Home Default ఆ చరిత్రను చాటుకునేందుకే తెలుగు మహాసభలు

ఆ చరిత్రను చాటుకునేందుకే తెలుగు మహాసభలు

KCR

హైదరాబాద్: మహాసభల సందర్భంగా తెలుగు భాషలోని అన్ని ప్రక్రియలకు సంబంధించి ప్రత్యేక వేదిక ద్వారా ప్రదర్శనలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు తెలిపారు. బుధవారం మహాసభల ఏర్పాట్లపై ప్రగతి భవన్ లో అధికారుల సమావేశంలో సిఎం మాట్లాడుతూ….. ప్రతీ రోజు సాయంత్రం ఎల్‌బి స్టేడియంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలన్నారు.  ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో తెలుగు సంఘాలున్నాయని, దేశంలో చాలా రాష్ట్రాలో తెలుగు మాట్లాడే ప్రజలు, సంఘాలున్నాయని వివరించారు.

దేశ, విదేశాల్లో పరిపాలన, రాజకీయాలతో పాటు చాలా రంగాల్లో ఉన్నత స్థితికి చేరుకున్న తెలుగు వారందరినీ తెలంగాణలో జరిగే మహాసభలకు ఆహ్వానించాలన్నారు. అమెరికా సహా తెలుగు వారు ఎక్కువగా ఉన్న దేశాల్లో, ఎపి సహా తెలుగు వారున్న రాష్ట్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి ఆహ్వానించాలని చెప్పారు.

స్వాగత తోరణాలు ఏర్పాటు చేయాలని సూచించారు. తెలుగు భాషలో పద్యాలు, పాటలు, వివిధ ప్రక్రియలకు సంబంధించిన ఆడియో ప్రతీ చోట వినిపించాలన్నారు. ప్రతీ ప్రక్రియ ప్రదర్శనకు వేర్వేరు వేదికలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్ స్టేషన్‌లో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధులకు బస, రవాణా, భోజన సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించారు. సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ శాఖలు, జిహెచ్‌ఎంసి, హెచ్‌ఎండిఎ, హెచ్‌ఎండబ్లూ, ఎస్‌ఎస్‌బి పూర్తి సమన్వయంతో పని చేయాలన్నారు. హైదరాబాద్ లో డిసెంబర్ 15 నుంచి 19వ తేదీ వరకు ఐదు రోజుల పాటు ప్రపంచ తెలుగు మహాసభలు జరగనున్న విషయం తెలిసిందే.