Home తాజా వార్తలు దుష్టశక్తుల వల్ల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం

దుష్టశక్తుల వల్ల సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం

CM KCRవనపర్తి : కొన్ని దుష్టశక్తుల వల్ల తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణాల్లో జాప్యం జరిగిందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన పాలమూరు – రంగరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వనపర్తిలో మీడియాతో మాట్లాడారు. పాలమూరు – రంగరెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ఏడాదిలోగా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి కోసం కర్నాటకును బతిమాలినామని, గోదావరిని కృష్ణా నదితో అనుసంధానం చేసుకోవడం వల్ల నీటి సమస్య తీరుతుందని, నదుల అనుసంధానంపై ఎపి సిఎం జగన్, తాను ఒక నిర్ణయానికి వచ్చినట్టు కెసిఆర్ తెలిపారు. నదుల అనుసంధానంపై మహారాష్ట్ర, ఎపితో తగిన ఒప్పందాలు చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకుంటే, 570 టిఎంసిల నీటిని వినియోగించుకునే అవకాశం వస్తుందని ఆయన చెప్పారు. టిడిపి చీఫ్, ఎపి మాజీ సిఎం చంద్రబాబుపై కెసిఆర్ ధ్వజమెత్తారు. చంద్రబాబు సంకుచిత స్వభావంతో మాట్లాడుతున్నారని కెసిఆర్ దుయ్యబట్టారు. గతంలో బాబ్లీ ప్రాజెక్టుపై చంద్రబాబు సాధించేదేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. పరవాడ ప్రాజెక్టుల విషయంలో కూడా చంద్రబాబు ఏమీ సాధించలేకపోయారని మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులపై తన పాలనలో చంద్రబాబు తీవ్ర నిర్లక్ష్యం చూపారని ఆయన పేర్కొన్నారు.  గత సమైక్య పాలనలో తీవ్ర అన్యాయానికి గురైన తెలంగాణ ప్రజలను అన్నివిధాల ఆదుకునేందుకు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను సస్యశ్యామలం చేయడమే తన అంతిమ ధ్యేయమని కెసిఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్, బిజెపి నేతలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందకు కుట్రలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్, ఇతర విపక్షాలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను ఆదుకోవడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై దేశంలో మంచి చర్చ జరుగుతుందని ఆయన చెప్పారు.

CM KCR Comments On Irrigation Projects