Home తాజా వార్తలు ఉపాధి ఊతం

ఉపాధి ఊతం

kcr

కులవృత్తులకే కాదు, బిసిల్లోని చిరు వ్యాపారులకు వందశాతం సబ్సిడీతో రుణాలు
జిల్లాల వారీగా జాబితాలు సిద్ధం చేయండి
మైనారిటీ రెసిడెన్షియల్స్ సహా ఎక్కడ సీట్లు మిగిలినా వెనుకబడిన తరగతులకే
గీత కార్మికులకు త్వరలో మరిన్ని వరాలు
సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్

మన తెలంగాణ/ హైదరాబాద్: కుల వృత్తులు చేసుకునే వారికే కాకుండా చిన్న వ్యాపారాలు చేసే వారికి, పండ్లు, కూరగాయలు, పూలు అమ్ముకునే వారికి, మెకానిక్ పనులు చేసుకునే వారికి, ఇంకా ఇతరత్రా పనులు చేసుకునే బిసిలను గుర్తించి ఆర్థిక చేయూత అందివ్వాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వెనుకబడిన తరగతుల(బిసి)కు చెందిన వారు ఆర్థికంగా బలోపేత మయ్యేలా జిల్లాల వారీగా స్వయం ఉపాధి పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించాలన్నారు. ఇందు కోసం జిల్లా స్థాయిలో ఆర్థిక సహాయం అవసరమైన వారి జాబితాలు రూపొందించాలని సూచించారు. చిన్న వ్యాపారాలు చేసే వారికి, కులవృత్తులు నిర్వహించుకునే వారికి బ్యాంకులతో సంబంధం లేకుండానే వందశాతం సబ్సిడీతో ఆర్థిక సహాయం నేరుగా అందించాలని చెప్పారు. బిసి వర్గాల సంక్షే మం కోసం తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ శనివా రం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి, మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపి సుమన్, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, గణేష్ గుప్తా, మాజీమంత్రి బస్వరాజు సారయ్య, ప్రభుత్వ కార్యదర్శి బుర్ర వెంకటేశం, బిసి కార్పొరేషన్ ఎండి లోకేశ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయండి : కులాల్లో కులవృత్తులు చేసుకుని జీవించే వారికి అవసరమైన పనిముట్లు కొనుగోలు చేసేందుకు, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి అవసరమైన పెట్టుబడి కోసం ఆర్థికసాయం అందించాలి. దీనికోసం గ్రామాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేయాలి. ప్రతీ జిల్లాలో కలెక్టర్ చైర్మన్ గా, బిసి సంక్షేమ అధికారి కన్వీనర్ గా, జాయింట్ కలెక్టర్, డిఆర్‌డిఎ పిడి సభ్యులుగా కమిటీని నియమించాలి. లబ్దిదారుల జాబితా తయారు కాగానే, ఆర్థిక సహాయం అందించాలి. బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా లబ్దిదారులకు సహాయం అందించాలి. బిసి సంక్షేమ శాఖకు, ఎంబిసి కార్పొరేషన్ కు కేటాయించిన నిధులను ఇందుకోసం వినియోగించాలి” అని సిఎం కెసిఆర్ అధికారులను ఆదేశించారు.
ఏ స్కూళ్ళలో సీట్లు మిగిలినా బిసిలకేః“రాష్ర్టంలో వెనుకబడిన తరుగతుల కులాల వారి అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకున్నది. పెద్ద ఎత్తున బిసి రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేసింది. వచ్చే ఏడాది నుంచి మరో 119 రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తాం. మైనారిటీ రెసిడెన్షియల్స్ లో ఎక్కడైనా సీట్లు మిగిలితే వాటిని కూడా బిసిలకే కేటాయిస్తాం. బిసి కులాల్లోని పిల్లలకు మంచి విద్య అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామ”ని సిఎం కెసిఆర్ తెలిపారు.
గీత కార్మికులకు త్వరలో మరిన్ని వరాలుః
కల్లు దుకాణాల పునరుద్ధరణతో పాటు చెట్ల రకం రద్దు చేయడం వల్ల గీత కార్మికులకు మేలు కలుగుతున్నదని సిఎం కెసిఆర్ అన్నారు. ఇంకా గీత కార్మికులకు కావాల్సిన విషయాలపై మరో సారి అధ్యయనం చేసి మరిన్ని నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
యాదవులకు ఇప్పటికే 65 లక్షల గొర్రెలు పంపిణీ చేశామని, యాదవులు ఆర్థికంగా బలోపేతమవుతున్నారన్నారు. పెద్ద ఎత్తున చేపల పెంపకం వల్ల ముదిరాజ్, గంగ పుత్రులు తదితర మత్స్య కారులు లాభం పొందుతున్నారని వివరించారు. చేనేత రంగాన్ని ఆదుకోవడానికి తీసుకున్న చర్యల కారణంగా పద్మశాలి కులస్తులకు మేలు కలిగిందని, ఇంకా చాలా కులాలు కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నాయని, అలాంటి వారికి చేయూత అందివ్వాలని, విశ్వ కర్మలు, రజకులు, నాయీ బ్రాహ్మణులతో పాటు ఎంబిసి కులాల వారికి ఆర్థిక చేయూత అందివ్వాలన్నారు. కుల వృత్తులు చేసుకునే వారికే కాకుండా చిన్న వ్యాపారులు చేసే వారికి, పండ్లు, కూరగాయలు, పూలు అమ్ముకునే వారికి, మెకానిక్ పనులు చేసుకునే వారికి, ఇంకా ఇతరత్రా పనులు చేసుకునే బిసిలను గుర్తించి ఆర్థిక చేయూత అందివ్వాలి” అని సిఎం కోరారు.
అసెంబ్లీలో భేటీ:
ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్ వద్ద సమావేశానికి ముందు బిసి సంక్షేమంపై శాసనసభ ప్రాంగణంలో భేటీ జరిగింది. స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఛాంబర్‌లో జరిగిన భేటీలో స్పీకర్‌తో పాటు, శాసనమండలి చైర్మన్ కె.స్వామి గౌడ్, ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న, మాజీ మంత్రి బస్వరాజు సారయ్యలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కుల వృత్తులకు ఏ పని ముట్లకు రుణాలు ఇవ్వాలి, వృత్తేతర పనిలో ఉన బిసిలకు ఎలాంటివి అమలు చేయాలనే అంశాలపై చర్చించారు. ఒక అభిప్రాయానికి వచ్చిన అనంతరం వీరంతా నేరుగా ప్రగతిభవన్‌కు వెళ్ళి ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతో సమావేశమయ్యారు.