Thursday, April 25, 2024

ఎదుటివాళ్లను ప్రేమించడమే అత్యుత్తమ మతం

- Advertisement -
- Advertisement -

CM KCR participated in Christmas celebrations

ఇతర మతస్థులపై దాడులు గొప్ప విషయం కాదు ఎవరైనా దాడులకు
పాల్పడితే సహించేదిలేదు టిఆర్‌ఎస్ అధికారంలో ఉన్నంతవరకు
అన్నివర్గాలకు స్వేచ్ఛ ఎవరు కోరకున్నా అన్నిమతాల పండుగలను
అధికారికంగా నిర్వహిస్తున్నాం : సిఎం కెసిఆర్
ఎల్‌బి స్టేడియంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో కేక్ కట్ చేసిన ముఖ్యమంత్రి

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రతి మనిషి ఎదుటి వారిని ప్రేమించగలగాలని… ఇదే అన్ని మతాల సారాంశమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అన్నారు. ఎదుటివారిని ప్రేమించడమే అన్నింటికంటే అత్యుత్తమ మతమన్నారు. అదే మానవజాతి అభిమతం కావాలని అభిలాషించారు. ఇతర మతస్థులపై దాడి చేయడం గొప్ప విషయం కాదన్నారు. మతం ఉన్మాద స్థాయికి చేరితేనే ప్రమాదమని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. ఈ పరిణామమే సమాజానికి చెడు తలపెడుతుందన్నారు. మంగళవారం ఎల్‌బి స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఘనంగా జరిగిన క్రిస్టమస్ వేడుకల్లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు.

ముందుగా కేక్ కట్‌చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ క్రిస్మస్, నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సిఎం కెసిఆర్ మాట్లాడుతూ, రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉంటుందన్నారు. ఇందులో ఎవరు ఎలాంటి అనుమానాలను పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగాజీవించే హక్కు ఉందన్నారు. దానిని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. ఆ బాధ్యతను టిఆర్‌ఎస్ ప్రభుత్వం మరింత సమర్థవంతంగా నిర్వహిస్తుందన్నారు.

మానవ మనుగడ ఎన్నో లక్షల సంవత్సరాల క్రితం ఈ భూగోళం మీద ప్రారంభమైందని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. మానవ జీవితం అతి ఉజ్వలంగా ముందుకు సాగడానికి… ఏ తరంలో చేపట్టాల్సిన పనులను ఆ తరంలో చేపట్టారన్నారు. దీని కారణంగానే ప్రస్తుతం మనం ఎంతో ప్రశాంతంగా బతుకుతున్నామన్నారు. శాస్త్రవేత్తలు ఎన్నో అమూల్యమైన విషయాలను ఈ సమాజానికి సమకూర్చారన్నారు. ప్రస్తుతం మనం నివసిస్తున్న నాగరిక సమాజానికి చేరుకోవడానికి ఎంతో మంది మహానుభావులు త్యాగాలు చేశారన్నారు. స్థూలంగా మనిషిగా ఉన్న ప్రతి మనిషి ఎదుటి మనిషిని ప్రేమించడమే అతి గొప్ప లక్షణమన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి మతం కూడా తోటివారిని ప్రేమించాలని చెబుతోందన్నారు. ఈర్షా, ద్వేషం పెంచుకోమని ఏమతం ఎప్పుడు…ఎక్కడా చెప్పలేదన్నారు.

మత బోధకుల తత్వం కూడా అదేనని అన్నారు. వారు సూచించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలు, మతాలకు చెందిన పండుగలను అధికారికంగా నిర్వహిస్తోందనారు. బోనాలు, రంజాన్, బతుకమ్మ, క్రిస్మస్ వేడుకలను జరపాలని తనను ఎవరూ కోరలేదన్నారు. ఎవరు అర్జీలు కూడా ఇవ్వలేదన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి ఈ వేడుకలను అధికారికంగా ప్రతియేటా ఘనంగా నిర్వహిస్తోందన్నారు. అన్ని వర్గాలు, అన్ని మతాలకు చెందిన ప్రజలు తమకు సమానమేనని సిఎం కెసిఆర్ వ్యాఖ్యానించారు. అందువల్ల రాష్ట్రంలో అన్ని మతాల వారికి సంపూర్ణ రక్షణ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. అందరూ క్షేమంగా ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. ఎవరైనా మతపరమైన దాడులకు పాల్పడితే సహించేది లేదని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ హెచ్చరించారు.

భారత్ చాలా గొప్పది

అర్థం చేసుకుంటే…. అనుభవిస్తే భారత్ చాలాగొప్ప దేశమని సిఎం కెసిఆర్ అన్నారు. అన్ని మతాలకు సమానమైన గౌరవాన్నిస్తూ అన్ని పండుగలను ఘనంగా జరుపుకునే పవిత్రమైన భూమి అని సిఎం కెసిఆర్ గుర్తుచేశారు. ప్రపంచంలోనే అత్యంత విభిన్నమైన, అందమైన దేశం… భారత్ అని వ్యాఖ్యానించారు. ఈ దేశంలో అన్ని మతాల పండుగలు ఘనంగా జరుగుతాయన్నారు. నెల రోజులు గడువక ముందే ఓ పండగ వస్తుందని, ఇండియా భిన్న మతాలు, భిన్న జాతులు ఉన్న బ్యూటిఫుల్ కంట్రీ అని వ్యాఖ్యానించారు. ప్రధానంగా దసరా, దీపావళి, రంజాన్, క్రిస్మస్ ఇలా అన్ని పండుగలను ఘనంగా జరుపుకోవచ్చునని అన్నారు. ఒక పండగ అయిన తరువాత మరో పండుగ వస్తునే ఉంటుందన్నారు. సంవత్సరమంతా అన్ని వర్గాలకు చెందిన ఏదో ఒక పండుగను మనం చేసుకుంటూనే ఉంటామన్నారు. మిగతా దేశాల్లో ఇలాంటి పరిస్థితి ఉండదన్నారు.

ఒకటి, రెండు పండగలు మినహా మరే వర్గానికి చెందిన పండగలను జరుపుకునే పరిస్థితి లేదన్నారు. అందుకే భారత దేశం అతి పెద్ద లౌకిక…ప్రజాస్వామ్య దేశమని సిఎం కెసిఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2015 నుంచి అన్ని వర్గాలకు చెందిన ప్రధామైన పండుగలను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. అయితే గత సంవత్సరం కరోనా కారణంగా క్రిస్మస్ వేడుకులను నిర్వహించకోలేకపోయమాన్నారు. ఈ సంవత్సరం కూడా ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. కరోనాతో రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధికంగా కొన్ని సమస్యలు ఎదుర్కొన్న మాట వాస్తవమే అయినప్పటికీ… ప్రస్తుతం ఆర్థికంగా చాలా ముందుకు సాగుతున్నామన్నారు.

అందరి సహకారంతోనే రాష్ట్ర ప్రగతి

ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను కేవలం ఏడేళ్ల కాలంలోనే అగ్రస్థానంలోకి తీసుకెళ్లగలిగామన్నారు. ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలబెట్టగలిగామన్నారు. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పడిన 2014లో రాష్ట్ర తలసరి ఆదాయం కేవలం లక్ష కోట్లు ఉండగా, ప్రస్తుతం 2.37 లక్షలకు చేరుకుందని సిఎం కెసిఆర్ గుర్తు చేశారు. అలాంటి రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో చిత్తుశుద్ధితో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రంలో పంటల దిగుబడి బాగా పరిగిందన్నారు. చివరకు రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు కూడా చేయలేకపోతోందన్నారు. దీనిపైనే కేంద్రంతో యుద్దం కొనసాగిస్తున్నామన్నారు. ప్రస్తుతం పంటల ఉత్పత్తిలో దేశానికి అన్నం పెట్టే స్థాయికి రాష్ట్రం చేరుకుందన్నారు. ఈ ప్రగతిలో రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యక్తి భాగస్వామ్యం ఉందన్నారు. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చాలన్నదే తన లక్షమన్నారు. దీని కోసం అనేక లక్ష్యాలను సాధించాల్సి ఉంటుందన్నారు.

ఇందుకు అన్ని వర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణ సహకారం…దీవెనలు అందించాలని ఈ సందర్భంగా సిఎం కెసిఆర్ విజ్ఞప్తి చేశారు.ఏసు దీవెనలతో అందరూ చల్లగా ఉండాలన్నారు. కరోనా మహమ్మారి నుంచి దేవుడి దయవల్ల అందరూ బయటపడాలన్నారు. క్రిస్టియన్లకు ఉన్న సమస్యలను చాలా వరకు పరిష్కరించామని… ఇంకా ఉన్న సమస్యలను గుర్తించి వచ్చే కేబినెట్లో చర్చించి పరిష్కారం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ వేడుకల్లో మంత్రులు కొప్పుల ఈశ్వర్, మహమ్మూద్‌అలీ, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డితో పాటు పలువురు క్రైస్తవ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం వారితో కలిసి సిఎం విందు భోజనంలో పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News