Home తాజా వార్తలు రెవెన్యూ చట్టానికి దిశ…

రెవెన్యూ చట్టానికి దిశ…

పురుడు పోసుకోనున్న అవినీతి రహిత, విప్లవాత్మక శాసనం

రెండు మూడు విభాగాలుగా చేసి ముగ్గురు లేదా నలుగురు సీనియర్ అధికారులకు రూపకల్పన బాధ్యత
33 మంది కలెక్టర్లు, మంత్రులతో 8గంటల పాటు సిఎం భేటీ
భూములకు శాశ్వత ప్రాతిపదికన హక్కుల కల్పన
మ్యుటేషన్లలో మార్పులు చేర్పులపై కీలక నిర్ణయాలు
రిజిస్ట్రేషన్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
ఇంటికే నేరుగా పోస్టులో పట్టాదారు పాసు పుస్తకం

మన తెలంగాణ/ హైదరాబాద్: నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా రూపకల్పన ను రెండు, మూడు భాగాలుగా విభజించి, ముగ్గురు లేదా నలుగురు సీనియర్ అధికారులకు బాధ్యతలను అప్పగించాలని కెసిఆర్ నిర్ణయించినట్టుగా తెలిసింది. అవినీతిరహిత, విప్లవాత్మకమైన విధానాన్ని అమల్లోకి తీసుకు రావాలన్న ఉద్ధేశ్యంతోనే కొత్త చట్టాలకు రూపకల్పన చేస్తున్నట్టు సిఎం కలెక్టర్లకు దిశానిర్ధేశం చేసినట్టుగా సమాచారం. మ ంగళవారం ప్రగతిభవన్ వేదికగా అన్ని జిల్లాల క లెక్టర్లతో పాటు మంత్రులతో కెసిఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. సుమారు 8 గంటల పాటు జరిగిన సమావేశంలో 33 జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు హాజరయ్యారు. కొత్త రెవెన్యూ చట్టం రూపకల్పనపై అన్ని జిల్లాల కలెక్టర్ల అభిప్రాయాలను కెసిఆర్‌తో అడిగి తెలుసుకున్నట్టుగా తెలిసింది. నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా కూర్పు తుది దశకు చేరిన నేపథ్యంలో కలెక్టర్లు, మంత్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలన్న ఉద్ధేశ్యంలో భాగంగా కెసిఆర్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వారి అభిప్రాయాలు, సూచనలు, సలహాలు స్వీకరించాలని కెసిఆర్ నిర్ణయించారు. అందులో భాగంగానే మూడు చట్టాలే కీలక ఎజెండాగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమయ్యిందని, ఈ నేపథ్యంలో కొత్త చట్టాల రూపకల్పన, లక్షం, దానివెనుక ఉన్న ప్రభుత్వ లక్ష్యాలను సిఎం కెసిఆర్ వారికి వివరించినట్టుగా తెలిసింది.
60 రోజుల కార్యాచరణపై దిశా నిర్దేశం
కొత్త రెవెన్యూ చట్టంతో పాటు పంచాయతీరాజ్, పురపాలక చట్టాల అమలుకు సంబంధించి కలెక్టర్ల సలహాలు, సూచనలను సిఎం పరిగణలోకి తీసుకున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో పట్టణాలు, గ్రామాల అభివృద్ధికి నిర్ధేశించిన 60 రోజుల కార్యాచరణపై సిఎం కెసిఆర్ అధికారులకు దిశా, నిర్ధేశం చేసినట్టుగా తెలిసింది. శాశ్వత ప్రాతిపదికన భూములకు పూర్తిస్థాయి హక్కుల కల్పన దిశగా కొత్త రెవెన్యూ చట్టంలో పొందుపరచనున్నట్టు సిఎం కెసిఆర్ కలెక్టర్లతో పేర్కొన్నట్టుగా తెలిసింది. నూతన చట్టానికి సంబంధించిన ముసాయిదాను ఈ నెలాఖరులోగా సిద్ధం చేసి త్వరలో జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో దానిని ఆమోదించుకోవాలని ఆయన అధికారులతో పేర్కొన్నట్టుగా తెలిసింది.
ముఖ్యంగా రెవెన్యూకు సంబంధించిన ఫిర్యాదులు ఏయే జిల్లాలో ఎక్కువగా ఉన్నాయన్న విషయమై సిఎం కెసిఆర్ ఆరా తీసినట్టుగా సమాచారం. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాల్లోని నాలుగు, అయిదు జిల్లాల్లో రెవెన్యూ శాఖపై ఎక్కువగా ఆరోపణలు వచ్చాయని, అక్కడ దిద్దుబాటు చర్యలను చేపట్టారా లేదా అన్న విషయాలను ప్రస్తుత కలెక్టర్లను ఆయన అడిగి తెలుసుకున్నట్టుగా తెలిసింది. గ్రామాల్లో రెవెన్యూ శాఖ పనితీరు గురించి ఆయన అన్ని జిల్లాల కలెక్టర్లను అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెవెన్యూ సిబ్బందిని ఉపేక్షించవద్దని వారిపై కఠినచర్యలు తీసుకోవాలని కెసిఆర్ అధికారులకు సూచించినట్టుగా తెలిసింది. విఆర్‌ఓ వ్యవస్థను రద్దు చేయడం లేదా వేరే శాఖలో విలీనం చేయడం వలన కలిగే అనుకూల, ప్రతికూల అంశాలను కెసిఆర్ వారిని అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. బ్రిటీష్ కాలం నాటి చట్టాలే ఇంకా రెవెన్యూ శాఖలో అమలవుతున్నాయని అందులో భాగంగానే కొత్త రెవెన్యూ చట్టం అమలు చేయాలని సిఎం కెసిఆర్ వారికి వివరించినట్టుగా తెలిసింది.
ముసాయిదా రూపకల్పనకు ముగ్గురు లేదా నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు
కొత్త ముసాయిదా రూపకల్పనకు ముగ్గురు లేదా నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులకు అప్పగించాలని కెసిఆర్ నిర్ణయించినట్టుగా తెలిసింది. ఈ చట్టం ద్వారా దేశంలో విప్లవాత్మకమైన విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్టు కెసిఆర్ తెలిపారు. రెండోసారి కెసిఆర్ అధికారం చేపట్టాక కలెక్టర్లతో, మంత్రులతో సుదీర్ఘంగా సమావేశం కావడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు పథకాలు పాలన అంతా కలెక్టర్ల చేతుల్లో ఉండడం , జాయింట్ కలెక్టర్లు పూర్తిగా భూ సంబంధిత పాలనకే పరిమితం అయ్యారు. ఇప్పుడు భూ సమస్యలు, భూ సమగ్ర సర్వే, జిల్లాల్లో ఆదాయ వనరులపై జేసీలకు బాధ్యతలను అప్పగించే విషయమై ఈ సమావేశంలో కెసిఆర్ చర్చించినట్టుగా తెలిసింది. నూతన రెవెన్యూ చట్టం విధి, విధానాలు, కంక్లూజివ్ టైటిల్ యాక్ట్‌కు ముందుగా భూముల రీ సర్వే, చట్టంలోకి తీసుకోవాల్సిన అంశాలు, రెవెన్యూ శాఖ రద్దు, విలీనం, సంస్కరణలు, ఇతర అనేక అంశాలపై కెసిఆర్ చర్చించినట్టుగా తెలిసింది. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం, 124 చట్టాల్లో కాలదోషం పట్టిన వాటిని తొలగించడం విఆర్‌ఏ నుంచి తహసీల్దార్ వరకు బాధ్యతలు, అధికారాల్లో మార్పులు, విలీనాలకు రెవెన్యూ శాఖను పునర్‌వ్యవస్థీకరించడమే మేలన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమయినట్టుగా తెలిసింది.
మ్యుటేషన్లలో మార్పులు, చేర్పులపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు
కలెక్టర్లు, జేసీలకు కీలక బాధ్యతల అప్పగింత ఆర్డీఓల పరిధి, మ్యుటేషన్లలో మార్పులు, చేర్పులపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలిసింది. ప్రధానంగా అవినీతిమయంగా మారిన రెవెన్యూ రికార్డుల మార్పులు, చేర్పుల్లో తహసీల్దార్ల విశేష అధికారాలకు కోత పెట్టాలన్న నిర్ణయం కూడా తీసుకున్నట్టుగా తెలిసింది. భూ యజమాన్య హక్కులు (మ్యుటేషన్) జారీని సరళతరం చేయడం, పారదర్శకత నింపేందుకు అధికారాలను తహసీల్దార్ల నుంచి ఆర్డీఓ లేదా జాయింట్ కలెక్టర్లకు కట్టబెట్టాలన్న నిర్ణయం ఈ సమావేశం చర్చించినట్టుగా తెలిసింది. విఆర్‌ఓ, విఆర్‌ఏ వ్యవస్థ రద్దు ఆయా సిబ్బందిని వ్యవసాయ, పంచాయతీ రాజ్ శాఖలో విలీనం చేసే అంశంపై సిఎం కలెక్టర్లతో కూలంకషంగా చర్చించి నట్టుగా సమాచారం. అయితే భూముల రీ సర్వే, వ్యవసాయ భూమి హక్కులకు సంపూర్ణ భద్రత, పూర్తి భరోసానిచ్చేలా టైటిల్ గ్యారంటీ చట్టంపై సిఎం కెసిఆర్ అధికారులతో ప్రస్తావించినట్టుగా తెలిసింది. ఎపి ప్రభుత్వం ఈ బిల్లుకు ఆమోదం తెలిపిందని, రాష్ట్రంలో దీని అమలుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సీనియర్ ఐఏఎస్ అధికారులకు కెసిఆర్ సూచించినట్టుగా సమాచారం. రెవెన్యూ శాఖలోని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సిసిఎల్‌ఏ) భూమి కొలతలు నిర్వహణ విభాగాలను ఏకీకృతం చేయడం ద్వారా సత్ఫలితాలు పొందవచ్చన్న అభిప్రాయం ఈ సమావేశంలో వ్యక్తమయినట్టుగా తెలిసింది.
ముసాయిదాలో చేర్చాల్సిన అంశాలు, మార్పులపై పూర్తి స్థాయి నివేదిక
ముసాయిదాలో చేర్చాల్సిన అంశాలు, మార్పులపై పూర్తి స్థాయి నివేదికను తయారు చేయాలని కెసిఆర్ అధికారులను ఆదేశించినట్టుగా సమాచారం. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగే రిజిస్ట్రేషన్ వ్యవస్థలో మార్పుల నుంచి మొదలుకొని ఇంటికే నేరుగా పోస్టులో పట్టాదారు పాసు పుస్తకం వచ్చేలా కొత్త రెవెన్యూ చట్టంలో మార్పులకు శ్రీకారం చుట్టాలని కెసిఆర్ అధికారులతో పేర్కొన్నట్టుగా తెలిసింది. రెవెన్యూ శాఖలో అవినీతిని రూపుమాపడంలో భాగంగా మ్యుటేషన్లు, పహాణీలు, సర్టిఫికెట్లు, రెవెన్యూ వ్యవహారాలు, ఆహారభద్రత కార్డులు, పింఛన్లు వంటి కార్యక్రమాలకు కీలక నియమావళిని రూపొందించాలని నిర్ణయించినట్టుగా సమాచారం. మున్సిపల్ ఎన్నికల తరువాత పాలనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఉండాలని కెసిఆర్ అధికారులతో పేర్కొన్నట్టుగా తెలిసింది. సంక్షేమ పథకాల అమలు, చట్టాల్లో సమూ ల సంస్కరణలు అవినీతి రహిత పాలన దిశగా ప్రత్యేక చర్యలకు ఈ సమావేశం కీలకంగా భావించిన ప్రభుత్వం ఆ దిశగా ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. నేడు కూడా కలెక్టర్లతో సిఎం కెసిఆర్ సమావేశమయ్యే అవకాశముందని అధికార వర్గాలు తెలిపాయి. బుధవారం ఉదయం 9 గంటలకు కలెక్టర్లతో కలిసి సిఎం కెసిఆర్ కోమటిబండకు ఫీల్డ్ విజిట్‌కు వెళ్లనున్నారు.

 CM KCR Meeting with Collectors in Pragathi Bhavan