, ఎవరి మద్దతూ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు, దేశానికే ఆదర్శవంతమైన పాలన, రెండోసారి ఎవరికి అందనంత ఎత్తులో అఖండ మెజారిటీతో మరోసారి ప్రభుత్వ ఏర్పాటు, ఎన్నిక ఏదైనా ప్రజల ఏకపక్ష తీర్పు ఇవన్నీ కెసిఆర్‌కే సాధ్యమయ్యాయి. చాలా మంది నాయకులు, రాజకీయ పార్టీలకు అంతుచిక్కని విషయం మాకెవ్వరికి ఇది ఎందుకు సాధ్యపడలేదు..? కెసిఆర్‌కే ఎలా సాధ్యమైంది అని..? కానీ అది ఒక్క కెసిఆర్‌కే సాధ్యం అనడం అతిషయోక్తి కాదు. దేశంలో స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి అనేక పార్టీలు ఈ దేశాన్ని పాలించాయి. కానీ ఎవరికి సాధ్యపడని, ఎవరూ చేయతలపెట్టని పనులను తెలంగాణలో కెసిఆర్ అమలు చేసి ప్రజలను మెప్పించారు. బిక్కుబిక్కుమంటూ జీవితాన్ని వెల్లదీస్తున్న వృద్ధులకు పెద్ద కొడుకువలె తొలి ప్రభుత్వంలో రూ. 1000, రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రూ. 2000 అందజేస్తూ వారికి అండగా నిలిచారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బోదకాలు బాధితులు, బీడీ కార్మికులు ఇలా అందరికీ పెన్షన్లు ఇస్తూ వారికి కొండంత ధైర్యాన్నిచ్చారు. పేదింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళు తలకుమించిన భారంగా మారుతున్న తరుణంలో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా లక్ష రూపాయల సాయం అందజేస్తూ మేనమామగా నిలుస్తున్నారు.

రైతులు బాగుంటే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో రైతుబంధు పేరుతో ఏడాదికి ఎకరాకు రూ. 10వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అందజేస్తున్నారు. కెసిఆర్ మనసున్న నేత అన్నదాతల మరణాలు వాళ్ళ కుటుంబాన్ని ఎంత ఛిద్రం చేస్తాయో స్వయంగా చూసిన వ్యక్తి ఆ బాధలు ఏ రైతు కుటుంబం పడద్దనే ఉద్దేశంతో రైతు బీమా ద్వారా మృతి చెందిన రైతు కుటుంబానికి రూ. 5లక్షల ఆర్థిక సాయం అందజేస్తూ అండగా నిలుస్తున్నారు. దేశమే అబ్బుర పడేలా తెలంగాణలో కరువు అనే మాట ఇక గతం అనే విధంగా కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్‌ను నిర్మాణం చేపట్టి పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. దేశంలోనే సంక్షేమంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది.

కెసిఆర్ ప్రవేశపెట్టిన కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి. డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణం, పండుగలకు బట్టల పంపిణీ, రుణమాఫీ, అంగన్ వాడీ, ఆశావర్కర్లు, మున్సిపాలిటీ సిబ్బంది, ఆర్‌టిసి ఉద్యోగుల, ఇటీవల గ్రామ పంచాయితీ సిబ్బంది జీతాల పెంపు, ప్రజల అవసరాల దృష్టా కంటి వెలుగు ఇలా అనేక రకాలుగా ప్రజలపై తనకున్నఅభిమానాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ చూపిస్తున్నారు. కెసిఆర్ లాంటి నాయకుడు తెలంగాణకు దొరకడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న అదృష్టమే. ఇంత గొప్ప కార్యక్రమాలు చేపట్టాలంటే మంచి మనసుండాలి. కెసిఆర్ చేసే పనులను విమర్శించే వారు దాని వల్ల ప్రయోజనం తెలిసిన తర్వాత అతన్ని అంతకు రెట్టింపుగా కీర్తిస్తారు అదే కెసిఆర్ అంటే.

కెసిఆర్‌ది పెద్ద చేయి.. బోళాశంకరుడు ఏదీ దాచుకోరు. ఒక ముఖ్యమంత్రిలా కాకుండా మన ఇంట్లో ఒక అన్నలా, నాన్నలా, బంధువులా అనిపిస్తాడు. ప్రజల కష్టాలను వాళ్ళలో ఒకరిగా వింటారు, వాటిని అర్థం చేసుకుని పరిష్కార మార్గం అన్వేషించి ప్రజలు ఎలాగైతే సంతోషంగా ఉంటారో దాన్నే అమలు పరుస్తారు. అందుకే ప్రజలకు కెసిఆర్‌పై అపారమైన ప్రేమ, నమ్మకం, గౌరవం. ఆ నమ్మకమే వారిని రెండు మార్లు అధికారాన్ని అందజేసింది. స్వరాష్ట్ర ఉద్యమంలో అతనిపై ఉన్న నమ్మకంతోనే ప్రజలు కెసిఆర్ వెంట నడిచారు. తన ప్రాంతాన్ని ప్రేమించగలిగే నాయకులు దొరకడం అరుదు. తెలంగాణ గురించి ఇంతలా ఆలోచించే నాయకుడు దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమనే చెప్పవచ్చు.

రాజకీయ నాయకులు వస్తుంటారు, పోతుంటారు కానీ కొందరే ప్రజల మనసుల్లో వారి ప్రేమతో చిరకాల స్థానాన్ని సంపాదించుకుంటారు. ఆ ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి కెసిఆర్. తనకు తెలంగాణ పై, ఈ రాష్ట్ర ప్రజలపై ఉన్న ప్రేమే తనను నేడు ఈ స్థానంలో నిలబెట్టింది. ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేసేలా చేసింది. ప్రజల కష్టాలను అర్థం చేసుకుని పరిష్కరించే శక్తి నిచ్చింది. వారెప్పుడూ ఒక మాట చెప్తుంటారు. మనకు వచ్చిన అవకాశంలో ప్రజలకి ఎంత సేవ చేశాం, ఎంత వరకు వారి సమస్యలు తీర్చగలిగాం, తెలంగాణ ప్రజలంతా సంతోషంగా ఉన్నప్పుడే తెచ్చుకున్న తెలంగాణకు సార్థకత ఉంటుందని. అందుకే కెసిఆర్ “తెలంగాణకు దొరికిన మేలిమి బంగారం’ గా అభివర్ణించుకుంటున్నది. కెసిఆర్ సరిలేరు మీ కెవ్వరూ “హ్యాపీ బర్త్ డే సార్‌”.

cm kcr birthday special story

టి. విజయ్ 9491998702

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News