Home తాజా వార్తలు కేరళీయులు ఆత్మీయులు

కేరళీయులు ఆత్మీయులు

వారిలో పేదలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు
ప్రవాస కేరళీయుల సభలో ముఖ్యమంత్రి
శబరిమలలో తెలంగాణ భవన్ : చాందీ

Double-bed-rooms

మన తెలంగాణ/మాదాపూర్: తెలంగాణ రాష్ట్రంలోని పేద కేరళీయులకు డబుల్ బెడ్‌రూం ఇళ్ళను నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు హామీనిచ్చారు. ఆదివా రం హైదరాబాద్‌లోని మాదాపూర్ లో గల శిల్పాకళా వేదికలో జరిగిన కేరళీయుల సమావేశంలో కెసిఆర్ మాట్లాడుతూ నగరంలో కేరళ భవ న్ నిర్మాణానికి తోడ్పడుతామని ఆరు నెలల క్రితం హామీ ఇచ్చినట్లు చెప్పారు. ఆ మేరకు ఫిల్మ్‌నగర్‌లో ఎకరం స్థలం కేటాయించి, నిర్మాణ వ్యయం కింద కోటి రూపాయల నిధులను మంజూరు చేశామని తెలిపారు. ఆదివారం నాడు ఈ భవనానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు శంకు స్థాపన చేశారు. కేరళ రాష్ట్రానికి గొప్ప చరిత్ర ఉందని, మంచి సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో ప్రాచుర్యం ఉన్నాయన్నారు. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రాభి వృద్ధికి దేశంలోనే సీనియర్ నాయకుడైన కేరళ ముఖ్య మంత్రి ఊమెన్ చాందీ తగిన సలహాలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో నివసిస్తున్న కేరళీయు లు తనకు తోబుట్టువులతో సమానమన్నారు. మన రాష్ట్రంలో కేరళీయులు సేవాభావం కలిగిన టీచర్లుగా, నర్సులుగా
పని చేస్తున్నారని వారికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుం దన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో కేరళీయులు పాలు పంచుకోవాలని కోరారు. కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ మాట్లాడుతూ
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన తర్వాత మొదటిసారిగా హైదరాబాద్‌కు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ నివసిస్తున్న కేరళీయుల అవసరాల నిమిత్తం ప్రత్యేక భవనాన్ని నిర్మించడం చాలా ఆనందించదగిన విషయమన్నారు. శబరిమలైలో తెలంగాణ భవనం కోసం ప్రత్యేక స్థలాన్ని కేటాయించి, నిర్మించి ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలొ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, విద్యుత్ శాఖమంత్రి జగదీశ్వర్‌రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్మన్ రసమయి బాలకిషన్, రాజ్యసభ సభ్యులు కేశవరావు, వి. హనుమంతరావు, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్యేలు ఏనుగు రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, ప్రిన్సిపల్ సెక్రటరీ వెంకటేశం, లివి బెంజ్‌మెన్ తదితరులు పాల్గొన్నారు.