Tuesday, April 23, 2024

తెలంగాణ ఘన పర్యాటకం కేంద్రానికి పట్టదా?

- Advertisement -
- Advertisement -

CM KCR criticizes Centre over tourism development

పద్మ అవార్డులకు తెలంగాణ నుంచి అర్హులు లేరా?

ప్రధాని మోడీని, అమిత్ షాను నిలదీసి అడిగానని శాసనసభలో ముఖ్యమంత్రి కెసిఆర్ వెల్లడి

రాష్ట్ర పర్యాటక అభివృద్ధిని కేంద్రం చిన్నచూపు చూస్తోంది
ఈ విషయంలో ఇటీవల ప్రధాని మోడీని కలిసినప్పుడు ఆయనతో గొడవపడ్డాను
తెలంగాణలో కళలకు, కళాకారులకు కొదువలేదని చెప్పాను అయినప్పటికీ వారికి
కేంద్రం ఎందుకు గుర్తింపు ఇవ్వడంలేదని ప్రశ్నించాను పద్మశ్రీ అవార్డుల కోసం
ఎన్నిసార్లు పేర్లు పంపినా ఎందుకు పట్టించుకోవడంలేదని అడిగాను అర్హులున్నా
గుర్తింపు ఇవ్వకపోవడంపై అమిత్‌షాను కూడా ప్రశ్నించాను అవసరమైతే కేంద్రంతో
కొట్లాడైనా రాష్ట్రానికి దక్కాల్సిన గుర్తింపును సాధిస్తాను ఎయిర్‌స్ట్రిప్స్ మంజూరుచేస్తే
మేమే విమానాశ్రాయాలు నిర్మించుకుంటామని చెప్పాను వారీగా
పర్యాటక ప్రాముఖ్యం గల ప్రాంతాలు, ప్రదేశాల గురించి వివరాలు సేకరించి
పర్యాటకాన్ని పరుగెత్తిస్తా : అసెంబ్లీలో ముఖ్యమంత్రి కెసిఆర్

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర పర్యాటక అభివృద్ధిపై కేంద్రం చిన్నచూపు చూస్తోందన్నారు సిఎం కెసిఆర్ తీవ్ర స్థాయిలో అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీని కలిసినప్పు డు పలు అంశాలపై తాను గొడవపడ్డానని తెలిపారు. తెలంగాణలో కళకు, కళాకారులకు కొదవలేదని…అయినప్పటికీ తమ కళాకారులకు ఎందుకు గుర్తింపు ఇవ్వడం లేదని ప్రశ్నించానని అన్నారు. పద్మశ్రీ అవార్డులకు ఎన్నిసార్లు పేర్లు పంపినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదని అడిగానని సిఎం కెసిఆర్ వెల్లడించారు. ఈ వార్డుల కోసం పేర్లు పంపి విసుగు వస్తోందని…అర్హులున్నా ఎందుకు గుర్తింపు ఇవ్వడం లేదని మోడీతో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కూడా తాను ప్రశ్నించానని అన్నారు. దీనిపై నరేంద్రమోడీ స్పంది స్తూ మీరేం చిన్నబుచ్చుకోవద్దని తప్పకుండా గుర్తింపు లభిస్తుందని హామీ ఇచ్చారన్నారు. ఈ విషయంలో అవసరమైతే కేం ద్రంతో కొట్లాడైనా రాష్ట్రానికి దక్కాల్సిన గుర్తింపు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు.

అలాగే ఎయిర్ స్టిప్స్ ఇస్తే తామే విమానశ్రయాల నిర్మాణాలు చేసుకుంటామని కూడా చెప్పామన్నారు. ఏడేళ్లయినా ఇప్పటికీ వాటి జాడ లేదని ఆయన కేంద్రంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రపంచ వారసత్వ కట్టడంగా రామప్ప దేవాలయంపై పలవురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమాధానం ఇచ్చిన అనంతరం సిఎం రాష్ట్ర పర్యాటకంపై మాట్లాడారు. టూరిజంతో పాటు ఇతర విషయాల్లో కేంద్రం తెలంగాణను పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ ఉజ్వలమైన సంస్కృతి, సంప్రదాయాలు, అనేక అద్భుత కళలకు పుట్టినిల్లని పునరుద్ఘాటించారు. 58 సంవత్సరాల సమైక్యాంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంత పర్యాటకం పూర్తిగా నిరాదరణకు గురైందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నియోజకవర్గాల వారీగా పర్యాటకానికి అనువైన ప్రాంతాలు, దర్శనీయ ప్రదేశాల గురించి వివరాలు సేకరించి రాష్ట్ర పర్యాటకాన్ని ప్రగతి పథంలో పరుగులు పెట్టించేందుకు అన్ని రకాల చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అద్భుతమైన జలపాతాలు ఉన్నాయని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఖమ్మంలో పాండవుల గుట్టను పట్టించుకోలేదన్నారు. చరిత్రక ఉజ్వలమైన అవశేషాలు ఉన్న రాష్ట్రం పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో ఉందన్నారు.

రాష్ట్ర పర్యాటక ప్రగతిని పరుగులు పెట్టిస్తాం

తెలంగాణ ఉజ్వలమైన సంస్కృతి, సంప్రదాయాలు, అనేక అ ద్భుత కళలు, చారిత్రక కట్టడాలు, అందమైన అటవీ సంపద, అపురూపమైన జలపాతాలు ఉన్నాయని సిఎం కెసిఆర్ వ్యా ఖ్యానించారు. రామప్ప ఆలయమేకాకుండా వారసత్వ పరంపరలో వచ్చిన చాలా కట్టడాలు రాష్ట్రంలో ఉన్నాయన్నారు. వాటిని గుర్తించి పునర్‌వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణలోని అష్టాదశ పీఠాల్లో ఒకటైన జోగులాంబ అమ్మవారి శక్తిపీఠాన్ని కూడా పాలకులు పట్టించుకోలేదని, కృష్ణా, గోదావరి పుష్కరాలకు కూడా ఆదరణ లభించలేదని సిఎం పేర్కొన్నారు. ఇన్ని రోజులు నీళ్లు, విద్యుత్, వ్యవసాయం విషయంలో కాస్త ఇబ్బందులున్నందున పర్యాటకంపై దృష్టిసారించలేక పోయామన్నారు. కానీ ఇప్పుడు ఆ సమస్యలన్ని పరిష్కారమవ్వడం వల్ల పర్యాటక రంగాన్నిప్రగతి పథంలో పరుగులు పెట్టించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 160 కి.మీ. మేర గోదావరి సజీవంగా పారుతోందని తెలిపారు. పర్యాటక రంగంలో అభివృద్ధి చేయడానికి కావాల్సిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజాప్రతినిధులంతా తమ ప్రాంతాల్లో పర్యాటక, ప్రాచుర్యం పొందిన ప్రాంతాలు, దర్శనీయ స్థలాలు, ప్రకృతి రమణీయత పంచే ప్రాంతాలు, జలపాతాలు ఉంటే వాటిపై నివేదిక మంత్రి శ్రీనివాస్ గౌడ్‌కు అందజేయాలని సూచించారు. తెలంగాణలో ఉన్న ప్రకృతి సౌందర్యాలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు దక్కేలా ప్రణాళిక రూపొందిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఉద్ఘాటించారు. అన్ని జిల్లాలకు సంబంధించిన శాసనసభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. చారిత్రాకమైన ప్రదేశాలు, కోటలు, దర్శనీయ స్థలాలు, విశిష్టమైన దేవాయాల ప్రాచుర్యాన్ని ప్రపంచానికి తెలియజేసేందుకు తగు చర్యలు తీసుకుంటాన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News