Friday, March 29, 2024

కరోనాపై కెసిఆర్ దండయాత్ర

- Advertisement -
- Advertisement -

CM KCR Invasion on Coronavirus

 

ముఖ్యమంత్రి కెసిఆర్ ఎప్పుడు ఏమి చేసినా అది సంచలనమే. ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకా ఎంతో కసరత్తు, దీర్ఘాలోచన ఉంటాయని గత ఏడేళ్ల పాలన, అంతకు ముందు ఉద్యమ సమయంలో సుమారు పదునాలుగేళ్ల కాలం అనేక సార్లు రుజువు చేసింది. కెసిఆర్ తీసుకునే ఏ నిర్ణయమైనా దాని వెనుక ప్రజాశ్రేయస్సే ఉంటుంది. కరోనా గత ఏడాది విలయతాండవం చేసిన సమయంలో ప్రభుత్వానికి ఆదాయం కన్నా, ప్రజల ఆరోగ్యం మిన్న అని భావించి రాష్ట్రంలో సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేశారు. ఇతర రాష్ట్రాలు కొన్ని నిబంధనలను సడలించినప్పటికీ కెసిఆర్ మాత్రం లాక్‌డౌన్‌ను కొనసాగించారు. ఇక్కడ బతకలేమని భావించి స్వరాష్ట్రాలకు బయలుదేరిన వలస కార్మికులను ఆపడానికి ప్రయత్నించారు. ‘వలస కార్మికులకు మా రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు’ అని నిస్సంకోచంగా ప్రకటించిన మొదటి ముఖ్యమంత్రి కెసిఆర్. అనేక ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం కూడా వలస కార్మికుల విషయంలో గందరగోళాన్ని సృష్టించే అమానుష నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కెసిఆర్ మాత్రం కష్టకాలంలో బడుగు జీవులకు అండగా నిలబడ్డారు.

మళ్ళీ ఈ సంవత్సరం సెకండ్ వేవ్ తన తడాఖాను చూపించింది. ఈ మధ్య కాలంలో కరోనా మీద ప్రజలకు కొంత అవగాహన కలిగింది. స్వీయ జాగ్రత్తలు పాటిస్తే కరోనా ప్రమాదకరం కాబోదని గ్రహించారు. మాస్కులు ధరించడం మొదలు పెట్టారు. అయినప్పటికీ కరోనా వైరస్ సోకుతూనే ఉన్నది. లాక్‌డౌన్ విధించాలని మళ్ళీ డిమాండ్ మొదలైంది. అయితే పేద ప్రజలు, కష్ట జీవులు లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఇతర రాష్ట్రాలు లాక్‌డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నప్పటికీ రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడానికి మొదట్లో ముఖ్యమంత్రి మొగ్గు చూపలేదు. హైదరాబాద్ ఏనాటి నుంచో మెడికల్ హబ్‌గా రూపుదిద్దుకోవడం, ఇరుగు పొరుగు రాష్ట్రాలలో లభించని ఆరోగ్య వసతులు హైదరాబాద్‌లో అందుబాటులో ఉండటమే చుట్టు పక్కల నాలుగైదు రాష్ట్రాల నుంచే కాక, దూర రాష్ట్రాల నుంచి కూడా రోగుల తాకిడి ఎక్కువైంది. ఆసుపత్రులు అన్నీ కిటకిటలాడిపోతున్నాయి. బెడ్స్ దొరక్క, ఆక్సిజెన్ సిలిండర్లు, ఇంజెక్షన్లు దొరక్క బాధితులు మానసికంగా విపరీతమైన ఆందోళనకు గురయ్యారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారితో కూడా తెలంగాణలో కరోనా వ్యాప్తి అధికం అయింది. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్ విధించడం ఒక్కటే మార్గం అని కెసిఆర్ భావించారు.

పౌరుల కదలికలను కట్టడి చెయ్యడం ఒకటే మార్గం అని ప్రభుత్వం భావించింది. కెసిఆర్ తీసుకున్న నిర్ణయం ఫలితంగా గత రెండు మూడు రోజులుగా పాజిటివ్ బాధితుల సంఖ్య తగ్గుతూ వస్తున్నది. మొన్నమొన్నటి వరకు అయిదు వేల వరకు నమోదవుతున్న కేసుల సంఖ్య నాలుగు వేల దిగువకు పడిపోయింది. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం ఈ నెలాఖరు వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించింది. పోలీసులు ఈ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తే పాజిటివ్ కేసుల సంఖ్య ప్రజల సహకారంతో గణనీయంగా తగ్గిపోతుందనడంలో సందేహం లేదు.

ఇటీవలి కాలంలో కొన్ని ప్రతిపక్షాలు చేసిన ప్రధానమైన విమర్శ ఈ కరోనా కాలంలో ఆరోగ్య శాఖామంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌ను తొలగించారని, అందుకు వారి రాజకీయ కారణాలు వారికి ఉండవచ్చు. వాటిని ఇక్కడ చర్చించలేము. కానీ, ఈటలను తొలగించాక ఆరోగ్యశాఖను అనాథను చెయ్యలేదు కెసిఆర్. ఆ శాఖను తన పర్యవేక్షణలోకి తీసుకున్నారు. ఇది నిజంగా గొప్ప నిర్ణయంగా భావించాలి. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో విమర్శలు ఎదురయ్యే శాఖను తన చేతిలోకి తీసుకోవడం కెసిఆర్ ప్రదర్శించిన సాహసంగా చెప్పుకోవాలి. ఆరోగ్యశాఖను తీసుకుని ఉదాసీనంగా ఉండలేదు. ఉన్నట్లుండి హఠాత్తుగా మొన్నగాంధీ ఆసుపత్రిని సందర్శించారు ఆయన. అక్కడ చికిత్స తీసుకుంటున్న వారిని సమీపం నుంచి పలకరించారు. వారు చెప్పే మాటలను చెవి వొగ్గి విన్నారు. వారికి అందిస్తున్న ఆహారాన్ని పరిశీలించారు. వారికి ధైర్యం నూరిపోశారు. భుజం తట్టి ఆరోగ్య భరోసాను అందించారు. కెసిఆర్ అంటేనే ఒక భరోసా, ఒక విశ్వాసం, ఒక నమ్మకం అనే మందును వారి మనసులకు ఇచ్చారు.

ముఖ్యమంత్రి హోదాలో ఆసుపత్రిని తనిఖీ చెయ్యడం పెద్ద విశేషమా అని కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతారు. కెసిఆర్ ముఖ్యమంత్రే కావచ్చు. కానీ ఆయన వయసు రీత్యానే కాదు ఈ మధ్యనే కరోనా బారినపడి కోలుకున్న ఆయన గడప దాటి బయటకు వెళ్లడమే సాహసం. ఆయన బయటకి రావడం అంటేనే అది మృత్యువుతో చెలగాటలాడటమే. దేశాన్ని ఏలుతున్న నరేంద్ర మోడీ ఈరోజు వరకు ఢిల్లీలోనే ఒక్క ఆసుపత్రికి వెళ్లి రోగులను పలకరించిన దాఖలా లేదు. రాష్ట్రపతి సైతం రాష్ట్రపతి భవన్‌ను దాటి బయటకు వెళ్లడం లేదు. చాలా మంది ముఖ్యమంత్రులు, గవర్నర్లు వయసులో కెసిఆర్ కన్నా చిన్నవారైనా కరోనా బాధితులు చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రులకు వెళ్లి వారిని ప్రత్యక్షంగా కలిసిన ఉదంతం లేదు. కెసిఆర్ మాత్రం ఏమాత్రం భయపడకుండా సుమారు పన్నెండు వందలమంది కరోనా వ్యాధిగ్రస్థులు చికిత్స తీసుకుంటున్న ఆసుపత్రికి వెళ్లి సంచలనం సృష్టించారు.

అదేదో ప్రచారం కోసమో, మరొక రాజకీయ ప్రయోజనాన్ని ఆశించో అని కొందరు విమర్శలు చేస్తారు. తప్పదు. కెసిఆర్ చిత్తశుద్ధికి నిదర్శనం ఆయన వరంగల్ ఆసుపత్రిని సందర్శించాలని నిర్ణయించడం. అలాగే వరంగల్ సెంట్రల్ జైలును కూడా. నగరం దాటి బయటకు వెళ్లడం ప్రమాదకరం అని తెలిసి కూడా కెసిఆర్ ప్రాణాలను పణంగా పెట్టి కరోనా మీద యుద్ధం చెయ్యడానికే సాహసించారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి స్వయంగా ఆసుపత్రులను సందర్శిస్తుంటే వైద్య సౌకర్యాలు, చికిత్స, ఎంతగా మెరుగుపడతాయో, వృద్ధి చెందుతాయో, డాక్టర్లు ఎంతగా శ్రద్ధ చూపిస్తారో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. తమ పని తీరును సాక్షాత్తు ముఖ్యమంత్రే పరిశీలిస్తుంటే వైద్యశిఖామణులకు అంతకు మించిన ఆనందం మరొకటి ఉంటుందా? మెచ్చుకోలుగా ముఖ్యమంత్రి ఒక్క మాట అంటే వైద్యులకు సరికొత్త ఊపిరిని అందిస్తుందనడంలో సందేహం లేదు. ఏమైనప్పటికీ కెసిఆర్ అప్రమత్తంగా ఉండాలి.

సెకండ్ వేవ్ ఉధృతంగా చెలరేగిపోతున్నది. ఈ సమయంలో పర్యటనలు చెయ్యడం చాలా రిస్క్‌తో కూడిన వ్యవహారం. ముఖ్యమంత్రి వెంట వెళ్లే అధికారులు జాగ్రత్తగా ఉండటంతో పాటు తమ ముఖ్యమంత్రిని కూడా కంటికి రెప్పలా చూసుకోవాలి. శారీరక బలం కన్నా కెసిఆర్‌కు మానసిక బలం వేల రెట్లు అధికం. ప్రజల కోసం ఎంతకైనా తెగించగల స్థైర్యం ఆయనకు ఉన్నది. కరోనా మీద కెసిఆర్ మొదలు పెట్టిన యుద్ధంలో ఆయన ఘన విజయాన్ని సాధించాలని యావత్ తెలంగాణ రాష్ట్రం కోరుకుంటున్నది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News