Home తాజా వార్తలు కాంగ్రెసోళ్లు 50ఏళ్లలో తట్టెడు మట్టికూడా తీయలేదు

కాంగ్రెసోళ్లు 50ఏళ్లలో తట్టెడు మట్టికూడా తీయలేదు

Cm Kcr

ఎపి సిఎం జగన్‌ను ఆహ్వానించడానికి తాను వెళ్తే ఇక్కడున్న కొందరు జగన్ రావొద్దని మాట్లాడటం దారుణమని సిఎం పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు 50 ఏళ్లు అధికారమిస్తే ఎక్కడా ఒక్క తట్ట మట్టి తీయలేదని విమర్శించారు. తెలంగాణ దాహార్తిని తీర్చి, సస్యశ్యామలం చేసే కాళేశ్వరాన్ని అడ్డుకోవాలనుకోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. బృహత్తరమైన ప్రాజెక్టు కాళేశ్వరానికి కేంద్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పారు. కాళేశ్వరం మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరించిందని అన్నారు. జులై నాటికి మిషన్ భగీరథ పూర్తవుతుందని వెల్లడించారు. పాలమూరు ఎత్తిపోతలకు రూ.10వేల కోట్లు బ్యాంకులు ఇచ్చాయని, త్వరలో పాలమూరు ఎత్తిపోతలను పరుగులు పెట్టిస్తామని తెలిపారు. ఢిల్లీలో అఖిలపక్ష భేటీకి టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావును పంపిస్తున్నామని చెప్పారు. యువకుడు, ఉత్సాహవంతుడు అయిన జగన్ ఎపిలో సిఎం అయ్యారని, ఆయన తన రాష్ట్రంలోని ప్రతి ప్రాంతానికి నీటిని అందించాలని దృఢంగా నిర్ణయించుకున్నారని తెలిపారు. ముఖ్యంగా, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా ప్రాంతాల్లోని మెట్టభూములకు నీళ్లు తీసుకెళ్లాలని జగన్ చాలా పట్టుదలగా ఉన్నారని వివరించారు.

తెలంగాణలో కాళేశ్వరం ఎలా పూర్తయిందో, ఎపిలో కూడా అలాగే కొన్ని ప్రాజక్టులు పూర్తిచేసుకోవాలని జగన్ చెప్పారని, భేషజాలు పనికిరావన్న అభిప్రాయం జగన్ వైఖరి ద్వారా అర్థమవుతోందని కెసిఆర్ అన్నారు. కృష్ణా, గోదావరికి సంబంధించి 4800 టిఎంసిల నీళ్లు రెండు తెలుగు రాష్ట్రాలు పుష్కలంగా వాడుకోవడానికి అవకాశం ఉందని, ఇక మీదట తెలుగు రాష్ట్రాల వివాదాల్లో కేంద్రం జోక్యం చేసుకునే దుర్గతి పట్టకూడదని తానూ, ఎపి సిఎం జగన్ నిశ్చయించుకున్నామని వెల్లడించారు. గతంలో అపార్థాలు, కయ్యాలు, కీచులాటల ద్వారా అంతిమంగా తెలుగు ప్రజలు నష్టపోయారని తెలిపారు. ఇకమీదట ఆ సమస్య ఉండబోదని, అందుబాటులో ఉన్న సుమారు 5 టిఎంసి నీళ్లు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి అంగుళానికి తీసుకెళ్లాలన్నది తమ ప్రణాళిక అని స్పష్టం చేశారు. రాబోయే రెండు మూడేళ్లలో దాని ఫలితాలు కనిపిస్తాయని చెప్పారు. ప్రతీ ఏటా సుమారు 3500 టిఎంసి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయని అన్నారు. తెలంగాణ, ఆంధ్రాకు కలిపి గోదావరిలో 1480 టిఎంసి నీళ్ల వాటా ఉందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రాకు కలిపి కృష్ణాలో 811 టిఎంసి నీళ్ల వాటా ఉందని పేర్కొన్నారు. గోదావరి, కృష్ణాలో కలిపి ఇరు రాష్ట్రాలకు 2300 టిఎంసిల నీళ్ల వాటా ఉందని తెలిపారు. రెండు నదుల మిగులు జలాలు కూడా రెండు రాష్ట్రాలు వాడుకోవచ్చని సిఎం తెలిపారు.

కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదం
హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డా అని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించడం హాస్యాస్పదమని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిత్యం కర్ఫూలు, మతకల్లోహాలు ఉండేవని, గత ఐదేళ్లలో మతకల్లోహాలు లేవని అన్నారు. ఐదేళ్లలో చిన్న కర్ఫూ కూడా లేదని తెలిపారు. తాము ఎక్కడా రాజీపడకుండా శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గడిచిన ఐదేళ్లలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు.

Cm Kcr Fires On Congress Party Leaders