Home తాజా వార్తలు 7జోన్లు, 2మల్టీ జోన్లు

7జోన్లు, 2మల్టీ జోన్లు

kcr

మంత్రివర్గం ఆమోదం తరువాత రాష్ట్రపతికి, పునర్విభజనపై సిఎం కెసిఆర్ ప్రకటన

ఉమ్మడి రాష్ట్రం అన్యాయాలకు స్వస్తి, జోన్లకు ఆలయాల పేర్లు  

కాళేశ్వరం జోన్ (28.29 లక్షల జనాభా) :
జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల,
ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లాలు
బాసర జోన్ (39.74 లక్షలు) :
ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల
రాజన్న జోన్ (43.09 లక్షలు) :
కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్
భద్రాద్రి జోన్ (50.44 లక్షలు) :
కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్,
వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్
యాదాద్రి జోన్ (45.23 లక్షలు) :
సూర్యాపేట, నల్లగొండ,
యాదాద్రి భువనగిరి, జనగామ
చార్మినార్ జోన్ (1.03 కోట్లు) :
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి
జోగులాంబ జోన్ (44.63 లక్షలు) :
మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల,
నాగర్‌కర్నూల్, వికారాబాద్
మల్టీ జోన్ 1 : కాళేశ్వరం, బాసర, రాజన్న,
భద్రాద్రి (1.61 కోట్ల జనాభా) జోన్‌లు
మల్టీజోన్ 2 : యాదాద్రి, చార్మినార్,
జోగులాంబ (1.88 కోట్లు) జోన్‌లు

మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రంలో ఏడు జోన్లను, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ స్థానికత కలిగినవారికి జరిగిన అన్యాయం పునరావృతం కాకుండా ఉండేలా జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థల ను ఏర్పాటు చేస్తున్నట్లు సిఎం ప్రకటించారు. ఉద్యోగ సం ఘాల ప్రతినిధుల నుంచి అందిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న దేవీప్రసాద్ నివేదికను పురస్కరించుకుని ముఖ్యమంత్రి ప్రగతి భవన్‌లో గురువారం వివిధ శాఖల అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో జోన్ల విషయంలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తరువాత పరిపాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం జిల్లాలను పునర్ వ్యవస్థీకరించడం తో జోన్ల వ్యవస్థను కూడా పునర్ విభజన చేయాల్సిన అవసరం ఏర్పడిందని, ఇందుకోసం ఉద్యోగ, ఉపాధ్యాయ సం ఘాల ప్రతిపాదనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న సిఎం ఏడు జోన్లను, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ట్లు ముఖ్యమంత్రి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని ఉదోగ్య సంఘాల ప్రతినిధులందరికీ తెలిజేయడంతో పాటు అనుబంధ అంశాలను చర్చించేందుకు తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్ల భవనంలో శుక్రవారం సమావేశం జరగనుంది. సమావేశంలో ఈ అంశాలకు సంబంధించి చర్చలు జరిగిన తర్వాత వెలువడే అభిప్రాయాలను ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం సిఎస్ దీని ఆధారంగా ఒక నోట్‌ను తయారుచేసి ప్రభుత్వానికి అందజేస్తారు. ఈ నివేదికను మంత్రివర్గంలో చర్చించి అవసరమైన సవరణలు, మార్పులు చేర్పులు చేసి ఆమోదం తెలుపుతుంది. అనంతరం ప్రభుత్వం దీన్ని రాష్ట్రపతి ఆమో దం కోసం పంపుతుంది. సమైక్య రాష్ట్రంలో 1974లో రాష్ట్రపతి ఉత్తర్వులు రూపొందడం ఇప్పుడు కూడా అమలవుతుండడంతో దానికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు సవరణలు చేస్తున్నందున రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. ఈ మొత్తం వ్యవహారాన్ని స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షించి కొత్త జోన్లు, మల్టీ జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చేలా చొరవ తీసుకుంటారని ఆ ప్రకటన స్పష్టం చేసింది. ఈ సమావేశంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కె జోషి, సీనియర్ అధికారులు అజయ్ మిశ్రా, నర్సింగ్‌రావు, శివశంకర్, అదర్ సిన్హా, భూపాల్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు దేవీప్రసాద్, కారెం రవీందర్‌రెడ్డి, శ్రీనివాసగౌడ్, ఎంపి వినోద్‌కుమార్, శాసనసభ్యులు రెడ్యానాయక్, ఆరూరి రమేష్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎంఎల్‌సి రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సమైక్య రాష్ట్రంలో మొత్తం ఆరు జోన్లు ఉన్నప్పటికీ తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు జోన్లు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు అవసరార్ధం తెలంగాణ ప్రభుత్వం ఏడు జోన్లను, రెండు మల్టీ జోన్లను ఏర్పాటు చేసింది. అన్ని జిల్లాల భౌగోళికతను, సామాజికాభివృద్ధిని, జనాభాను పరిగణనలోకి తీసుకుని ఏ జిల్లాను ఏ జోన్‌లోకి తీసుకెళ్ళడం ద్వారా న్యాయం జరుగుతుందో లోతుగా చర్చించింది.
జోన్లకు ఆలయాల పేర్లు : జోన్లకు ముఖ్యమంత్రి కెసిఆర్ ఆధ్యాత్మికతను జోడించారు. ప్రతీ జోన్‌కు ఆలయాల పేర్లను పెట్టారు. ఆయా జోన్ పరిధిలో ప్రసిద్ధి చెందిన ఆధ్యాత్మిక క్షేత్రాల పేర్లు పెట్టారు. హైదరాబాద్‌కు చార్మినార్ ప్రతీకగా ఉన్నందున రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డిలను కూడా ఈ జోన్‌లోకి తీసుకొచ్చి ‘చార్మినార్ జోన్’గా నామకరణం చేశారు. మల్టీ జోన్‌లకు మాత్రం పేర్లు పెట్టలేదు. సమైక్య రాష్ట్రంలో ఆరు జోన్లు ఉన్నప్పటికీ వీటికి నెంబర్లు మాత్రమే ఉన్నాయిగానీ పేర్లు లేవు. ఇప్పుడు ఆయా జోన్లకు ప్రాశస్తం కలిగిన ఆధ్యాత్మిక క్షేత్రాల పేర్లు పెట్టడం గమనార్హం.