Home తాజా వార్తలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నూతన భవన సముదాయాలు ప్రారంభం

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నూతన భవన సముదాయాలు ప్రారంభం

MLA and MLC quarters

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆధునిక హంగులతో నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నూతన భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి కెసిఆర్ సోమవారం ప్రారంభించారు. తెలంగాణ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, సిబ్బంది, సహాయకుల కోసం ప్రభుత్వం సుమారు నాలుగున్నర ఎకరాల సువిశాల విస్తీర్ణంలో దాదాపు రూ.166 కోట్ల వ్యయంతో వీటిని నిర్మించారు. రూ.126 కోట్లతో ఈ బహుళ అంతస్తు భవనాలను ప్రభుత్వం నిర్మించింది. మొత్తం 12 అంతస్తులతో ఐదు బ్లాకులు నిర్మించగా, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం మొత్తం 120 ప్లాట్లను ఒక్కొక్కటీ 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. అలాగే, సిబ్బంది కోసం మరో 36 ఫ్లాట్లను నిర్మించిన ప్రభుత్వం ఒక్కో ప్లాట్‌ను వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించింది. సహాయకుల కోసం 120 ఫ్లాట్లను నిర్మించగా, ఒక్కొక్కటీ 325 చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రభుత్వం నిర్మించింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఫ్లాట్లలో పెద్దల పడకగది, పిల్లల పడకగది, కార్యాలయం, వంటగదితో పాటు స్టోర్ రూంలను నిర్మించారు. గృహ సముదాయం ఆవర ణలో ఒక భద్రతా కార్యాలయాన్ని సైతం నిర్మించారు. ఐటి, మౌలిక సదుపాయాల కోసం 1.25 లక్షల చదరపు అడుగులతో ప్రత్యేకంగా బ్లాక్‌ను నిర్మించారు. మొత్తం ఎనిమిది లిఫ్ట్‌లను ఏర్పాటు చేశారు.
2012లో చేపట్టగా, ప్రస్తుతానికి పూర్తి..
ఎమ్మెల్యేలకు ఆదర్శనగర్‌లో, హైదర్‌గూడలో పాత గృహ సముదాయాలున్నాయి. అవి శిథిలావస్థకు చేరడంతో 2012లో కొత్తగా వీటి నిర్మాణం చేపట్టగా ఇప్పుడు పూర్తయ్యింది. దీంతోపాటు సహాయకులకు 120 ఫ్లాట్లను నిర్మించగా, ఒక్కో ఫ్లాట్ 325 చదరపు అడుగులు ఉంది. 276 కార్ల పార్కింగ్ వసతితో పాటు గ్రౌండ్ ఫ్లోర్‌లో సందర్శకుల సమావేశాల కోసం ప్రత్యేకంగా 23 గదుల నిర్మాణం చేశారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలను కలువడానికి వీలుగా వీటిని నిర్మించారు. ప్రాంగణంలో క్లబ్ హౌస్, వ్యాయామశాల, సూపర్ మార్కెట్‌లను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల నివాస సముదాయానికి భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలతోపాటు సిబ్బంది, సర్వెంట్ల కుటుంబాలు కూడా ఉండేందుకు వీలుగా ఈ భవనంలో ఏర్పాట్లు చేశారు. 119 మంది ఎమ్మెల్యేలతోపాటు మరో నియమిత ఎమ్మెల్యే మొత్తంగా 120 మంది సభ్యులు ఉండేందుకు వీలుగా వీటిని నిర్మించారు. మొదటి అంతస్తులో కార్యాలయం, హెల్త్ సెంటర్‌లు, సెకండ్ ఫ్లోర్‌లో ఆఫీస్, ఇండోర్ గేమ్స్, స్టోర్ రూమ్, 0.73 ఎమ్మెల్డీ సామర్థ్యంతో భూగర్భ సంపు, ఓ ఎస్టీపీ, 1,000 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవంలో స్పీకర్, మంత్రులు జగదీశ్‌రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ క్వార్టర్స్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

CM KCR inaugurates new MLA and MLC quarters