Tuesday, April 23, 2024

తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ నిఖత్ జరీన్: సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో వరుగా రెండోసారి బంగారు పతకం సాధించిన నిఖత్ జరీన్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందించారు. ఢిల్లీలో జరిగిన ఫైనల్లో 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ స్వర్ణ పతకం సాధించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. వియత్నాంకు చెందిన బాక్సర్ న్యూయెన్‌పై 5-0 తేడాతో ఘన విజయం సాధించి భారత్‌కు మరోసారి గోల్డ్ మెడల్ సాధించి పెట్టిన నిఖత్ జరీన్ తెలంగాణ గర్వించదగ్గ బిడ్డ అని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

తన వరుస విజయాలతో దేశఖ్యాతిని ఆమె మరోసారి ప్రపంచానికి చాటి చెప్పిందన్నారు. ప్రపంచ చాంపియన్ పోటీల్లో తన కెరీర్‌లో ఇది రెండో బంగారు పతకం కావడం గొప్ప విషయమని సిఎం అన్నారు. క్రీడాభివృద్ధికి, క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారి సంక్షేమానికి, తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ దిశగా తమ కృషిని కొనసాగిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
నిఖత్ జరీన్ విజయంతో దేశం గర్విస్తోంది: మంత్రి హరీష్
మంత్రి హరీశ్‌రావు సైతం నిఖత్ జరీన్ను ప్రశంసించారు. నిఖత్ జరీన్ విజయంతో దేశం గర్విస్తోందన్నారు. పవర్‌ఫుల్ పంచ్‌లతో ప్రత్యర్థిని మట్టికరిపించి బంగారు పతకం సాధించిందని ప్రశంసిస్తూ అభినందనలు తెలిపారు. అలాగే బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సైతం నిఖత్ జరీన్‌ను అభినందించారు. మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత జెండా మరోసారి రెపరెపలాడిందని, స్వర్ణ పతకం సాధించి భారతదేశం గర్వపడేలా చేసిందని కవిత ట్వీట్ చేశారు.

వరుసగా మహిళల ప్రపంచ బాక్సింగ్ పోటీల్లో రెండోసారి ఛాంపియన్ షిప్ టైటిల్‌ను గెలిచిన నిఖత్ జరీన్‌కు రాష్ట్ర గిరిజన, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అభినందనలు తెలిపారు. వీరితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిఖత్ జరీన్‌పై ప్రశంసలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News