Saturday, April 20, 2024

ఉద్యమం నుంచి ఉన్నతికి

- Advertisement -
- Advertisement -

KCR Elected as TRS President for 9th

తెలంగాణ ఉద్యమం ప్రపంచ ఉద్యమాలకే చూపింది

సమైక్యవాదులు ఏయే రంగాల్లో తెలంగాణ వెనుకబడుతుందని దుష్ప్రచారం చేశారో ఆ రంగాల్లోనే
రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దాం 
అనేక అడ్డంకులను కేసులను ఎదుర్కొని సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేశాం
దళితబంధు ఓ సామాజిక స్వాంతన..
దేశానికి స్ఫూర్తి రైతుబంధునూ తొలుత అపహాస్యం చేశారు దళితబంధుపైనా ఇప్పుడు అదే చేస్తున్నారు
ఆగిపోము.. ఇంకా ఎన్నో కార్యక్రమాలు
చేపడతాం మాకు బాసులు తెలంగాణ ప్రజలే
ఇప్పుడు ఎపి చీకట్లో, తెలంగాణ వెలుగుల వెల్లువలో: టిఆర్‌ఎస్ 20ఏళ్ల ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రపంచ ఉద్యమాలకే తెలంగాణ ఉద్యమం కొత్త బాటను చూపిందని టిఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వతంగా కీర్తి ఉండిపోతుందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న ప్రజల ఆకాంక్ష, ఆవేశాన్ని మరింత ఉద్యమం వైపు తీసుకెళ్లడం ఎంత సులవైన విషయం కాదన్నారు. దానిని ఒక కార్యాచరణ ప్రణాళికగా మార్చి….విజయవంతంగా అనుకున్న రాష్ట్రాన్ని సాధించుకోగలిగామన్నారు. తెలంగాణ ఉద్యమం ప్రారంభించినపుడు ప్రజల్లో అనేక అపోహలు… అనుమానాలు..సందేహాలు.. విశ్వాస రాహిత్య పరిస్థితి ఉండేదన్నారు. సోమవారం నగరంలోని హెచ్‌ఐసిసిలోన టిఆర్‌ఎస్ ద్విదశాబ్ధి ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షుడిగా ఆయన తొమ్మిదవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కెసిఆర్ అధ్యక్షోపన్యాసం చేస్తూ, 2001లో జలదృశ్యంలో పార్టీ జెండా ఆవిష్కరించామని కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసంలో పార్టీ జెండా ఎగిరిందన్నారు. కొద్దిమంది మిత్రులతో కలిసి తెలంగాణ ఉద్యమ ప్రస్థానం మొదలుపెట్టామన్నారు.స్వాతంత్య్ర పోరాటం తరహాలోనే ఉద్యమాన్ని అంచలంచలుగా ముందుకు తీసుకెళ్లామని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. రాజీలేని పోరాటమే తెలంగాణ సాధిస్తుందని ఆనాడే కవిత రాశానని కెసిఆర్ అన్నారు. అహింసా మార్గంలోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. సిపాయిల తిరుగుబాటు విఫలమైంది అని అనుకుంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చేదా? ప్రశ్నించారు. అలాగే ఎన్నో అవమానాలు జరిగాయి కాదా? తాను ఏనాడు తెలంగాణ ఉద్యమంలో వెనకడుగు వేయలేదన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వస్తే కొందరు సన్నాసులు…తెలంగాణ అంతా కారు చీకటి అవుతుందని, నక్సలైట్ల రాజ్యం అవుతుందని అడుగడుగునా అడ్డంకులు సృష్టించారన్నారు. చివరకు రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన సమయంలో కూడా సమైక్యవాదులు తమ ప్రయత్నాలను వీడలేదన్నారు. వారు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వాటిని సమర్థవంతంగా అడ్డుకున్నామన్నారు. రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాదు…పాలనలో ఏడేళ్లలో అద్భుతమైన ఫలితాలను తీసుకొచ్చామన్నారు. అన్ని రంగాల్లో దేశానికే రాష్ట్రాన్ని దిక్సూచిగా నిలిపామన్నారు.

ఎన్నో అపనమ్మకాల మధ్య ఉద్యమం మొదలు పెట్టాం
20 ఏళ్ల కిందట జలదృశ్యంలో గులాబీ జెండా ఎగిరిందని, ఎన్నో అపనమ్మకాల మధ్య పార్టీ ఏర్పడిందని సిఎం కెసిఆర్ అన్నారు. స్వాతంత్య్రోద్యమంలోనూ ఎన్నో ఎదురుదెబ్బలు తగిలినా పోరాటం ఆగలేదన్నారు. ఆ పోరాటంలో నిజాయతీ ఉంది… కాబట్టే అంతిమంగా విజయం దక్కిందన్నారు. తెలంగాణకు కూడా అదే పద్ధతి నేర్పించాలని.. దాన్ని కొనసాగించాలని.. ప్రజల్లో విశ్వసనీయత కల్పించాలని స్పష్టమైన మార్గాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగామన్నారు. ఈ ఉద్యమానికి సమైక్య పాలకులు ఎన్నో ఇబ్బందులు పెట్టారన్నారు. వారు వేయని నిందలు లేవు.. పెట్టని తిప్పలు లేవన్నారు. ఎన్ని చేయాలో అన్ని చేశారన్నారు. దేశానికి స్వాతంత్య్ర ఉద్యమంలో గాంధీజీ 287 సార్లు ఇచ్చిన ఆందోళన పిలుపులు విఫలమయినా పోరాటాన్ని మాత్రం ఆపలేదన్నారు. అలాగే జలియన్ వాలా బాగ్ తర్వాత కూడా స్వాతంత్య్ర పోరాటం సాగిందో తెలంగాణ ఉద్యమం కూడా అనేక అవాంతరాలను దాటుకుని కొనసాగిందన్నారు. తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని దుష్ప్రచారం చేశారు. తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదని ప్రచారం చేశారు. తెలంగాణ వస్తే భూముల ధరలన్నీ పడిపోతాయని అన్నారు. ఏడేళ్ల పాలనలో అపోహలన్నీ పటాపంచలు చేశామన్నారు. పంజాబ్‌ను తలదన్నే రీతిలో 3కోట్ల టన్నుల ధాన్యాన్ని పండించామని కెసిఆర్ తెలిపారు. పంటల ఉత్పత్తిని చూసి ఎఫ్‌సిఐ తాము కూడా ఇక బియ్యం కొనలేమని చెప్పిందన్నారు.
సమైక్యవాదులు ఏఏరంగాల్లో తెలంగాణ వెనుకబడుతుందని దుష్ప్రచారం చేశారో… ఆ రంగంలోనే తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపామన్నారు. తలసరి విద్యుత్ వినియోగంలో, తలసరి ఆదాయం వృద్ధిలో తెలంగాణ జాతీయ స్థాయి కన్నా ముందుందన్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ట్రాల్లో కాపీకొడుతున్నాయన్నారు. మహారాష్ట్రలోని నాంధేడ్ల ప్రజలు తమను తెలంగాణలో కలపమని కోరుతున్నారన్నారు. అలాగే ఇటీవల కర్నాటకలోని రాయచూర్ బిజెపి శాసనసభ్యుడు తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాలను ఇక్కడ కూడా అమలు చేయాలని, లేని పక్షంలో తమ ప్రాంతాన్ని ఆ రాష్ట్రంలో కలపాలని బహిరంగంగానే వ్యాఖ్యానించారని కెసిఆర్ అన్నారు. ఏ రంగాల్లో అపోహలు వ్యక్తమయ్యాయో ఆయా రంగాల్లో విజయం సాధించి చూపామన్నారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడి చేస్తున్న గణాంకాలు కూడా రాష్ట్ర అభివృద్ధికి నిదర్శమన్నారు.

అభివృద్ధిలో అందరి కృషి ఉంది
తెలంగాణ అభివృద్ధి చెందడం తన ఒక్కడి వల్ల సాధ్య పడలేదని సిఎం కెసిఆర్ అన్నారు. ఇందులో అందరి కృషి ఉందని తెలిపారు. ప్రతిపక్ష శక్తులు అపుడు, ఇప్పుడూ ఎప్పుడూ ఉంటాయని, అన్నింటిని అధిగమించి ముందుకు దూసుకు పోతున్నామన్నారు. సాగునీటి ప్రాజెక్టులకు కోర్టుల్లో అనేక అడ్డంకులు సృష్టించారన్నారు. వాటన్నింటిని అధిగమించామన్నారు. రాష్ట్రంలో కులం, మతం అనే ఇరుకైన ఆలోచన తమకు లేదన్నారు. దళిత బంధు ఓ సామాజిక స్వాతన పథకమని వెల్లడించారు. ఇది దేశానికి స్ఫూర్తి అని అన్నారు. రైతు బంధు ప్రారంభించినపుడు అనేక అనుమానాలు వ్యక్తం చేశారన్నారు. ఇప్పుడు కూడా దళిత బంధు పై అవాకులు చవాకులు పేలుతున్నారన్నారు. దళిత బంధుకు అయ్యేది లక్షా 70 వేల కోట్ల రూపాయలు… తెలంగాణ కు ఓ పెద్ద లెక్క కాదన్నారు. ఈ మధ్య ఢిల్లీ వెళ్ళినపుడు కొందరు సిఎం లు ఇన్ని డబ్బులు అన్ని పథకాలకు ఎలా తెస్తున్నారని అడిగారన్నారు. దానికి సాహసం కావాలని, తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టినప్పుడు సాహాసంతో ముందుకు సాగి విజయం సాధించామని చెప్పారు. దళిత బంధును కూడా నూటికి నూరు పాళ్లు అమలు చేస్తామన్నారు. రాబోయే ఏడేళ్లలో బడ్జెట్ల ద్వారా మొత్తం రూ.23 లక్షల కోట్ల ఖర్చు చేస్తామని తెలిపారు. 2028 బడ్జెట్ రూ.4.28 లక్షల కోట్లు కాగా తలసరి ఆదాయం రూ.7.76 లక్షలు చేరుకుందన్నారు.
దళితబంధుతోనే ఆగిపోమని ఎన్నో కార్యక్రమాలు చేపడతామన్నారు. అట్టడుగున ఉన్నందునే దళితులకు మొదట కార్యక్రమం చేపట్టామని తెలిపారు. దళితబంధుపై పెట్టే పెట్టుబడి వృథా కాదన్నారు. దళితబంధు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పాటునిస్తుందని తెలిపారు. దళితబంధు ద్వారా సంపద సృష్టి జరుగుతుందని వెల్లడించారు. 75 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన చేశారా? అని ప్రశ్నించారు. దళితబంధు లాంటి పథకం అమలు చేయాలంటే బిజెపి, కాంగ్రెస్‌లు చేయలేవన్నారు. ఇతర వర్గాలకు కూడా ఏదైనా చేయాలంటే అది టిఆర్‌ఎస్ వల్ల మాత్రమే సాధ్యమన్నారు. కాగజ్‌నగర్ నుంచి గద్వాల్ వరకు.. జుక్కల్ నుంచి భద్రాచలం వరకు ప్రజా పునాది పటిష్టంగా ఉన్న ఏకైక పార్టీ టిఆర్‌ఎస్ అని కెసిఆర్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బిజెపిలు డిపాజిట్లు కోల్పోయే పార్టీలన్నారు. టిఆర్‌ఎస్ మాత్రమే తెలంగాణ అంతటా యూనిఫామ్‌గా ఉన్న పార్టీ అని అన్నారు. గులాబీ జెండా మాత్రమే తెలంగాణకు శ్రీరామ రక్షఅని, ఇదే ఉధృతి కొనసాగాలని ఆకాంక్షించారు.

మాకు బాస్‌లు తెలంగాణ ప్రజలే
మాకు బాస్‌లు తెలంగాణ ప్రజలే.. హై కమాండ్ ఎవ్వరూ లేరన్నారు. కాంగ్రెస్, బిజెపి నేతలు ఢిల్లీకి గులాంలని కెసిఆర్ వ్యాఖ్యానించారు. సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ తప్పా…..వారి స్వతహాగా నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితి అని అన్నారు. వారు ఏ కార్యక్రమం చేపట్టినా ఢిల్లీ అనుమతి కావాలన్నారు. కాని టిఆర్‌ఎస్‌కు ఆ పరిస్థితి లేదన్నారు. ప్రజల కోసం ఏ నిర్ణయం అయినా స్వేచ్చగా తీసుకునే అధికారం, అవాకాశం మనకుందన్నారు. అందుకే కాంగ్రెస్, బిజెపి పార్టీల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని అబాసు పాలుచేయడానికి నానారకాలుగా యత్నిస్తున్నారని మండిపడ్డారు. కిరికిరి గాళ్ళు, కిరాయి గాళ్లకు టిఆర్‌ఎస్ అదిరి పోయే పార్టీ కాదన్నారు. బలమైన ఆర్థిక శక్తిగా కూడా గులాబీ పార్టీ ఎదిగిందని తెలిపారు. దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడిస్తోందన్నారు. కేసులతో అభివృద్ధిని అడ్డుకోవాలని ఎన్నో ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకున్నామన్నారు. మన పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సిఎంలు ఆశ్చర్యపోతున్నారన్నారు. పథకాలకు ఇంత ఆదాయం ఎక్కడ్నుంచి వస్తుందని అడిగారన్నారు.
దేశాన్ని తట్టిలేపే అద్భుత ఉద్యమం ‘దళితబంధు’
దేశ విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ఠ ఇనుమడిస్తోందన్నారు. మన పథకాలు చూసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆశ్చర్యపోతున్నారు. పథకాలకు ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తోందని అడిగారు. భారతదేశాన్నే తట్టి లేపే అద్భుతమైన ఉద్యమం ‘దళితబంధు’ అని వ్యాఖ్యానించారు. తరతరాలుగా సామాజిక వివక్ష, ఆర్థిక వెనుకబాటు, అవకాశాల లేమితో కొట్టుమిట్టాడుతున్న జాతికి మనం అందిస్తున్న సాంత్వన, ఊరట అది అన్నారు. సాహసం లేకుంటే ఏ కార్యం సాధ్యం కాదు. కలలు కని.. ఆ కలలనే శ్వాసిస్తే సాకారమవుతాయి” అని కెసిఆర్ అన్నారు. దళితబిడ్డలు అదృష్టవంతులన్నారు. ఎన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దళితబంధును ఎవరూ కూడా ఆపలేరని, ఈ స్కీమ్ తప్పకుండా అమలు అవుతుందన్నారు. హుజూరాబాద్ తర్వాత మిగిలిన నాలుగు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నామన్నారు. మార్చి వరకు రాష్ట్రం మొత్తం విస్తరిస్తామన్నారు. నవంబర్, డిసెంబర్‌లలో యుద్ధ ప్రాతిపదికన హుజూరాబాద్‌లో దళితబంధు అమలు చేస్తామని వెల్లడించారు. తెలంగాణలో మిగిలిన 118మంది నియోజకవర్గాల నాయకులు అధికారులు, దళితబంధు కమిటీలు హుజూరాబాద్‌కి వస్తారన్నారు. దళితబంధు ఎలా వినియోగించుకున్నారని మిమ్మల్నే అడిగి తెలుసుకుంటారని,. హుజూరాబాద్‌లో దళితబిడ్డలు ఏ మాత్రం చింతిచాల్సిన అవసరం లేదన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి హెచ్చరిక
కేంద్ర ఎన్నికల సంఘం హుజురాబాద్‌లో వ్యవహరిస్తున్న తీరు సరికాదన్నారు. తన సభపై ఆంక్షలు పెట్టదం సరికాదన్నారు. ఇసి తన పరిధి దాటి ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు. భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలని, తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలని సూచించారు. ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా, బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా భారత ఎన్నికల సంఘానికి ఒక సలహా ఇస్తున్నానని తెలిపారు. చిల్లరమల్లర ప్రయత్నాలు మానుకోవాలని హెచ్చరిస్తున్నానన్నారు. కెసిఆర్ సభ పెట్టొద్దని కొందరు దిక్కుమాలిన రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హుజూరాబాద్‌లో సభ నిర్వహించొద్దంటూ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తాను హుజురాబాద్ వెళ్లకుండా ఆపినా ఇక్కడ్నుంచి చేసిన ప్రసంగాన్ని ఎంతో మంది లైవ్ లో వీక్షిస్తున్నారన్నారు. దళిత బంధుపై హుజురాబాద్ ప్రజలకు అనుమానాలు వద్దు అని అన్నరాఉ. దళితుల అండతో గెల్లు శ్రీనివాస యాదవ్ గెలవబోతున్నారన్నారు. నవంబర్ 4 నుంచి ఆయన ఆధ్వర్యంలో దళిత బంధు అమలవుతుందన్నారు. హుజూరాబాద్‌లో దళిత బంధు అమలును చూడడానికి 118 నియోజకవర్గాల నుంచి బస్సుల్లో వస్తారన్నారు. తాను కూడా దళిత బంధు అమలు అయ్యే మిగతా నియోజక వర్గాలకు ఒకటి, రెండు రోజులలో పర్యటిస్తానని అన్నారు. మార్చి కల్లా దళిత బంధు పైలట్ ప్రాజెక్టు కింద అన్ని నియోజకవర్గాల్లో అమలు చేస్తామన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ కార్యాలయాన్ని కడుతామన్నారు. ఢిల్లీ లో పార్టీ కార్యాలయాన్ని 8 నుంచి పది నెలల్లో పూర్తి చేస్తామన్నారు.
చీకట్లో ఎపి… వెలుగుల్లో తెలంగాణ
ఎపి చీకట్లో ఉంటే.. ప్రస్తుతం తెలంగాణలో వెలుగులు జీగేల్ మంటున్నాయని సిఎం కెసిఆర్ అన్నారు. తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని అప్పట్లో కొందరు ఎపి నేతలు శాపనార్ధాలు పెట్టారన్నారు. కాని ఇప్పుడు ఆ రాష్ట్రంలోనే కరెంట్ ఉండటం లేదని ఎద్దేవా చేశారు. ఎపి తలసరి ఆదాయం రూ.1.70 లక్షలైతే తెలంగాణ తలసరి ఆదాయం రూ.2.35 లక్షలకు పెరిగిందని సిఎం కెసిఆర్ అన్నారు.రాష్ట్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు, ఇతర రాష్ట్రాల ప్రజలను ఆకర్షిస్తున్నా యన్నన్నారు. దళిత బంధు ప్రకటించాక ఆంధ్రా నుంచి వేల విజ్ఞాపనలు వస్తున్నాయన్నారు. ఎపిలో కూడా టిఆర్‌ఎస్ పార్టీ పెట్టండని, గెలిపించుకుంటామని చెబుతున్నారన్నారు. తెలంగాణ పథకాలు తమకు కావాలని ఎపి ప్రజలు కోరుతున్నారని సిఎం కెసిఆర్ తెలిపారు. ఎ అదే విధంగా ఉత్తరాది నుంచి వేల సంఖ్యలో కూలీలు తెలంగాణకు వచ్చి పనిచేస్తున్నారని, తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలంటూ పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్లు వినవస్తున్నాయన్నారు. నాంథేడ్, రాయ్‌చూర్ జిల్లాల నుంచి ఈ డిమాండ్లు వచ్చాయని, దేశ, విదేశాల్లో రాష్ట్ర ప్రతిష్ట ఇనుమడిస్తోందని అన్నారు. మన పథకాలు చూసి ఇతర రాష్ట్రాల సిఎంలు ఆశ్చర్యపోతున్నారని తెలిపారు. అంతేగాక ఈ పథకాలకు ఇంత ఆదాయం ఎక్కడి నుంచి వస్తోందని అడిగారన్నారు. సాహసం లేకుంటే ఏ కార్యం సాధ్యం కాదని తెలిపారు. కలలు కని, ఆ కలలనే శ్వాసిస్తే సాకారమవుతాయన్నారు. తెలంగాణ వస్తే అరాచకం వస్తుందని.. పాలన చేతకాదని.. భూముల ధరలన్నీ పడిపోతాయని కొందరు దుష్ప్రచారం చేశారని, ఏడేళ్ల పాలనలో ఈ అపోహలన్నీ పటాపంచలు చేశామని తెలిపారు. ఎఫ్‌సిఐ కూడా కొనలేమని చెప్పే స్థాయిలో వరి పండించామని సిఎం కెసిఆర్ అన్నారు. అదే విధంగా ఆర్థికాభివృద్ధిలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచామన్నారు. తెలంగాణ రాష్ట్రం వస్తే కరెంటు సమస్యలు వస్తాయని కొందరు ఎపి నేతలు అపోహలు సృష్టించారని, కానీ ప్రస్తుతం తెలంగాణలో 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నామని, అదే ఆంధ్రాలో 24 గంటలు కరెంట్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ ప్రభుత్వం సఫలీకృతమవుతోందని సిఎం కెసిఆర్ తెలిపారు.
దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉంది
దేశంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఉందని, రూ.3కోట్ల టన్నుల ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తోందని చెప్పారు. తలసరి విద్యుత్ వినియోగంలో దేశంలో నెంబర్‌వన్‌గా ఉన్నామని, 11.5 శాతం వృద్ధి రేటుతో నెంబర్‌వన్‌గా ఉన్నామన్నారు. తెలంగాణ వస్తే చీకట్లు అలుముకుంటాయని అపోహలు సృష్టించారని, అలాంటిది ఇప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఉందని సిఎం కెసిఆర్ అన్నారు. అనేక ఆటుపోట్లు ఎదురైనా పట్టించుకోకుండా ముందుకు సాగామని సిఎం కెసిఆర్ అన్నారు.

విరాళ రూపంలో రూ. 425 కోట్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లు
దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు వచ్చిన విధంగానే టిఆర్‌ఎస్‌కు విరాళాలు వచ్చాయన్నారు. ఇలా వచ్చిన మొత్తంలో సుమారు రూ. 425 కోట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల రూపంలో ఉన్నాయన్నారు. దానిపై నెలకు రెండు కోట్ల రూపాయలు వడ్డీ రూపంలో వస్తోందన్నారు. ఈ నిధులతోనే పార్టీ నిర్వహణ కార్యక్రమాల కోసం వెచ్చిస్తున్నామన్నారు.
ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యాలయాలు
ప్రతి నియోజకవర్గ కేంద్రంలో పార్టీ కార్యాలయం ఏర్పాటు చేస్తామని సిఎం కెసిఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే 33 జిల్లాల్లో 31 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు సిద్ధంగా ఉన్నాయని, మరో రెండు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఏర్పాటు కానున్నాయన్నారు. ఢిల్లీకి పది కోట్ల రూపాయలు చెల్లించి దేశ రాజధానిలో కూడా పార్టీ కార్యాలయాన్ని త్వరగా పూర్తి చేసి ప్రారంభించు కోనున్నామని తెలిపారు.

CM KCR Full Speech at TRS Plenary

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News